బ్రిటన్ ప్రధాని పార్లమెంటును ఎందుకు సస్పెండ్ చేశారు?

ఫొటో సోర్స్, AFP
బ్రెగ్జిట్ విషయంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న ఈ కీలక సమయంలో పార్లమెంటును ప్రోరోగ్ (సస్పెండ్) చేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక "కుట్ర" అని సీనియర్ ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తుండగా, మెరుగైన నూతన చట్టాలను తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ స్పష్టం చేస్తున్నారు.
సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు పార్లమెంటు సస్పెండ్ అవుతుందని భావిస్తున్నారు. అంటే, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి యూకే బయటకు రావాల్సిన గడువుకు కేవలం 17 రోజుల ముందు నుంచి పార్లమెంటు మళ్లీ పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
వాణిజ్యం, సరిహద్దు నిబంధనలకు సంబంధించి మరిన్ని చర్చలు, ఒప్పందాలు జరగకుండా ఈయూ నుంచి యూకే వైదొలగడానికి వీళ్లేదని అంటున్న ప్రతిపక్ష ఎంపీల నోరు మూయించేందుకే బోరిస్ ప్రభుత్వం పార్లమెంటును సస్పెండ్ చేస్తోందని విమర్శకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ మద్దతుదారులు మాత్రం పార్లమెంటులో శతాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోన్న బ్రిటన్ రాణి ప్రసంగ కార్యక్రమం కొంతకాలంగా జరగడం లేదని. ఈసారి జరగాలంటే పార్లమెంటును మూసివేయడం తప్పనిసరి అని అంటున్నారు.
"మహారాణి ప్రసంగం" కార్యక్రమానికి ముందుగా బ్రిటన్ పార్లమెంటును సస్పెండ్ చేయడమనేది కొన్ని శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.
ప్రోరోగ్ అమలులో ఉన్న సమయంలో పార్లమెంట్ పనిచేయదు. పార్లమెంటును ఎప్పుడు ప్రోరోగ్ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ), హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)ల సభ్యులు ఆ నిర్ణయాన్ని అడ్డుకోలేరు.

ఫొటో సోర్స్, PA Media
పార్లమెంటును ప్రభుత్వం ఎలా మేసివేస్తుంది?
సాధారణంగా ఒక ఏడాదిలో మొదటి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంటును ప్రోరోగ్ చేస్తుంటారు. అనంతరం పార్లమెంటులో రాజు లేదా రాణి ప్రసంగం ఉంటుంది.
కిరీటం ధరించి, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో బంగారు సింహాసనంపై కూర్చుని మహారాణి ప్రసంగం (ప్రభుత్వం రాసినది) చదువుతారు. ప్రధానమంత్రి తీసుకురావాలని అనుకుంటున్న కొత్త చట్టాల గురించి ఆ ప్రసంగంలో చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
16 శతాబ్దం నుంచి ఆనవాయితీగా కొనసాగుతున్న రాణి ప్రసంగ కార్యక్రమం, సాధారణంగా ఏటా ఒకసారి జరుగుతుంది. అయితే, ఆ కార్యక్రమం ఒక సంప్రదాయంగా మాత్రమే కొనసాగుతోంది, కానీ, అది ఎప్పుడు జరగాలి? ఎలా జరగాలి? అని చెప్పేందుకు రాతపూర్వక నిబంధనలు ఏమీ లేవు.
2017 తర్వాత ఇప్పటి వరకు రాణి ప్రసంగ కార్యక్రమం జరగలేదు.

ఫొటో సోర్స్, PA Media
ప్రభుత్వ నిర్ణయం ఎందుకు వివాదాస్పదం అవుతోంది?
బ్రెగ్జిట్ మీద ఎంపీలు నోరు విప్పకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పార్లమెంటును ప్రోరోగ్ చేసిందని విమర్శకులు అంటున్నారు.
బోరిస్ ప్రభుత్వ నిర్ణయం "ఒక పెద్ద కుట్ర" అని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జాన్ మెక్‌డోనెల్ వ్యాఖ్యానించారు. "బ్రెగ్జిట్ మీద ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, స్వేచ్ఛగా నడవాల్సిన ప్రజాస్వామ్య సంస్థలను ప్రధాన మంత్రి నిలువరించడం మంచిది కాదు" అని మెక్‌డోనెల్ అన్నారు.
బ్రెగ్జిట్ మీద చర్చలు జరగకుండా చేసేందుకు పార్లమెంటులో ఓటింగ్‌ను ఆపేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
అక్టోబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ తేదీలోగా ఈయూతో వాణిజ్యం, సరిహద్దు అంశాలపై ఒప్పందం కుదరని పక్షంలో ఆ గడువును పొడిగించాలని చాలామంది ఎంపీలు కోరుతున్నారు.
కానీ, దాదాపు ఐదు వారాలపాటు పార్లమెంటును మూసివేస్తే ఆ ఒప్పందాలు జరిగే అవకాశం తక్కువే.

ఫొటో సోర్స్, Reuters
కొత్త చట్టాలు కావాలి
కొత్త ఎజెండాను రూపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని బోరిస్ చెప్పారు.
"కొత్త చట్టం కావాలి, కీలకమైన కొత్త బిల్లులను తీసుకురావాలి, అందుకే అక్టోబర్ 14న మహారాణి ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. కొత్త విధానాలతో ముందుకెళ్తాం" అని అన్నారు.
"పార్లమెంటు కొత్త సెషన్‌ను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ప్రధాని భావిస్తున్నారు. వచ్చేవారం తిరిగి వచ్చే ఎంపీలకు బ్రెగ్జిట్ మీద చర్చించేందుకు సరిపడా సమయం ఉంటుంది" అని మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు.
కానీ, చాలామంది ప్రభుత్వం చెబుతున్న మాటలను విశ్వసించడంలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో విమర్శించారు.
బ్రిటన్ వ్యాప్తంగా అనేకమంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బ్రెగ్జిట్‌కు ముందు ఎంపీలు పార్లమెంటులో తమ గొంతును వినిపించేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం పార్లమెంటును ప్రోరోగ్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
భిన్నాభిప్రాయాలు
పార్లమెంటును సస్పెండ్ చేయడంపై బ్రిటన్ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని కోరుకునేవారు, అందుకు అనుగుణంగా 2016లో నిర్వహించిన రెఫరెండంలో ఓటు వేసినవారు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
అదే సమయంలో బ్రెగ్జిట్‌ను ఒక విపత్తుగా భావించేవారు మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ప్రతిపక్ష ఎంపీలలో చాలామంది బ్రిటన్ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా, బ్రెగ్జిట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బ్రెగ్జిట్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న అంశంపై 2016లో రెఫరెండం నిర్వహించారు. అందులో 52 శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 48 శాతం మంది వ్యతిరేకించారు.

ఫొటో సోర్స్, Getty Images
మొత్తానికి, ఈయూ నుంచి బ్రిటన్ బయటకొచ్చినా, రాకపోయినా, బ్రిటన్‌లో రాజకీయాలు చాలాకాలం పాటు ఇలాగే ఉండేలా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- లబ్‌డబ్బు: ఈ పండగకు బంగారం ఎలా కొనాలి?
- రిజర్వు బ్యాంకుకూ కేంద్రానికీ మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది?
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- లబ్‌డబ్బు: గృహరుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి
- అరటి పండు అంతరించిపోనుందా?
- అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నారా?
- ఆదాయపు పన్ను కడుతున్న వారు ఎంతమంది? వారు కట్టే పన్ను ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








