జగన్ సీఎం అయిన తరువాత తొలిసారి సీబీఐ కోర్టులో హాజరు... విచారణ 17కు వాయిదా

ఫొటో సోర్స్, facebook/YS Jagan Mohan Reddy
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 17కి వాయిదా పడింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు.
ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా, సీబీఐ తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులూ విచారణకు వచ్చారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌మోహనరెడ్డి ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో, అనంతరం ఎన్నికల్లో గెలుపు తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో పాలనపరమైన బాధ్యతలు ఉన్నాయంటూ వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి కొద్దికాలంగా మినహాయింపు పొందుతున్నారు.

ఫొటో సోర్స్, facebook/YS Jagan Mohan Reddy
మార్చి నుంచి వరుస మినహాయింపులు
ఇలా మార్చి నెల నుంచి ఆయన కోర్టుకు హాజరుకాలేదు. ఇది విచారణపై ప్రభావం చూపుతుందని సీబీఐ న్యాయవాదులు గత శుక్రవారం అభ్యంతరం లేవనెత్తడంతో వచ్చే విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డీ హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే వారిద్దరూ శుక్రవారం విచారణకు హాజరవుతున్నారు.
జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయిన తరువాత సీబీఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి.
11 కేసుల్లో
జగన్ మొత్తం 11 సీబీఐ కేసుల్లో ఏ1 గా ఉన్నారు. దీంతో ప్రతి వారం ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యేవారు. ఎన్నికల ముందు నుంచీ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతూ వచ్చారు. ఎన్నికల తరువాతా కోరారు .కానీ కొన్ని సందర్భాల్లో ఒక్క రోజుకు మినహాయింపు ఇచ్చిన కోర్టులు, పూర్తిగా మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రయ్యాక మొదటిసారి కోర్టుకు వచ్చినట్లయింది.
చిట్ట చివరగా గత శుక్రవారం కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాదులు కోరగా, కోర్టు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే శుక్రవారం హాజరు కావల్సిందే అని ఆదేశించారు. జగన్ తో పాటూ విజయసాయి రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశించారు.
ఇవీ ఆ 11 కేసులు
1వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-8, 2012 హెటిరో, అరబిందో ఫార్మా
2వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-9, 2012 వ్యక్తిగత పెట్టుబడిదారులు
3వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-10, 2012 రాంకీ
4వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-14, 2012 వాన్ పిక్
5వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-12, 2013 దాల్మియా సిమెంట్స్
6వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-24, 2013 ఇండియా సిమెంట్స్
7వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-25, 2013 రఘురాం సిమెంట్స్
8వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-26, 2013 పెన్నా సిమెంట్స్
9వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-27, 2013 ఇందు టెక్ జోన్
10వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-28, 2013 లేపాక్షి నాలెజ్ హబ్
11వ చార్జిషీటు కేసు నంబర్ సీసీ-26, 2014 ఏపీ హౌసింగ్ ప్రాజెక్ట్స్
శంకరరావు, ఎర్రన్నాయుడు వేసిన కేసుతో..
2011 ఆగస్టు 10న కాంగ్రెస్ నాయకులు శంకర రావు, తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ఆధారంగా జగన్ పై కేసు పెట్టి విచారణ ప్రారంభించింది సీబీఐ.
2012 మే 27వ తేదీన ఆయన్ను అరెస్టు చేశారు. 16 నెలలు జైల్లో ఉన్నారు జగన్. విడుదల తరువాత కేసు చార్జిషీట్లు పూర్తయ్యాక, సీబీఐ కోర్టులో ప్రతీ శుక్రవారం జగన్ కేసు విచారణ చేపట్టారు. దీంతో వారం వారం ఆయన విచారణకు హాజరయ్యేవారు.

ఫొటో సోర్స్, ysrcp
పాదయాత్ర సమయంలో
జగన్ పాదయాత్ర సమయంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని హైకోర్టులో పిటిషన్ వేయగా, దానికి హైకోర్టు తిరస్కరించింది. రాజకీయ అవసరాలకు మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. దీంతో పాదయాత్ర సమయంలో కూడా ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్ వచ్చేవారు.
ఇక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కూడా పిటిషన్లు వేశారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా మినహాయింపు కోరుతూ వచ్చారు. కానీ శాశ్వత మినహాయింపు ఇవ్వలేదు కోర్టు. అధికారిక పర్యటనలు, కార్యక్రమాలు, అత్యవసర పనులు లేదా సమావేశాలు ఉన్నప్పుడు ఆ ఒక్క వారానికీ మినహాయింపు కోరుతూ వచ్చారు జగన్ లాయర్లు. కొన్నిసార్లు అంగీకరించింది కోర్టు. మొత్తానికి జగన్ సీఎం అయ్యాక ఏడు నెలల్లో ఒక్కసారీ విచారణకు హాజరు కాలేదు.
రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందంటూ..
అక్టోబరు మధ్యలో ఒకసారి సీబీఐ కోర్టులో శాశ్వతంగా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం పిటిషన్ వేశారు జగన్.
ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించాలనీ, ప్రతీసారీ కోర్టుకు రావడం ఇబ్బంది అనీ, తన బదులు లాయర్ కోర్టుకు వస్తారనీ ఆయన కోరారు.
దాంతో పాటూ భద్రతా ఏర్పాట్లు, పర్యటన ఖర్చులకు ప్రతీసారీ 60 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని జగన్ లాయర్లు చెప్పారు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆంధ్ర ఆర్థిక వ్యవస్థపై ఈ భారం తగదని వారు వాదించారు.
అయితే జగన్ లాయర్ల వాదనలతో సీబీఐ విబేధించింది. జగన్ కి బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని కోర్టులో వాదిస్తూ వస్తోంది సీబీఐ. ఆ వాదనతో కోర్టు అంగీకరించింది. కేసులో చివరి చార్జిషీటు దాఖలు చేసి ఆరేళ్లయినా విచారణ ఇంకా ప్రారంభం కాలేదనీ సీబీఐ తన పిటిషన్లో రాసింది. అంతేకాదు, రాజకీయ, ధన బలంతో సాక్షులను ప్రభావితం చేయాలనుకుంటున్నారని ఆరోపించింది. ఈ వాదనతో జగన్ లాయర్లు విబేధించారు. సీబీఐ వాడిన భాష సరికాదన్నారు. గత ఆరేళ్లలో జగన్ ఎప్పుడూ సాక్షులను ప్రభావితం చేయాలని చూడలేదన్నారు.
చివరకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. జనవరి 3న కూడా విచారణకు జగన్ రాకపోవడంతో వచ్చేవారం తప్పనిసరిగా రావాలని కోర్టు ఆదేశించింది.
ఎప్పుడు అవసరం ఉన్నా మినహాయింపు తీసుకుంటున్నారని కోర్టు గుర్తు చేసింది.
దాంతో ఈ వారం జగన్ హాజరుకావాల్సి వచ్చింది.
ఇవికూడా చదవండి:
- 144 సెక్షన్‌ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
- దేశంలో ముస్లింల భయాందోళనల గురించి మోదీ ప్రభుత్వంలో మంత్రి నఖ్వీ ఏం చెప్పారు?
- CAA-సోనియా గాంధీ: ప్రజాందోళనను బీజేపీ అణచివేయాలని చూస్తోంది
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలపై అంతర్జాతీయ కోర్టుకు మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూచీ
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- బెంగళూరులో బొమ్మ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








