కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఎందుకీ వదంతులు... 'బ్రెయిన్ డెడ్' వార్త నిజమేనా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లారా బికర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ‘బ్రెయిన్ డెడ్’ అయ్యిందని రకరకాల కథనాలు వస్తున్నాయి.
ఆయన నిజంగానే ‘బ్రెయిన్ డెడ్’ స్థితిలో ఉన్నారా? లేక శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్నారా? అనేది తెలుసుకోడం చాలా కష్టం. ఎందుకంటే ఉత్తర కొరియా అంతటి గోప్యత పాటిస్తూ ఉంటుంది.
ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియా మాత్రం కిమ్ గురించి వ్యాపిస్తున్న తాజా వదంతుల్లో నిజం లేదని అంటోంది.
కిమ్ జాంగ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనడానికి ఎలాంటి సంకేతాలూ లేవని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
కిమ్ జాంగ్ ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు రావడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇదివరకు కూడా ఇలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవి తప్పని కూడా తేలాయి.

ఫొటో సోర్స్, EPA
వదంతులకు మూలం..
కిమ్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి వేడుకలు ఏప్రిల్ 15న జరిగాయి.
దేశంలా ఏటా జరిగే అతిపెద్ద వేడుకల్లో ఈ కార్యక్రమం కూడా ఒకటి. దీనికి కిమ్ జాంగ్ హాజరు కాలేదు.
ఇదివరకు ఎప్పుడూ ఆయన కిమ్ ఇల్ సంగ్ జయంతికి హాజరు కాకుండా లేరు.
దీంతో ఆయన ఈసారి వేడుకలకు రాకపోవడంపై అనేక వదంతులు పుట్టాయి.
చివరగా కిమ్ ఏప్రిల్ 12న ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఉత్తర కొరియా జాతీయ మీడియాలో వచ్చింది. ఆ తర్వాత ఆయన బయట కనిపించలేదు.
గత వారం ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఆ సమయంలో కిమ్ జాంగ్ ఎక్కుడున్నారనేది ఆ దేశ మీడియా ప్రస్తావించలేదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో కిమ్ జాంగ్ కనిపిస్తుంటారు.
ఉత్తర కొరియాలో వార్తల సేకరణ అంత సులభం కాదు. దీంతో సాధారణంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఎలాంటి తేడాలు కనిపించినా, వాటి గురించి వదంతులు వస్తాయి.
అసలే చాలా గోప్యత పాటించే ఉత్తర కొరియా, ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తి తర్వాత సరిహద్దులను పూర్తిగా మూసేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఇలా వ్యాపించాయి...
కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యం గురించి తొలి కథనం ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చినవారు నిర్వహిస్తున్న ఓ వెబ్‌సైట్‌లో వచ్చింది
గత ఆగస్టు నుంచి కిమ్ జాంగ్ గుండె సమస్యలతో బాధపడుతున్నారని, తరచూ బయెకదూ పర్వత శిఖరాన్ని సందర్శించడం వల్ల ఆయన పరిస్థితి మరింత దిగజారిందని తమకు అజ్ఞ్యాత సమాచారం అందిందని డైలీ ఎన్‌కే అనే వార్తా వెబ్‌సైట్ తెలిపింది.
దీని ఆధారంగా అంతర్జాతీయ మీడియాలో మరిన్ని కథనాలు పుట్టుకువచ్చాయి.
దక్షిణ కొరియా, అమెరికా నిఘా సంస్థలు ఇందులో నిజానిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా కథనాలు వచ్చాయి.
ఆ తర్వాత, గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కిమ్ జాంగ్ ఆరోగ్యం విషమించిందంటూ అమెరికన్ మీడియా మరింత సంచలనాత్మకంగా మార్చి వార్తలు ప్రచురించింది.
దక్షిణ కొరియా ప్రభుత్వం, చైనా నిఘా వర్గాలు మాత్రం ఈ వార్తలో నిజం లేదని తెలిపాయి.
అయితే, కిమ్ జాంగ్ గుండె శస్త్ర చికిత్స చేయించుకోలేదని మాత్రం ఇంతవరకూ ఎవరూ చెప్పకపోవడం గమనార్హం. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవం కాదని మాత్రమే ఉత్తర కొరియా, చైనా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఉత్తర కొరియా ప్రజలకు తమ పాలకుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారమూ ఉండదు.

ఫొటో సోర్స్, AFP
ఇదే మొదటిసారి కాదు
కిమ్ జాంగ్ బయటకు ‘కనిపించకుండా పోవడం’ ఇదేమీ మొదటిసారి కాదు. 2014లో ఆయన ఓసారి 40 రోజులపాటు బయటకు కనిపించలేదు. రాజకీయ ప్రత్యర్థులు తిరుగుబాటు చేసి ఆయన్ను పదవీచ్యుతుడిని చేసి ఉండొచ్చని అప్పుడు వదంతులు వచ్చాయి.
కానీ, ఆయన మళ్లీ చేతికర్రతో ప్రత్యక్షమయ్యారు.
కిమ్ జాంగ్ ‘శారీరకంగా ఓ సమస్య’ ఎదుర్కొంటున్నట్లు అప్పుడు ప్రభుత్వ మీడియా అంగీకరించింది. కిమ్ కీళ్ల సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు వచ్చిన వదంతులపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
కిమ్ జాంగ్‌కు ఒకవేళ ఏదైనా జరిగితే, దేశ పాలన ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్న విషయంపై స్పష్టత లేదు.
కిమ్ జాంగ్‌ను దేశ పాలకుడి పదవి చేపట్టేలా ఆయన తండ్రి చాలా ఏళ్ల పాటు తీర్చిదిద్దారు.
కిమ్ తర్వాత ఆయన సోదరి కిమ్ యో జాంగ్ ఆ పదవి చేపట్టవచ్చు. కిమ్ సామ్రాజ్యాన్ని నిర్వచించే ‘పవిత్ర బయెకదూ వంశ పరంపర’ ఆమెకు ఉంది. ఆ దేశంలో ఆమె గురించి మీడియాలో వార్తలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.
చాలా సమావేశాల్లో, సదస్సుల్లో కిమ్ పక్కన ఆమె కనిపిస్తూ ఉంటారు. గత నెలలో మొదటి సారి ఆమె బహిరంగంగా ప్రసంగించారు.
ఇక వదంతులపై ఉత్తర కొరియా స్పందించి నిజం చెబితేగానీ, కిమ్ జాంగ్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా? BBC Reality Check
- అమెరికా చమురు ధరలు... డిమాండ్ లేక తిరోగమనం
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








