డోనల్డ్ ట్రంప్: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ‘మోదీ మూడ్’ సరిగా లేదు

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి ప్రతిపాదించారు.

“నేను ఏదైనా సాయం చేయగలను అని వారికి అనిపిస్తే, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాను” అని ట్రంప్ అన్నారు.

చైనాతో ఘర్షణ గురించి ప్రధాని మోదీతో కూడా మాట్లాడానని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల నరేంద్ర మోదీ మూడ్ సరిగాలేదని ట్రంప్ అన్నారు.

గురువారం ఒవల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన భారత్, చైనా మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది అన్నారు.

ఒక భారత జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన “నాకు మీ ప్రధానమంత్రి బాగా నచ్చారు. ఆయన చాలా మంచివారు. భారత్, చైనా మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు దేశాల్లో అటూ, ఇటూ 140-140 కోట్ల మంది చొప్పున జనాభా ఉన్నారు. రెండింటి దగ్గరా చాలా బలమైన సైన్యం ఉంది. భారత్ సంతోషంగా లేదు. బహుశా చైనా కూడా సంతోషంగా లేదు. నేను ప్రధాని మోదీతో మాట్లాడాను. చైనాతో ఇదంతా జరగడం వల్ల ఆయన మూడ్ సరిగా లేదు” అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బుధవారం అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ ద్వారా రెండు దేశాల మధ్య సరిహద్దుల గురించి కొనసాగుతున్న ఉద్రిక్తతలపై మధ్యవర్తిత్వం చేస్తానని ప్రతిపాదించారు. “మధ్యవర్తిత్వానిక సిద్ధంగా ఉన్నాను” అన్నారు.

దీనిపై ఆయన్ను ప్రశ్నించగా “నేను చేయగలను. దానివల్ల ఏదైనా సాయం లభిస్తుందని వారు అనుకుంటే, నేను అలా చేయగలను” అన్నారు.

నరేంద్ర మోదీతో ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఆచితూచి స్పందించిన భారత్

ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనపై భారత్ గురువారం చాలా ఆచితూచి స్పందించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ “మేం శాంతిపూర్వక పరిష్కారం కోసం చైనాతో సంప్రదింపులు జరుపుతున్నాం” అన్నారు.

ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ నుంచి ఏ స్పందనా రాలేదు. కానీ చైనా ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ “రెండు దేశాలకు అలాంటి సాయం అవసరం లేదు” అని చెప్పింది.

భారత్‌తో సరిహద్దుల దగ్గర పరిస్థితి పూర్తిగా స్థిరంగా, నియంత్రణలో ఉందని చైనా చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ఒక మీడియా సమావేశంలో రెండు దేశాల దగ్గర చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు తగిన యంత్రాంగం ఉందని అన్నారు.

“మేం మా ప్రాంత సౌర్వభౌమాధికార రక్షణ, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు చైనా-భారత్ సరిహద్దుల దగ్గర పరిస్థితి పూర్తిగా స్థిరంగా, నియంత్రణలో ఉంది. మేం పూర్తిగా చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోగలం” అన్నారు.

భారత్, చైనా సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ఎందుకు?

భారత్, చైనా మధ్యలో ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర ఉన్న గల్వాన్ లోయకు దగ్గరగా చైనా సైన్యం కొన్ని టెంట్లు వేసిందని భారత్ ఆరోపించడంతో ఆ లోయ గురించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

గల్వాన్ లోయ లద్దాఖ్, అక్సాయ్ చిన్ మధ్య భారత-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఇక్కడ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) అక్సాయ్ చిన్‌ను భారత్ నుంచి వేరు చేస్తుంది. ఈ లోయ చైనా దక్షిణ షింజియాంగ్, భారత్ లద్దాఖ్‌లలో వ్యాపించి ఉంది.

ఆ తర్వాత భారత్ అక్కడ సైన్యం మోహరించింది. అటు భారత్ గల్వాన్ లోయ దగ్గర రక్షణ సంబంధిత అక్రమ నిర్మాణం చేపడుతోందని చైనా ఆరోపించింది. అంతకు ముందు మే 9న నార్త్ సిక్కింలో నాథూలా సెక్టార్‌లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో లద్దాఖ్‌లో ఎల్వోసీ దగ్గర చైనా ఆర్మీ హెలికాప్టర్లు కనిపించాయి. ఆ తర్వాత భారత వైమానిక దళం కూడా సుఖోయ్, మిగతా యుద్ధవిమానాలతో పెట్రోలింగ్ ప్రారంభించింది.

భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ఈ అనిశ్చితికి తెరదించడానికి డివిజన్ కమాండర్ స్థాయిలో జరిగిన చాలా చర్చలు విఫలమయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రస్తుత స్థితిపై, చైనాతో కొనసాగుతున్న అనిశ్చితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారని ద హిందూ చెప్పింది.

ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ విపిన్ రావత్, త్రివిద దళాల చీఫ్‌లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)