బ్రెగ్జిట్: ప్రభుత్వాన్ని ఓడించిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తామన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ప్రతినిధుల సభలో ప్రధాని బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రతినిధుల సభలో ప్రధాని బోరిస్ జాన్సన్

యూకేలోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ. సొంత పార్టీలోని తిరుగుబాటు ఎంపీలు.. ప్రతిపక్ష నాయకులతో కలిసి పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఓడించారు. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండా అక్టోబరు 31న ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగే పరిస్థితిని అడ్డుకొనే చట్టాన్ని రూపొందించేందుకు వారికి అవకాశం లభించింది.

పార్లమెంటు ఎజెండాను నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రతినిధుల సభలో ఓటింగ్‌ జరిగింది. దీనిలో 328 ఓట్లతో తిరుగుబాటు ఎంపీలు, ప్రతిపక్ష సభ్యులు విజయం సాధించారు. దీంతో బ్రెగ్జిట్ గడువు పొడిగించేందుకు వారు కొత్త బిల్లును తీసుకొచ్చే అవకాశముంది. ఈ ఓటింగ్‌లో ప్రభుత్వానికి 301 ఓట్లే పడ్డాయి.

తాజా పరిణామాలకు స్పందనగా.. ముందస్తు ఎన్నికల కోసం ఓ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు.

అయితే, ఎన్నికలకు ముందుగానే కొత్త బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలని లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ అంటున్నారు.

ప్రస్తుతం విపక్షాలతో చేతులు కలిపిన వారిలో మాజీ మంత్రులతోపాటు 21 మంది కన్జర్వేటివ్ పార్టీ నాయకులు ఉన్నారు.

తిరుగుబాటు ఎంపీలను విప్ జారీచేసి పార్లమెంటరీ పార్టీ నుంచి బహిష్కరించి ఉండాల్సిందని ప్రభుత్వ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. బహిష్కరణ, ముందస్తు ఎన్నికల హెచ్చరికలతో వారు గాడినపడొచ్చని అన్నారు.

''నేను ఇప్పటికీ కన్జర్వేటివ్‌నే. అయితే పార్టీ ఆదేశాలను పాటించను''అని దీర్ఘకాలం ఎంపీగా కొనసాగిన తిరుగుబాటు నాయకుడు, మాజీ ఛాన్సెలర్ కెన్ క్లార్క్ వ్యాఖ్యానించారు.

బ్రెగ్జిట్ నుంచి వైదొలగే విధానాలపై ఎంపీలు తీసుకొచ్చే బిల్లుతో మరింత ఆలస్యం కావడంతోపాటు గందరగోళమూ నెలకొంటుందని జాన్సన్ వ్యాఖ్యానించారు.

''ఇప్పడు నా ముందు వేరే మార్గం లేదు. అక్టోబరులో ముందస్తు ఎన్నికలు నిర్వహించక తప్పదు. నిర్ణయం మన దేశ ప్రజలే తీసుకుంటారు''అని ఎంపీలతో జాన్సన్ అన్నారు.

తాజా ఓటింగ్ అనంతరం బుధవారం ప్రతినిధుల సభలో వ్యవహారాలను నియంత్రించే అధికారం ఎంపీలకు దఖలుపడింది.

అంటే వారు పార్టీలకు అతీతంగా ఓ బిల్లు తీసుకొచ్చి.. జనవరి 31 వరకూ బ్రెగ్జిట్ గడువును పొడిగించాలని ఒత్తిడి చేసేందుకు అవకాశముంది.

బ్రసెల్స్‌లో అక్టోబరు 17న ఈయూ కీలక సమావేశం జరుగనుంది. దీనికి రెండు రోజులు ముందుగానే (అక్టోబరు 15న) ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ముందస్తు ఎన్నికల నిర్వహణకు బ్రిటన్‌లోని 650 ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. అంటే సొంత పార్టీ నాయకులతోపాటు లేబర్ పార్టీ మద్దతు కూడా జాన్సన్‌కు అవసరం.

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పడేం జరుగబోతోంది?

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి యూకే వైదొలగే సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 31న రాత్రి 11 గంటలకు అధికారికంగా ఈయూను యూకే వీడిపోవాల్సి ఉంది.

అయితే వైదొలగడానికి అనుసరిస్తున్న విధానాలపై ఈయూతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఒకవేళ ఒప్పందం లేకపోయినా అక్టోబరు 31న ఈయూను వీడిపోతామని ఆయన స్పష్టీకరించారు.

ఎలాంటి ఒప్పందం లేకపోవడం అంటే.. ఈయూ కస్టమ్స్ యూనియన్, మార్కెట్‌లను తక్షణమే యూకే వీడిపోవాల్సి ఉంటుంది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

పార్లమెంటును 9 నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈలోగా కొత్త బిల్లును ఎంపీలు ఆమోదించాల్సి ఉంటుంది.

దీన్ని బుధవారం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతోపాటు ఓటింగ్ కూడా జరుగుతుంది. తర్వాతి రోజు ఎగువ సభకు పంపిస్తారు. అక్కడ కూడా ఆమోదం పొందితే.. బ్రిటన్ రాణి ఆమోద ముద్ర అనంతరం చట్ట రూపం దాల్చే అవకాశముంది.

బ్రెగ్జిట్

ఫొటో సోర్స్, Getty Images

ముందస్తు ఎన్నిక ఎలా?

ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం జాన్సన్‌కు మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. అయితే దీనికి ఓ ప్రత్యామ్నాయం ఉంది. ఎన్నికల నిర్వహణకు కేవలం సభలో సాధారణ మెజారిటీ సరిపోతుందని ఓ కొత్త చట్టం తీసుకొస్తే సరిపోతుంది.

ఒకవేళ ఎన్నికల నిర్వహణ తేదీ అక్టోబరు 31 కంటే ముందే ఉంటే.. తర్వాత ఏర్పడే ప్రభుత్వం బ్రెగ్జిట్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

అవిశ్వాస తీర్మానం ఉంటుందా?

ప్రస్తుతం ఎలాంటి ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగే పరిస్థితిని అడ్డుకొనేందుకు ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైతే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. తాము తప్పకుండా ఆ పని చేస్తామని కోర్బిన్ ఇప్పటికే స్పష్టంచేశారు.

అవిశ్వాస తీర్మానానికి ఎక్కువ మంది మద్దతుపలికితే.. ప్రస్తుత ప్రభుత్వం లేదా ప్రధాన మంత్రిని మార్చి ఏర్పాటుచేసే కొత్త ప్రభుత్వం 14 రోజుల్లోగా విశ్వాస తీర్మానంపై విజయం సాధించాల్సి ఉంటుంది.

ఈ విధానంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే బ్రెగ్జిట్ గడువు పొడిగింపునకే మద్దతు పలకొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)