పౌరసత్వ సవరణ బిల్లు: "రాజకీయ వర్గం జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి" - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ (సవరణ) బిల్లుపై భద్రత, వ్యూహాత్మక అంశాలపై కామెంటేటర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేషాద్రి చారి బీబీసీ కోసం రాసిన వ్యాసం ఇది.
స్వతంత్ర భారతానికి పునాదులు వేసిన మహామహులు స్వప్నించిన 'భారత భావన(ఐడియా ఆఫ్ ఇండియా)'కు పౌరసత్వం(సవరణ) బిల్లు విరుద్ధమనడాన్ని మించిన అసత్యం మరొకటి ఉండదు.
పౌరసత్వ చట్టం-1955ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. భారతదేశ విభజన విషాదకరంగా జరిగింది. పెద్దయెత్తున జనాభా వలస వెళ్లడం, రావడం జరిగింది. అయితే, నాటి వలసలు సంపూర్ణంగా జరగలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పౌరసత్వ చట్టం 1955 వచ్చింది.
భారత్ లౌకికదేశంగా కొనసాగాలని నిర్ణయించుకోగా, 1956లో పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా అవతరించింది. బహుశా అలా ప్రకటించుకున్న తొలి దేశం పాకిస్తానే కావొచ్చు. పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా 1948లో చనిపోయారు. ఆయన చేసిన ముందస్తు హెచ్చరికను పాకిస్తాన్ తనను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించుకొని గాలికి వదిలేసింది. పాకిస్తాన్ అంతకంతకూ ఓ మతగురువుల ప్రాబల్య వ్యవస్థగా మారుతూ వచ్చింది.
ముస్లిమేతరులు ప్రత్యేకించి హిందువులు, క్రైస్తవుల కష్టాలు పెరగడం మొదలైంది. ముస్లిమేతరులను పీడించడంతో ఈ వర్గాల ప్రజలు పెద్దయెత్తున పొరుగు దేశమైన భారత్‌కు వలస వచ్చారు. దీంతో ముస్లిమేతరుల జనాభా రెండు శాతం కంటే తక్కువకు పడిపోయింది. భారతదేశ విభజన తర్వాత 47 లక్షల మంది హిందువులు, సిక్కులు భారత్‌కు వలస వచ్చినట్లు చెబుతారు.
నాడు ఇలా చాలా మందికి సొంత దేశమంటూ లేకుండా పోయింది. వాళ్లను తప్పేమీ లేకపోయినా, వాళ్లను స్వీకరించిన దేశంలో వాళ్లు శరణార్థులుగా ఉండిపోవాల్సి వచ్చింది. వీళ్ల డిమాండ్లను తీర్చేందుకు పౌరసత్వ చట్టం-1955ను సవరించాల్సిన అవసరం చాలా కాలంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత భావన ప్రకారం- భారత్ అన్ని మత విశ్వాసాల ప్రజలను ఎలాంటి వివక్షా లేకుండా స్వీకరించే స్వచ్ఛమైన లౌకికవాదాన్ని నిలబెట్టే దేశం.
దీర్ఘకాలికంగా తీరని ఈ అవసరాన్ని పౌరసత్వ సవరణ బిల్లు తీరుస్తుంది. పాకిస్తాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను భారత పౌరులను చేయడం ఈ బిల్లులో అత్యంత ప్రధానమైన అంశం. ఇప్పటివరకున్న పౌరసత్వ చట్టం ప్రకారం- 'న్యాచురలైజేషన్' విధానంతో పౌరసత్వం లభించాలంటే 12 ఏళ్ల వ్యవధిలో చివరి 12 నెలలు మొత్తంగా 11 ఏళ్లు భారత్‌లో నివసించి ఉండాలి. బిల్లులో పేర్కొన్న మతాలు పాటించేవారికి, దేశాలకు చెందినవారికి ఈ 11 ఏళ్ల కాలాన్ని ఆరేళ్లకు కుదిస్తారు.
బిల్లులో పేర్కొన్న దేశాల్లో మైనారిటీలను మతప్రాతిపదికన హింసిస్తున్నారు. ఈ చేదునిజాన్ని బిల్లు పరిగణనలోకి తీసుకొంటుంది. ఇతర కారణాలతో నిరాశ్రయులు కావడం, మత ప్రాతిపదికన జరిగే హింసతో నిరాశ్రయులు కావడం ఒకటి కాదు. రోహింజ్యా ముస్లింలకూ ఈ బిల్లు ద్వారా పౌరసత్వం కల్పించాలనే వాదన నిలబడదు. మియన్మార్ ప్రభుత్వంతో రోహింజ్యా ముస్లింలకు సమస్య ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంపై వాళ్లు తిరుగుబాటు వరకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో వాళ్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సమస్య ప్రభావం భారత్‌పైనా పడింది. రోహింజ్యా ముస్లింలను వాళ్ల స్వదేశానికి చేర్చి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరముంది.
రాజకీయ పరిణామాలు లేదా అలాంటి ఇతర కారణాల వల్ల నిరాశ్రయులయ్యే వారికీ, మతపరమైన పీడనతో నిరాశ్రయులయ్యేవారికీ మధ్య తేడాను సీఏబీ స్పష్టంగా చూపిస్తుంది. 2008-09కి ముందు రెండు దశాబ్దాల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ) కార్యకలాపాల బారి నుంచి తప్పించుకొనేందుకు దక్షిణాది(తమిళనాడు)లో శరణార్థులుగా ఉండిపోయిన నిరాశ్రయులను సీఏబీ పరిగణలోకి తీసుకోలేదనే వాదనా నిలబడేది కాదు. అయితే, సమీప భవిష్యత్తులో ప్రభుత్వం ఈ బిల్లుకు సంబంధించి ఇలాంటి సూక్ష్మ అంశాలన్నీ ప్రజలకు వివరించడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
సీఏబీ ముస్లింలకు వ్యతిరేకమనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పెద్దయెత్తున ప్రచారం నిర్వహించాల్సి ఉంది. భారత పౌరులుగా రాజ్యాంగం ప్రకారం తమకున్న హక్కులను వినియోగించుకొనే లక్షల మంది ముస్లింల గురించి ఈ బిల్లు ఎలాంటి ప్రస్తావనా తీసుకురాలేదు. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని వాతావరణాన్ని కలుషితం చేసేందుకు రాజకీయ ప్రేరేపిత, దురుద్దేశపూరిత ప్రచారం దేశంలో జరుగుతోంది. ఈ దుష్ప్రచారం మతపరమైన దావానలం రూపు తీసుకొనేలోపే ప్రభుత్వం దీనిని తక్షణం అడ్డుకోవాలి.
సమానత్వ హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణ 14ను ఈ బిల్లు ఉల్లంఘిస్తోందనే వాదనకూ ఆధారం లేదు. నిజానికి ఈ బిల్లు పరిధిలోకి వచ్చే వారందరికీ ఇంతవరకు దక్కని అన్ని హక్కులను ఇది కల్పిస్తుంది.
ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డుదారులకు సంబంధించిన నిబంధనలనూ ఈ బిల్లు సవరిస్తుంది. భారతీయ మూలాలు ఉంటే (ఉదాహరణకు భారత మాజీ పౌరులు లేదా వారి వారసులు కావడం), లేదా భార్యకుగాని/భర్తకుగాని భారత మూలాలు ఉంటే వాళ్లు 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం 'ఓసీఐ'గా నమోదు చేయించుకోవచ్చు. ఇలా చేస్తే వారికి భారత్‌లో పర్యటించే హక్కు, చదువుకొనే హక్కు, పనిచేసే హక్కు లాంటి ప్రయోజనాలు కలుగుతాయి.
ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్‌పీ) నిబంధనల పరిధిలోకి వచ్చే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్‌లకు సీఏబీ నిబంధనలు వర్తించవని సీఏబీ చెబుతోంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలు వర్తించవని బిల్లు స్పష్టం చేస్తోంది. నిర్దేశిత ప్రాంతంలో భారత పౌరులు భూములు లేదా ఆస్తులు కొనడం, ఉద్యోగాలు చేయడం ద్వారా స్థిరపడటాన్ని ఐఎల్‌పీ అడ్డుకొంటుంది.
సీఏబీతో పౌరసత్వం దక్కే 'కొత్త పౌరులు'కు కూడా ఐఎల్‌పీ నిబంధనల నుంచి మినహాయింపు ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పౌరుల వల్ల ఈ ప్రాంతాల్లో స్థానిక జీవనశైలికి భంగం కలగకుండా ఐఎల్‌పీ నిబంధనలు రక్షణ కల్పిస్తాయి. ఐఎల్‌పీ బ్రిటిష్ పాలన నాటిది. ఆధునిక ఆర్థికాభివృద్ధి అవసరాలు, అవకాశాలకు తగినట్లుగా ఐఎల్‌పీని సవరించాలనే వాదన కూడా ఉంది.

అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాలు సీఏబీ పరిధిలో ఉన్నాయి. అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించిన చాలా మంది ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారు ఈ బిల్లుతో ప్రయోజనం పొందుతారని, ఇక వీళ్లు తమ రాష్ట్రంలో అధికారికంగా స్థిరపడిపోతారని అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరి ఆందోళనగా మరింతగా దృష్టి పెట్టి, సత్వరం దీనిని తొలగించాల్సి ఉంది. ఈ నిబంధనలోని సున్నితమైన అంశాలే అస్సాంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయం బాగుండే ప్రాంతాల్లో, తేయాకు తోటల్లో సీఏబీపై వ్యతిరేకతకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులతో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రం అస్సామే. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి ముందు పెద్దసంఖ్యలో హిందువులు భారత్‌కు వలసరావడం మొదలైంది. వీరు బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ సైనికుల దురాగతాల బాధితులు. హిందువులను శరణాగతులుగా, అక్రమ వలసదారులను బయటివారిగా వర్గీకరించే ప్రయత్నం జరిగింది. ఈ అక్రమ వలసదారుల్లో అత్యధికులు ముస్లింలు.
భారత్ పరిసర ప్రాంతాల్లో మారుతున్న సామాజిక పరిస్థితులను, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను భారత్‌లోని రాజకీయ వర్గం అర్థం చేసుకోవాల్సి ఉంది. సీఏబీని జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి.
విషాదకరమైన దేశ విభజన, మతపరమైన అతివాదం, సామాజిక విభేదాల వల్ల ఉన్న దేశంలో ఘోరమైన పరిస్థితుల మధ్య బతకలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారు 'శరణార్థుల'నే అవమానభారంతో కాకుండా పౌరులుగా గౌరవంగా బతికేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
అన్ని రాజకీయ పార్టీలు సంకుచిత వైఖరులను పక్కనబెట్టి, పౌరసత్వం విస్తృత అంశాలపై చర్చించాల్సిన అవసరముంది. పరస్పర విశ్వాసంతో కూడిన వాతావరణంలో ఈ చర్చ సాగాలి. తద్వారా దేశ విభజనతో ఏర్పడిన చీలికలను కొత్త సమస్యలు లేకుండా పరిష్కరించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్
- పానిపట్ సినిమా వివాదం: 'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








