బ్రిటన్‌లో కరోనావైరస్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కొరత.. ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న వైద్య సిబ్బంది

- రచయిత, క్లేరీ ప్రెస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ మృతుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ, విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం బ్రిటన్ ఆస్పత్రుల్లో మరిన్ని ఇంటెన్సివ్ కేర్ పడకలు ఏర్పాటు చేస్తున్నారు.
అలాంటి ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పనిచేసే ఒక డాక్టర్ బీబీసీతో మాట్లాడారు. ఇంగ్లండ్‌లో కొన్ని ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి మద్దతు కరువైందని, రక్షణ దుస్తుల కొరత ఉందని వాస్తవాలను బయటపెట్టారు.
ఇంగ్లండ్‌లోని చాలా మంది ఆరోగ్య సిబ్బంది తమ ఆస్పత్రుల్లో పరికరాల కొరత ఉందని బీబీసీకి చెప్పారు. మీడియాతో మాట్లాడవద్దని తమను హెచ్చరించారని, బహిరంగంగా మాట్లాడ్డానికి ఇష్టపడలేదు.
అయితే, మిడ్‌లాండ్స్ కు చెందిన ఒక ఇంటెన్సివ్ కేర్ డాక్టర్ మాత్రం తమ సమస్యల గురించి చెప్పడానికి ముందుకొచ్చారు. డాక్టర్ గుర్తింపు బయటపడకుండా ఆమె పేరు మార్చేందుకు బీబీసీ అంగీకరించింది.
కరోనా(కోవిడ్-19) కేసులతో నిండిపోయిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న ఒక ఆస్పత్రి గురించి డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు. అక్కడ మిగతా ఆపరేషన్లు అన్నింటినీ నిలిపివేశారు. కాన్సర్ చికిత్స కూడా రద్దు చేశారు.
ఈ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంది, క్రిటికల్ కేర్ బెడ్స్ కూడా తక్కువే. ప్రాథమికంగా ఉపయోగించే యాంటీ బయాటిక్స్, వెంటిలేటర్లు కూడా తగినన్ని లేవు.
వీటికి తోడు, ఏప్రిల్ 14-15 నాటికి బ్రిటన్‌లో కరోనా కేసులు భారీగా పెరగవచ్చనే అంచనాలు అక్కడ అందరినీ భయపెడుతున్నాయి. దీంతో, ఆస్పత్రి సిబ్బంది అప్పుడే ఒత్తిడికి గురవుతున్నారు.


అయితే, ఆస్పత్రిలో వాస్తవాలు డాక్టర్ రాబర్ట్స్ చెబుతున్న దానికంటే భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులను వైద్య నిపుణులు ప్రతి రోజూ 13 గంటలపాటు చూసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో డస్ట్ బిన్లలో వేసే ప్లాస్టిక్ కవర్లనే వైరస్‌కు రక్షణగా ధరించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ)లా వేసుకుంటున్నారు. ప్లాస్టిక్ ఆప్రాన్లను, వేరే వారిని అడిగి తెచ్చుకున్న స్కీయింగ్ గాగుల్స్ ఉపయోగిస్తున్నారు.
ప్రజలు అందరూ రెండు మీటర్ల దూరం పాటించాలని చెబుతున్నా, చాలామంది ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది తగిన రక్షణ లేకుండానే కరోనా అనుమానితులకు అడుగు దూరంలోపే నిలబడి పరీక్షలు చేయాల్సి వస్తోంది.
ఇది ప్రాణాంతకం కావడంతో, తమ ఆస్పత్రిలోని చాలా విభాగాల్లో ఉన్న సిబ్బంది, తర్వాత ఏం జరుగుతుందో అని వణికిపోతున్నారని, తామే స్వయంగా పీపీఈ సిద్ధం చేసుకుంటున్నారని డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు.
‘‘ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీయూ(ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ యూనిట్)లోని నర్సులకు ఇప్పుడు పీపీఈ చాలా అవసరం. వైరస్ గాలిలో వ్యాపించే ప్రమాదం ఉన్నచోట వారు పనిచేస్తున్నారు. కానీ వారికి ఆపరేషన్ థియేటర్లలో తలకు వేసుకునే మామూలు హాట్‌లు వేసుకోమని చెప్పారు. వాటికి రంధ్రాలు ఉంటాయి, అవి ఏమాత్రం రక్షణను ఇవ్వలేవు’’ అన్నారు.
‘‘అది ప్రమాదం, అందుకే మేం డస్ట్ బిన్లలో వేసే ప్లాస్టిక్ కవర్లనే మా అప్రాన్లుగా, మా తలకు వేసుకుంటున్నాం’’ అన్నారు రాబర్ట్స్.
ప్రభుత్వం పీపీఈ పంపిణీ సమస్యను గుర్తించింది. సైన్యంలోని ఒక జాతీయ సరఫరా బృందం తాము వాటి పంపిణీ కోసం ఇరవైనాలుగ్గంటలూ పనిచేస్తున్నామని చెబుతోంది.

ఇంగ్లండ్ ఎన్‌హెచ్ఎస్ కూడా ఏప్రిల్ 1న పది లక్షల రెస్పిరేటరీ ఫేస్ మాస్కులు డెలివరీ చేశామని చెప్పింది. కానీ వారికి అత్యంత అవసరమైన హెడ్ ప్రొటెక్షన్, పొడవు చేతుల గౌన్ల గురించి మాత్రం పెదవి విప్పలేదు.
తమ ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి ఏవీ అందలేదని, ప్రస్తుతం తాము ఉపయోగిస్తున్నవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయని డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు.
“మేం ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెస్పిరేటరీ ప్రొటెక్షన్ ఫేస్ మాస్కులకు ఉన్న లేబుళ్లపై గడువు తేదీలను మార్చారు. నిన్న నేను ఒకే మాస్కు మీద మూడు స్టిక్కర్లు ఉండడం చూశాను. దానిపై ఉన్న మొదటి స్టికర్ మీద ఎక్స్ పైరీ 2009 అని, రెండో స్టిక్కర్ మీద 2013 అని, అన్నిటికంటే పైనున్న మూడో స్టిక్కర్ మీద 2021 ఉంది” అన్నారు.
“కొత్త గడువు తేదీలతో ఉన్న ఈ పీపీఈ ఉత్పత్తులు అన్నీ కఠినమైన పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది ఉపయోగించడానికి సురక్షితమే” అని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చెప్పింది.
కానీ డాక్టర్ రాబర్ట్స్ వారి మాటలు నమ్మడం లేదు. ప్రస్తుతం ఆమెతో పనిచేసే ముగ్గురు వెంటిలేటర్ మీద, ఆమె పర్యవేక్షణలోనే ఉన్నారు. ముగ్గురికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకరు కోవిడ్ వార్డులో పనిచేసే ఇంటెన్సివ్ కేర్ డాక్టర్. ఆ డాక్టర్ కూడా తగిన రక్షణ లేకుండానే పనిచేశారు. మిగతా ఇద్దరూ నాన్-కోవిడ్ వార్డుల్లో పనిచేస్తూ, పీపీఈ ధరించలేదు. కానీ వారిలో ఆ లక్షణాలు కనిపించాయి. వారు పనిచేస్తున్నప్పుడు కరోనావైరస్ తాకి ఉంటారని రాబర్ట్స్ భావిస్తున్నారు.


“ఆస్పత్రిలోకి రోగుల బంధువులను ఎవరినీ అనుమతించడం లేదు. ఇలాంటి సమయంలో రోగుల కుటుంబాలకు ఫోన్ చేసి, మేం తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నామని, వారు చనిపోబోతున్నారు లేదా చనిపోయారు, మీరు వారిని ఇక్కడకు వచ్చి చూడకూడదు అని చెప్పడం మాకు చాలా కష్టంగా ఉంటుంది” అని రాబర్ట్స్ చెప్పారు.
“సాధారణంగా రోగుల బెడ్ పక్కనే ఉన్న బంధువులకు, మేం చేయగలిగనవి చేస్తాం అని చెబుతాం. కానీ నేను అలా చెప్పగలనని అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేనది చేయలేను. వెంటిలేటరు మీద ఉన్న వాళ్లకు నేను కచ్చితంగా అత్యుత్తమ రక్షణ అందించలేను, వారిని జాగ్రత్తగా చూసుకుంటానని గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే అత్యుత్తమ నర్సులను కూడా ఇక్కడ ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. మా దగ్గరున్న యాంటీ బయాటిక్స్ అయిపోయాయి. వారికి నేను చేయగలిగిన అన్నీ చేస్తానని గ్యారంటీ ఇవ్వలేను”.
ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిలో ఎంతమందికి వైరస్ సంక్రమించిందో తమ దగ్గర ఎలాంటి రికార్డులూ లేవని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
అయితే, ఐరోపాలో కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన రెండు దేశాలు మాత్రం తమ ఆరోగ్య సిబ్బందిని లెక్కించాయి. మార్చి 27 వరకూ తమ దేశంలో 9400 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఇక ఇటలీలో మార్చి 30 వరకూ 6414 మంది వైద్య నిపుణులకు వైరస్ వచ్చిందని తెలుస్తోంది.
బ్రిటన్‌లో చాలామంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. వారి వివరాలు కూడా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యంత విషమ పరిస్థితి
ఇటలీ, స్పెయిన్‌లో జరిగుతోంది చూస్తున్న బ్రిటన్ ఆరోగ్య సిబ్బంది మరో రెండు వారాల్లో ఎదురయ్యే ముప్పు నుంచి తమను తాము కాపాడుకునేందుకు సిద్ధమవుతున్నారని డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు.
‘‘స్పెయిన్, ఇటలీలోలాగే ఈ కేసులు వేగంగా పెరుగుతూ పోతే కచ్చితంగా మేం ప్రమాదంలో పడతాం. మా దగ్గర ఇప్పటికే నిండిపోయి ఉన్న ఐసీయూలు త్వరలో రోగులతో కిక్కిరుస్తాయి.
మా దగ్గరున్న అనస్తీషియా ఇచ్చే మెషిన్లను రెండు, మూడు గంటలే పనిచేసేలా డిజైన్ చేశారు. వాటిని ఇప్పుడు మేం నాలుగైదు రోజులు ఆపకుండా నడిపిస్తున్నాం. వాటిలో కొన్ని ఇప్పటికే పనిచేయడం లేదు, కొన్ని లీకవుతున్నాయి.
ఆస్పత్రుల్లో అదనపు ఇంటెన్సివ్ కేర్ బెడ్స్, ఎన్నో ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేశాం. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం ఆస్పత్రుల సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేశాం. ముఖ్యంగా శ్వాస తీసుకోలేకపోతున్నవారికి వెంటిలేటర్లు ఏర్పాటు చేశాం.
అయితే, ఇంటెన్సివ్ కేర్‌ను విస్తరించే సమయంలో చాలామంది నర్సింగ్ స్టాఫ్ వైరస్‌కు గురయ్యారు’’ అని రాబర్ట్స్ చెప్పారు.
ఇంటెన్సివ్ కేర్ నర్సులు అత్యున్నత శిక్షణ తీసుకుంటారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క నర్స్ సేవలు అందిస్తారు. రోగులు నిద్రపోతున్నా, వారికి దగ్గరగా ఉండాలి. పేషెంట్ గురించి అన్ని వివరాలూ తెలిసి ఉండాలి.
కానీ, ఇప్పుడు ఈ అదనపు పడకల వల్ల ఒక్కొక్క నర్సు నలుగురు రోగులకు అదే స్థాయి క్రిటికల్ కేర్ అందించాల్సి వస్తోంది. ఎంతో ఒత్తిడికి గురి అవుతూ, ఈ కష్టాలు భరించలేక కన్నీళ్లు పెడుతున్నారు. ఈ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం వారే. కానీ అది అక్కడే కుప్పకూలిపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇళ్లలోనే ఉండండి
కరోనావైరస్ లక్షణాలు కనిపించిన రోగులు అందరినీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసే ముందు పరీక్షించడానికి ఆస్పత్రి బయట కార్ పార్కింగ్ దగ్గర అంబులెన్స్ బేలో ఒక కొత్త తాత్కాలిక భవనం ఏర్పాటు చేశారని, అది ఒక ‘లై డిటెక్టర్’లా పనిచేస్తుందని డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు.
“చాలామంది తమ లక్షణాలు చూసి కరోనా అని భయపడిపోతారు. వారు ఇంటిపట్టునే ఉంటే సరిపోతుంది. కానీ ఆస్పత్రులకు వచ్చేస్తారు. అందుకే, అలా వచ్చే ప్రతి ఒక్కరినీ కార్ పార్కింగులో ఉన్న ఈ భవనంలో పరిశీలిస్తాం. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే, వేరే సమస్యలతో వచ్చినవారికి అది వ్యాపించకుండా వారిని ఆస్పత్రిలో ఎక్కడకు పంపించాలో అక్కడికి తీసుకెళ్తాం” అన్నారు.
“ఇతరులకు మా వల్ల ఎలాంటి సమస్యా రాకుండా, విధుల్లో లేనపుడు ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది చాలా మంది మాకు మేముగా ఐసొలేషన్‌లో ఉంటాం. కానీ పార్కులు, సూపర్ మార్కెట్లు మామూలు రోజుల కంటే కిటకిటలాడుతుంటే చూసినప్పుడు మాత్రం మాకు చాలా చికాకుగా ఉంటుంది. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి” అంటారు డాక్టర్ రాబర్ట్స్.
ఇలస్ట్రేషన్స్ – చార్లీ న్యూలాండ్

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









