కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

- రచయిత, మేఘా మోహన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. జనాలు ఇళ్లను దాటి, బయట అడుగుపెట్టే వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇదే కొందరికి శాపంగా మారుతోంది. గృహ హింస బాధితులు బయటికి రాలేక, అనేక యాతనలు అనుభవిస్తున్నారు.
బ్రిటన్‌లో గృహ హింస హెల్ప్ లైన్‌కు వచ్చే ఫోన్ కాల్స్ ఈ వారాంతపు రోజుల్లో 65 శాతం పెరిగాయి. పేద దేశాల్లో, చిన్న ఇళ్లల్లో ఉండే బాధితులకు ఫిర్యాదు చేసే వీలు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయని ఐరాస హెచ్చరిస్తోంది.
లాక్‌డౌన్ వల్ల ఇళ్లల్లోనే చిక్కుకుపోయి గృహ హింస నుంచి బయటపడలేకపోతున్నామని చెబుతున్న ఇద్దరు మహిళలతో బీబీసీ మాట్లాడింది.
గీతా, భారత్
గమనిక: భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్ అమల్లోకి రాకముందు గీతాతో మాట్లాడాం.
ఉదయం ఐదు గంటలకు గీతా నిద్ర లేచారు. ఆమె భర్త విజయ్ కింద నేలపై పడి ఉన్నారు. గట్టిగా గురక పెడుతున్నారు.
ముందు రోజు రాత్రి ఆయన తప్పతాగి ఇంటికి వచ్చారు. ఆయన ఆటో డ్రైవర్. కరోనావైరస్ వ్యాప్తి వల్ల జనం బయట పెద్దగా తిరగట్లేదు. విజయ్ రోజుకు రూ.1500 ఆదాయం వచ్చేది. ఇప్పుడది రూ.700కు పడిపోయింది.
గోడకు మందు సీసాను విసిరికొడుతూ, ‘‘ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుంది?’’ అంటూ కేకలేశాడు విజయ్. పిల్లలు వణుకుతూ గీతా వెనుకకు వచ్చి దాక్కున్నారు.
అరిచిన తర్వాత ఇంట్లో ఉన్న చిన్న పరుపు మీద విజయ్ పడుకుండిపోయారు.

''పిల్లలను సముదాయించేందుకు కొంత సమయం పట్టింది. ఆయన ఇంతకన్నా కోపంగా ప్రవర్తించడం వాళ్లు చాలా సార్లు చూశారు. కానీ, గత కొన్ని వారాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా మారింది. వస్తువులను గోడకేసీ కొట్టడం, నన్ను జుట్టు పట్టి లాగడం వాళ్లు చూశారు'’ అని చెప్పారు గీతా.
భర్త తనను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కించడమే మానేశారు గీతా. పెళ్లైన రాత్రే ఇది మొదలైంది. ఓసారి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ, పిల్లలను తన వెంట భర్త తీసుకుపోనివ్వలేదు.
ఓ గ్రామీణ ప్రాంతంలో పేదలు ఉండే వాడలో వాళ్లు ఉంటున్నారు.
రోజూ తాగు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తారామె. ఆ తర్వాత పక్కింటి వాళ్లతో ముచ్చట్లు పెడుతూ, కూరగాయాల తోపుడు బండి కోసం వేచిచూస్తుంటారు.
కూరగాయలు కొన్నాక, టిఫిన్ వండటం మొదలుపెడతారు. విజయ్ ఇంట్లో నుంచి రోజూ 7 గంటలకు బయటకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు తిరిగివస్తారు. కాసేపు కునుకు తీసి, పిల్లలు స్కూల్ నుంచి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ బయటకువెళ్తారు.
"మార్చి 14న స్కూళ్లను మూసేయడంతో పరిస్థితులు మారాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ల వల్ల నా భర్త మరింత చికాకుకు గురవుతున్నారు" అని గీతా చెప్పారు.
“సాధారణంగా ఆయన నాపైనే కోపమంతా ప్రదర్శిస్తుంటారు. కానీ, చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలపై అరవడం మొదలుపెట్టారు. ఆయన దృష్టిని మరల్చేందుకు నేనేదైనా అంటుంటా" అని వివరించారు గీతా.
వాళ్లుండే చోట కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు బట్టలు కుట్టే పని, చదవడం, రాయడం నేర్పిస్తుంటారు. భర్తకు తెలియకుండా రహస్యంగా గీతా ఈ తరగతులకు వెళ్లేవారు.
తన కాళ్లపై తాను నిలబడేందుకు, పిల్లలతో కలిసి స్వతంత్రంగా బతికేందుకు అవసరమైన నైపుణ్యాలు సంపాదించుకోవాలని గీతా కోరుకుంటున్నారు.
కానీ, 21 రోజుల లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో శిక్షణ తరగతులు ఆగిపోయాయి. ఆమెకు ధైర్యం చెప్పేవారు ఎవరూ రావట్లేదు.
విమలేశ్ సోలంకి ఓ స్వచ్ఛంద కార్యకర్త. శాంబాలీ ట్రస్టులో ఆయన పనిచేస్తుంటారు. జోధ్‌పుర్‌లో ఉన్న మహిళలకు ఈ సంస్థ సాయం చేస్తోంది.
కరోనావైరస్ వల్ల మహిళలు ప్రమాదంలో పడ్డారని విమలేశ్ అంటున్నారు.
“పూర్తి లాక్‌డౌన్ అంటే రోజువారీ జీవితం అంతా దెబ్బతిన్నట్లే. దుకాణాలు ఉండవు. కూరగాయలు అమ్మేవాళ్లు రారు. కావాల్సిన వస్తువుల కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది” అని ఆయన అన్నారు.
“ఒత్తిడి పెరిగిందంటే, అప్పటికే హింసించే భాగస్వాములు చిన్నవాటికే రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు” అని చెప్పారు.

కాయ్, న్యూయార్క్ (అమెరికా)
కాయ్ తన ఫోన్ తీసుకుని, మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టారు. "అమ్మ, నేను నీతో ఉండాలని కోరుకుంటోంది" అని టైప్ చేసి, సెండ్ బటన్ నొక్కారు. వెంటనే... "సరే, ఏ సమస్యా లేదు" అని రిప్లై వచ్చింది.
పోయిన వారం, తాను పాదం మోపబోనని శపథం చేసిన ఇంట్లోనే కాయ్ మళ్లీ అడుగుపెట్టారు. ‘‘ఆ ఇంటికి వెళ్లిన క్షణమే నా మెదడు మొద్దుబారిపోయింది" అని చెప్పారు.
కాయ్ వెళ్లింది తన తండ్రి ఇంటికి. ఆయన తనను శారీరకంగా, లైంగికంగా కొన్నేళ్లు వేధించారని ఆమె చెబుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తి మొదలైన కొన్ని రోజుల తర్వాత కాయ్ తల్లి పనిచేస్తున్న షాపు మూతపడింది.
కాయ తల్లికి ఆ షాపులో గంటకు రూ.1100 వేతనం ఇచ్చేవారు. అది ఆగిపోయింది.
కాయ్ తల్లికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ఈ పరిణామం ఆమెపై మరింత ప్రభావం చూపింది.
“ఆమె నా మీద అరిచింది. 'ఇక్కడంతా పిచ్చిపట్టినట్లుగా ఉంది. మీ నాన్న దగ్గరికే వెళ్లిపో' అని అంది" అని కాయ్ చెప్పారు.
తల్లి మాటలతో కాయ్ వణికిపోయి, తన గదిలోకి వెళ్లపోయారు. కాసేపటి తర్వాత తిరిగి బయటకు వచ్చారు. “ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావ్?” అంటూ కాయ్‌ను ఆమె తల్లి ప్రశ్నించారు.
తండ్రి వద్ద అనుభవించిన శారీరక, లైంగిక హింసకు కొన్ని నెలల క్రితం నుంచే కాయ్ థెరపీ తీసుకుంటున్నారు. పసిపాపగా ఉన్నప్పటి నుంచీ తండ్రి చేతిలో తాను హింసకు గురవుతున్నానని కాయ్ అన్నారు. తన తల్లికి, సోదరికి ఆమె తనకు జరిగిందంతా పూర్తిగా చెప్పలేదు.
థెరపీ మొదలుపెట్టిన కొన్ని రోజులకే తనకు సాంత్వనగా అనిపించడం మొదలైందని, భవిష్యతుపై ఆశలు చిగురించాయని చెప్పారు కాయ్.
కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఆమె థెరపీ తీసుకునే శిబిరం కూడా మూతపడింది.
గత వారం, మళ్లీ ఆమె తన తండ్రి ఇంట్లో అడుగుపెట్టారు.
“ఆయన ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు. పగలంతా టీవీ, కంప్యూటర్ చూస్తుంటారు. రాత్రి పూట అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఆ సౌండ్ నాకు వినిపిస్తుంది" అని కాయ్ చెప్పారు.
పొద్దున ఆయన బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకునేటప్పుడు చేసే చప్పుడుతో కాయ్‌కు మెళుకువ వస్తుంది.
“ఆయన బ్లెండర్ వాడుతున్నప్పుడు చాలా గట్టిగా శబ్దం వస్తుంది. అదంటే నాకు కంపరం. నా రోజూ మొదలయ్యేది అలానే. రోజంతా నేను జాగ్రత్తగా ఉంటా" అని ఆమె అన్నారు.
కాయ్ తన గదికి పరిమితమై ఉంటారు. బాత్రూమ్ కోసం, ఆకలైనప్పుడు కిచెన్‌కు వెళ్లేందుకు మాత్రమే బయటకువస్తారు.
“ఆయన ఏదో వేరే కాలంలో ఉన్నట్లు నాతో మాట్లాడుతుంటారు. నన్ను హింసించనిదాని గురించి ప్రస్తావనే తేరు. ఏమీ చేయనట్లే ప్రవర్తిస్తారు. నన్ను ఇది మరింత క్షోభ పెడుతుంది" అని చెప్పారు కాయ్.
కాయ్ ఎప్పుడూ ఇంటర్నెట్‌తోనే గడుపుతారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే కాలక్షేపం చేస్తారు.
తిరిగి తన తల్లి ఇంటికి రానిస్తుందని కాయ్ ఆశపడుతున్నారు. లేకపోతే, కరోనావైరస్ సంక్షోభం ముగిశాక తనకు తానుగా ఎక్కడైనా ఉండాలని కోరుకుంటున్నారు.

మరోవైపు గృహహింస కేసుల పెరుగుదల విషయంలో స్పందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ గృహ హింస కమిషనర్ నికోల్ జేకబ్స్ అంటున్నారు.
బాధితులు పోలీసులను సంప్రదించేందుకు ఏమాత్రం సంకోచించవద్దని ఆమె చెబుతున్నారు.
“ఫోన్ చేస్తే చాలు. మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఫోన్ చేసి ఒక దగ్గు సౌండ్ వినిపించండి. మౌనంగానైనా ఉండండి. పోలీసులు స్పందిస్తారు" అని చెప్పారు.
కొందరు అక్రమ వలసదారులు తమను దేశం నుంచి పంపించివేస్తారేమోనన్న భయంతో పోలీసులను సంప్రదించరని, కానీ అలాంటి భయాలేవీ అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.
ఐరాస మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుంజిలే మిలాంబో కూడా ఇదే మాట చెప్పారు.
‘‘చాలా దేశాల్లో అల్పాదాయ నేపథ్యం ఉన్న వాళ్లు ఒకట్రెండు గదులు ఉన్న ఇళ్లలో వాళ్లను హింసిస్తున్న వాళ్లతో కలిసి ఉంటుంటారు. ఫిర్యాదు చేసే అవకాశం వాళ్లకు దొరకదు. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి చెందిన తర్వాత గృహ హింస పెరిగినట్లు మేం గుర్తించాం" అని అన్నారు.
గమనిక: బాధిత మహిళల పేర్లు మార్చాం
చిత్రాలు: జేమ్స్ మాబ్స్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








