జో బైడెన్: అధ్యక్ష పదవి చేపట్టగానే ట్రంప్ విధానాలు కొన్నింటిని రద్దు చేసే ఆదేశాలపై సంతకం

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే డోనల్డ్ ట్రంప్ కీలక విధానాలు కొన్నింటిని రద్దు చేసే పని ప్రారంభించారు.
"మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే విషయంలో మన వద్ద వృథా చేసేందుకు ఏమాత్రం సమయం లేదు" అని బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం తరువాత వైట్ హౌజ్‌కు వెళుతూ ట్వీట్ చేశారు.
బైడెన్ అధికారంలో తొలి రోజున 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వాటిలో మొదటిది కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించినది. మిగతావి వాతావరణ మార్పులు, వలస విధానాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను రద్దు చేయడానికి సంబంధించిన ఆదేశాలు.
బుధవారం నాడు అమెరికా 46వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ ఓవల్ ఆఫీస్‌లో తన పని ప్రారంభించారు.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల పదవీ ప్రమాణ స్వీకార వేడుక ఈసారి ఎప్పట్లాగా భారీ జన సందోహం మధ్య జరగలేదు. కరోనావైరస్ ప్రభావం వల్ల కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇప్పటికీ అధ్యక్ష బాధ్యతలను బైడెన్‌కు అప్పగిస్తున్నట్లు లాంఛనంగా ప్రకటించని డోనల్డ్ ట్రంప్ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు.
చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత బైడెన్ మాట్లాడుతుతూ, "ప్రజాస్వామ్యం గెలిచింది" అని అన్నారు.
"అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటాను. నాకు ఓటు వేయని వారితో సహా" అని బైడెన్ తన ప్రసంగంలో చెప్పారు. ఈ వేడుకకు ముగ్గురు పూర్వ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ హాజరయ్యారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎనిమిదేళ్ల పాటు బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ట్రంప్ హయాంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మైక్ పెన్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, EPA
అమెరికా క్యాపిటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం తరువాత బైడెన్, ప్రథమ మహిళ లేడీ జిల్ బైడెన్, కమలా హారిస్, ఆమె భర్త డగ్ ఎమ్‌హాఫ్‌లతో పాటు మిత్రులు, మద్దతుదారుల అభినందనలు స్వీకరిస్తూ పెన్సిల్వేనియా అవెన్యూ నుంచి వైట్ హౌజ్‌కు బయలుదేరారు.
ఇనాగ్యురేషన్ వేడుకల్లో పాప్ గాయని లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. జెన్నీఫర్ లోపెజ్, గార్త్ బ్రూక్స్ కూడా పాటలు పాడారు. అమెరికా నేషనల్ యూత్ పోయెట్ లారేట్ నుంచి తొలిసారిగా అమందా గోర్మన్ తన 'ది హిల్ వి క్లయింబ్' కవిత చదివి వినిపించారు.
ఆ తరువాత లింకన్ మెమోరియల్‌లో నటుడు టామ్ హాంక్స్ నిర్వహించిన సంగీత కచ్చేరీలో గాయకులు బ్రూస్ స్ర్రింగ్‌స్టీన్, జాన్ లెజెండ్, జాన్ బోన్ జోవి, జస్టిన్ టింబర్లేక్, డెమి లోవాటోలు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ సంతకం చేసిన ఆదేశాలేంటి?
"ట్రంప్ ప్రభుత్వం చేసిన దారుణమైన నష్టాలను నిలువరించడమే కాదు, మన దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం" అని బైడెన్ అన్నారు.
దేశంలో నాలుగు లక్షలకు పైగా మరణాలకు కారణమైన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తామని, ప్రభుత్వ సంస్థలలో దూరం పాటించేలా చూస్తామన్నారు.
మహమ్మారి కట్టడి కోసం కొత్త అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన బైడెన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆపేస్తామని వివరించారు.
వాతావరణ మార్పులకు సంబంధించిన అంశానికి కూడా తమ ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తుందని బైడెన్ అన్నారు. 2015 నాటి పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి భాగస్వామ్యం తీసుకునేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కూడా చెప్పారు. ఈ ఒప్పందం నుంచి ట్రంప్ గత ఏడాది అమెరికాను తప్పించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









