బ్రిటన్ హోమ్ కేర్‌లో మరణించిన 92 ఏళ్ల భారతీయ సెలబ్రిటీ జర్నలిస్ట్ గుల్షన్ ఎవింగ్

ఫొటో సోర్స్, Anjali Ewing
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఉన్న ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ గుల్షన్ ఎవింగ్ లండన్‌లోని రిచ్మండ్‌లో ఒక వృద్ధుల గృహంలో మరణించారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.
“ఆమె ప్రాణం పోతున్నప్పుడు నేను ఆమె పక్కనే ఉన్నాను” అని ఆమె కుమార్తె అంజలి ఎవింగ్ బీబీసీతో చెప్పారు. ఆమెకి వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య లక్షణాలు ఏమి లేవని తెలిపారు.
మహిళా పత్రిక ఈవ్స్ వీక్లీ, సినిమా పత్రిక స్టార్ అండ్ స్టైల్‌కి ఆమె 1966 నుంచి 1989 వరకు ఎడిటర్‌గా పని చేశారు.
ఆమె ఒక సెలెబ్రిటీ
నోబెల్ బహుమతి గ్రహీత వి ఎస్ నైపాల్ రాసిన 'ఏ మిలియన్ మ్యుటినీస్ పుస్తకంలో "భారతదేశంలో పేరొందిన మహిళా ఎడిటర్’' గా ఆమెని వర్ణించారు.
ఇందిరా గాంధీ నుంచి అతి ఎక్కువ సమయం ఇంటర్వ్యూ తీసుకున్న రికార్డు ఎవింగ్‌కి దక్కింది.

ఫొటో సోర్స్, ANJALI EVING
1970 - 80 దశకంలో ఫెమినిస్ట్ ఉద్యమం ఊపిరి పోసుకుంటున్న తోలి రోజుల్లో ఆమె ఈవ్స్ వీక్లీ పత్రిక ఎడిటర్‌గా ఎంతో మంది మహిళా జర్నలిస్టులకి మార్గదర్శకత్వం చేశారు.
స్టార్ అండ్ స్టైల్ పత్రిక ఎడిటర్‌గా హాలీవుడ్ , బాలీవుడ్‌ల్లో ఎంతో మంది ప్రముఖులతో ఆమెకి పరిచయాలు ఉన్నాయి. ఆమె చాలా మంది ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయడమే కాకుండా, వారితో పార్టీలకి కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ఆమె హాలీవుడ్ నటులు గ్రెగొరీ పెక్ , కేరి గ్రాంట్, రోజర్ మూర్‌లను ఇంటర్వ్యూ చేస్తూ, అల్ఫ్రెడ్ హిచ్ కాక్, ప్రిన్స్ చార్లెస్‌తో విందు తీసుకుంటూ, అవా గార్డెనర్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటూ, డానీ కె కి చీర కట్టుకోవడం నేర్పిస్తూ ఉన్న చిత్రాలని గత వారం కొన్ని వెబ్ సైట్లు ప్రచురించాయి.
బాలీవుడ్‌లో ఆమె పరిచయాలు చాలా ఎక్కువని ఆమె కుమార్తె చెప్పారు. రాజేష్ ఖన్నా పని చేస్తున్న సెట్ల లోకి వెళ్లడం, దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, దేవ్ ఆనంద్, సునీల్ దత్, నర్గీస్ లాంటి వాళ్ళతో పార్టీలకి వెళ్లడం, రాజ్ కపూర్‌తో డాన్స్ చేయడం లాంటివి చేసేవారని అంజలి చెప్పారు.

ఫొటో సోర్స్, Anjali Ewing
ఆమె 1928లో పార్శి కుటుంబంలో జన్మించారు. స్వతంత్ర భారతంలో జర్నలిజం వృత్తి చేపట్టిన తొలి మహిళల్లో గుల్షన్ ఒకరు. ఆమె ఎడిటర్ కాక ముందు చాలా పత్రికలకి పని చేశారు. 1990లో భర్త ఎవింగ్‌తో కలిసి ఆమె లండన్ వెళ్లిపోయారు. ఆయన ఒక బ్రిటిష్ జర్నలిస్ట్. ఆయనని ఆమె 1955లో వివాహం చేసుకున్నారు.
రక్షణ గృహాల్లో చోటు చేసుకుంటున్న కోవిడ్ 19 మరణాల పట్ల బ్రిటన్ వ్యవహార శైలి వార్తల్లో వస్తున్న నేపథ్యంలో ఎవింగ్ మరణించారు. ఇప్పటికే కొన్ని వేల మంది వృద్ధులు వైరస్ బారిన పడి చనిపోయారు.
ఎవింగ్ ఒక వారం రోజులు అస్వస్థతకి గురై ఏప్రిల్ 18వ తేదీన చనిపోయారు. అయితే, ఆమెకి వైరస్ సోకినట్లు ఆమె మరణించిన తర్వాత తెలిసింది.
"నేను ఆమె చేతిని పట్టుకుని, తనతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను తనతో కుటుంబం గురించి, నేను తనని ఎంత ప్రేమిస్తాను అనే విషయాల గురించి కబుర్లు చెప్పాను" అని అంజలి అన్నారు.
“ఆమె కొంత సేపు స్పృహలో ఉండేవారు కాదు. తనకి ఇష్టమైన బాలీవుడ్ పాటలు, బ్లూ డానుబే సంగీతం వినిపించాను".

ఫొటో సోర్స్, Anjali Ewing

ఫొటో సోర్స్, Anjali Ewing
35-40 సంవత్సరాల క్రితం ఆమెతో పని చేసిన కొంత మంది మహిళా జర్నలిస్టులు ఆమె మరణ వార్త వినగానే ఆమెతో ఉన్న జ్ఞాపకాలని పంచుకున్నారు.
"నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఆమె నా ఎడిటర్ గా ఉండేవారు” అని ప్రస్తుతం బీబీసీ లండన్‌లో పని చేస్తున్న చారు షహానే చెప్పారు.
"ఆ రోజుల్లో నేను మాట్లాడాలంటే చాలా బిడియపడుతూ ఉండేదాన్ని. ఆమె నన్ను ఇంటర్వ్యూకి పిలవగానే చాలా భయం వేసింది. కానీ ఆమె నా భయాన్ని క్షణాల్లో పోగొట్టారు”.
ఎవింగ్ షిఫాన్ చీరలు కట్టుకుని, ముత్యాల దండలు ధరించి, ఒక సిగరెట్ తన రెండు వేళ్ళ మధ్య ఊపుతూ చాలా అందంగా, హుందాగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
“ఎవింగ్ ఆఫీసులోకి ఎప్పుడూ నడిచి రావడం తెలియదు, ఉరకలు వేస్తూ వచ్చేవారు” అని నాలుగు సంవత్సరాల పాటు ఈవ్స్ వీక్లీ కి అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన అమ్ము జోసెఫ్ చెప్పారు.
“మా ఆఫీస్ చాలా ఇరుకుగా ఉండేది. అందులో ఆమెకి ఒక చిన్న కేబిన్ ఉండేది. కానీ, ఆమె నడవడిక, మాట తీరు అందరిని ఆకట్టుకునేవి. ఆమె చాలా మృదువుగా మాట్లాడేవారు”.
అమ్ము జోసెఫ్ 1977 లో ఉద్యోగంలో చేరేటప్పటికి దేశంలో వరకట్న మరణాలకు వ్యతిరేకంగా మహిళల ఉద్యమం మొదలవుతోంది.
"నాకు అప్పుడు 24 సంవత్సరాలు. నాకు చాలా ఫెమినిస్ట్ భావాలు, ఆలోచనలు ఉండేవి”.
“కానీ ఈవ్స్ పత్రిక సాంప్రదాయ రీతిలో మహిళల కోసం సౌందర్య సలహాలు, ఫ్యాషన్, అల్లికలు, కుట్లు లాంటివి ప్రచురించేది. ఈవ్స్ కవర్ పేజీ ఎప్పుడూ మోడల్స్, అందమైన హీరోయిన్ చిత్రాలతోనే ఉండేది”.
“కానీ, ఎవింగ్స్ మా ప్రతిపాదనలకి అడ్డు చెప్పేవారు కాదు”.
“ఆమె సహకారంతో నాలాంటి యువ జర్నలిస్టులు అందరం గృహ హింస, పిల్లల పట్ల జరుగుతున్న పట్ల హింసకి సంబంధించిన వ్యాసాలు రాసేవాళ్ళం. మారిటల్ రేప్, కస్టోడియల్ రేప్ గురించి ప్రత్యేక సంచిక కూడా వెలువరించాం. హిందూ మతంలో స్త్రీలని చూసే విధానంపై ఒక వ్యాసం రాశాం. ఈ సమస్యలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి”.
"మేము మార్పుకి పునాది వేసాం. మేమంతా 20లలో ఉండేవాళ్ళం. ఆమె 50లలో ఉండేవారు. కానీ ఆమె మా అభిప్రాయాలకి గౌరవం ఇచ్చేవారు."

ఫొటో సోర్స్, Anjali Ewing

ఫొటో సోర్స్, Anjali Ewing
మారుతున్న కాలంతో పాటు మహిళల దృక్పధం కూడా మారుతుందనే విషయాన్ని ఆమె చాలా తొందరగా గ్రహించారని ఈవ్స్ వీక్లీకి అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన పామెలా ఫిలిపోస్ చెప్పారు.
“కానీ, ఆమె స్వయంగా ఎప్పుడూ స్త్రీ సమానత్వం మీద,మహిళలపై జరుగుతున్న హింస మీద ఎటువంటి వ్యాసాలూ రాయలేదు. ఆమె ఎప్పుడూ అందమైన వ్యక్తులతో తిరుగుతూ కనిపించేవారు”.
అయితే, ఆమె ఎప్పుడూ తన సెలబ్రిటీ పరిచయాలని ప్రచారం చేసుకోలేదని ఆమెతో కలిసి పని చేసిన షెర్ణ గండి అన్నారు.

ఫొటో సోర్స్, Anjali Ewing
“మా అమ్మకి చాలా పేరుందని తెలుసు కానీ, తను నాకు మాత్రం అమ్మే” అని ఆమె కుమార్తె అంజలి చెప్పారు. అంజలి కూడా జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.
“అమ్మ కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు”.
“20 సంవత్సరాలకి పైగా ఆమె రెండు పత్రికలకి ప్లానింగ్, కమిషనింగ్ చేస్తూ ఉండేవారని, ఆ సమయంలో చాలా పని ఆమె పై ఉండేదని” చెప్పారు.
ఒక్కొక్కసారి సినిమా స్టార్లు అర్ధరాత్రి 2 గంటలకి పత్రికల్లో తమ గురించి రాసిన విషయాలపై ఫిర్యాదులు చేయడానికి కాల్ చేస్తే వాళ్లకి వివరణ ఇవ్వడానికి గంటల సేపు ఫోన్ లో మాట్లాడేవారని అంజలి గుర్తు చేసుకున్నారు.
“ఆమె లండన్ వెళ్లిన దగ్గర నుంచి జర్నలిజం నుంచి, రచనల నుంచి పూర్తిగా వైదొలిగారు”.
“నేనెప్పుడూ ఒక పుస్తకం రాయమని అడిగేదానిని, కానీ, తను ఆసక్తి కనపరచలేదు.’’
"మా అమ్మ చాలా అదృష్టవంతురాలు. తనకి మంచి కెరీర్ లభించింది. ప్రేమించే భర్త దొరికారు. ఇలా చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ తనకి అన్నీ లభించాయి".

ఫొటో సోర్స్, Anjali Ewing

ఫొటో సోర్స్, Anjali Ewing
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: రూ. 50 వేలకే వెంటిలేటర్... భారత యువ ఇంజనీర్ల కృషి ఫలిస్తుందా?
- కరోనావైరస్: 'ఆంధ్రప్రదేశ్‌లోని 87 కేసుల్లో 70 మంది దిల్లీకి వెళ్ళి వచ్చిన వారే' - ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?
- నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనావైరస్ వ్యాప్తి చర్చలో కేంద్ర బిందువుగా మారిన తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది?
- కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు
- కరోనావైరస్ వల్ల చిన్నపిల్లలకు, టీనేజర్లకు కూడా ముప్పు ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








