జర్మనీ: ఈ చిన్నారి హిట్లర్ నుంచి ఎలా తప్పించుకుంది? ఇప్పుడెలా ఉంది?
బ్రిటిష్ దళాలు సరిగ్గా 73 ఏళ్ళ కిందట జర్మనీలోని బెర్గెన్ బెల్సెన్‌లో నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరంలోకి ప్రవేశించాయి. వేలాది మంది ప్రాణాలు కాపాడాయి. అలా ప్రాణాలతో బయట పడిన వారిలో ఒకరు హెట్టీ వెరొల్మి.
విముక్తి పొందిన కొన్ని రోజులకు 1945లో బీబీసీ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఈ మధ్యే మళ్ళీ బెల్సెన్ వెళ్ళారు. మళ్ళీ బీబీసీతో మాట్లాడారు. తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
సరిగ్గా 73 ఏళ్ళ కిందట బ్రిటిష్ దళాలు గేట్లు తోసుకుని లోపలికి వచ్చినప్పుడు హెట్టీ అక్కడే ఉన్నారు. అక్కడే 52 వేల మంది ప్రజలను అప్పుడు చంపేశారు.
హెట్టీని ఆమె తల్లితండ్రులు, ఇద్దరు సోదరులతో పాటు హాలండ్ నుంచి బెల్సెన్‌కు తరలించారు. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్ళు.
నిర్భంద శిబిరానికి విముక్తి లభించినపుడు, హెట్టీ తన శక్తినంతా కూడగట్టుకుని బీబీసీతో మాట్లాడారు. తన కథంతా చెప్పారు. చిన్నారి హెట్టీ ఆడియో టేపు ఇప్పటికీ బీబీసీ ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉంది.
ఆనాడు అనుభవించిన బాధలు, కష్టాల గురించి ఆమె జర్మన్ భాషలో మాట్లాడారు. తన తండ్రి తృటిలో మృత్యువును తప్పించుకున్న సందర్భాన్ని వివరించారు.
ఆస్ట్రేలియాలో ఆమె కొత్త జీవితం ప్రారంభించారు. తల్లి అయ్యారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించారు. కానీ, బెల్సెన్ లోని చాలా మంది చిన్నారుల కథ అక్కడే ముగిసింది.
‘‘ఈ తరానికి జర్మన్‌లో జరిగిన సామూహిక మానవ హననం గురించి తెలియదు. నేను రేపు లేకపోయినా.. ఎవరో ఒకరు ఇలాంటి మారణహోమం ఒకటి జరిగిందని ప్రపంచానికి చెప్పాలి. చరిత్రను ఎప్పటికీ గుర్తు చేయాలి’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)