COP25 మాడ్రిడ్‌లో ఐరాస వాతావరణ సదస్సు ఎందుకు నిస్సారంగా ముగిసింది?

కాప్25

ఫొటో సోర్స్, KIARA WORTH/IISD

ఫొటో క్యాప్షన్, కొన్ని క్లిష్టమైన సమస్యలకు మాడ్రిడ్ సదస్సులో ఎలాంటి పరిష్కారం లభించలేదు
    • రచయిత, మాట్ మెక్‌గ్రాత్
    • హోదా, పర్యావరణ ప్రతినిధి, మాడ్రిడ్

ఐక్యరాజ్యసమితి మాడ్రిడ్‌లో నిర్వహించిన వాతావరణ పరిరక్షణ సదస్సులో సుదీర్ఘంగా సాగిన చర్చలు చివరకు రాజీ ఒప్పందంతో ముగిశాయి.

కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్రపంచ దేశాల స్పందనను మెరుగుపరచడమే కీలక అంశం మీద సదస్సులోని ప్రతినిధులు ఎట్టకేలకు ఒక ఒప్పందానికి వచ్చారు.

వచ్చే ఏడాది గ్లాస్గోలో జరుగనున్న తదుపరి ప్రధాన సదస్సులో అన్ని దేశాలూ వాతావరణ పరిరక్షణ కోసం తాము తీసుకున్న కొత్త తీర్మానాలను సమర్పించాల్సి ఉంటుంది.

కర్బన మార్కెట్లు సహా ఇతర సమస్యల మీద విభేదాలు తదుపరి సమావేశం వరకూ వాయిదా పడ్డాయి.

అంగీకారం ఏమిటి?

ఈ వాతావరణ చర్చలు నిర్ణీత సమయం కన్నా మరో రెండు రోజులు అదనంగా కొనసాగాయి. చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు చివరికి, వచ్చే ఏడాది గ్లాస్గో సదస్సు సమయంకల్లా కర్బన ఉద్గారాలను తగ్గించటానికి సంబంధించి, సరికొత్త, మెరుగైన ప్రణాళికలను సిద్ధం చేయాలనే ఒప్పందానికి వచ్చారు.

ప్రమాదకరమైన వాతావరణ మార్పును నిరోధించటానికి అవసరమైన చర్యలు అంటూ సైన్స్ చెప్తున్న దానికి.. ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న అగాధాన్ని అన్ని పక్షాలూ పరిష్కరించాల్సి ఉంటుంది.

అధిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్, చిన్న దీవి దేశాల మద్దతుతో ముందుకు తెచ్చిన ప్రతిపాదనను అమెరికా, బ్రెజిల్, ఇండియా, చైనా సహా పలు దేశాలు వ్యతిరేకించాయి.

అయితే, 2020కి ముందు సంవత్సరాల్లో వాతావరణ మార్పు మీద తమ హామీలను నిలబెట్టుకున్నామని సంపన్న దేశాలు నివేదికలు ఇవ్వాలన్న షరతుతో ఈ రాజీ ఒప్పందం కుదిరింది.

line

బ్రిటన్ మీద భారీ ఒత్తిడి

రోజర్ హరాబిన్, పర్యావరణ విశ్లేషకుడు

వచ్చే ఏడాది భారీ వాతావరణ సదస్సు స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరుగుతుంది. దానివల్ల బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.

బ్రిటన్ స్వయంగా తన మధ్యంతర వాతావరణ లక్ష్యాలను సాధించటంలో విఫలమవుతున్న పరిస్థితుల్లో, ఇతర దేశాలకు నాయకత్వం వహించాలని ఆయన ప్రయత్నిస్తే ఆయన 'అవమానాల'కు గురవుతారని పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆయనను హెచ్చరించారు.

కోట్లాది ఇళ్లను ఇన్సులేషన్ చేసి తీరాలని బ్రిటన్ పర్యావరణ సలహాదారులు హెచ్చరిస్తున్నారు.

అలాగే, జాన్సన్ చేపట్టిన 2.88 కోట్ల పౌండ్ల రోడ్డు నిర్మాణ ప్రణాళిక కర్బన ఉద్గారాలను నిర్మూలించటానికి అనుగుణంగా లేదని ఇతర నిపుణులు చెప్తున్నారు.

పూర్తి విద్యుత్ కార్లు కూడా ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించబోవని వారు అంటున్నారు. ప్రజలు తమ ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే విధంగా నడవటానికి, సైకిళ్ల మీద ప్రయాణించటానికి ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విమానయానాన్ని విస్తరించటం వల్ల ఉద్గారాలు పెరుగుతాయని కూడా వారు చెప్తున్నారు.

ఇందులో జాన్సన్ జరపబోయే బ్రెగ్జిట్ చర్చల పాత్ర కూడా ఉంటుంది. అమెరికా ఏ వాణిజ్య ఒప్పందంలోనూ వాతావరణ మార్పు గురించి చర్చించదు. మరోవైపు.. ఈయూ మాత్రం గ్రీన్‌హౌస్ వాయువలను తగ్గించని దేశాల మీద అధిక పన్ను విధిస్తోంది. ఇరువురినీ మెప్పించటం అసాధ్యమవుతుంది.

ఆంటోనియో గుటెరస్

ఫొటో సోర్స్, cop25

ఫొటో క్యాప్షన్, ఆంటోనియో గుటెరస్

ప్రతిస్పందన ఎలా ఉంది?

ఈ ఫలితం తనకు నిరాశ కలిగించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.

''వాతావరణ సంక్షోభాన్ని నివారించటానికి, అధిగమించటానికి, నిధులు అందించటానికి గల ఒక ముఖ్యమైన అవకాశాన్ని అంతర్జాతీయ సమాజం చేజార్చుకుంది'' అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ఉటంకించింది.

యూరోపియన్ క్లైమేట్ ఫౌండేషన్‌కు చెందిన పర్యావరణవేత్త, పారిస్ ఒప్పంద రూపశిల్పి లారెన్స్ టుబియానా.. ఇవి మిశ్రమ ఫలతాలని అభివర్ణించారు. అయితే మనం చేపట్టాల్సిన చర్యల గురించి సైన్స్ చెప్తున్న దానికి చాలా దూరంగా ఉన్నాయన్నారు.

''మాడ్రిడ్ సదస్సులో ఫలితాలు సాధించాల్సిన ప్రధాన నాయకులు అంచనాలకు అనుగుణంగా నడచుకోలేకపోయారు. కానీ చిన్న దీవి దేశాలు, యూరోపియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ దేశాల ప్రగతిశీల కూటమి కృషితో.. అతిపెద్ద కాలుష్యకారకులకు వ్యతిరేకంగా సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను సాధించాం'' అని ఆమె పేర్కొన్నారు.

కార్బన్ మార్కెట్లు సహా ఇతర ప్రధాన సమస్యలపై చర్చలను గ్లాస్గో సదస్సుకు వాయిదా వేశారు.

ఈ ఒప్పందంలోని ఈ కోణాన్ని ఉద్యమకారులు స్వాగతించారు.

''మార్కెట్ ఆధారిత వ్యవస్థకు సంబంధించి బ్రెజిల్, ఆస్ట్రేలియాలు ముందుకు తెచ్చిన బలహీన నిబంధనలు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీయలవు.. అదృష్టవశాత్తూ వాటిని పక్కన పెట్టటం జరిగింది. దాని మీద పోరాటం వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కాప్26లో కొనసాగవచ్చు'' అని పవర్ షిఫ్ట్ ఆఫ్రికా అనే సంస్థకు చెందిన మొహమ్మద్ అడో చెప్పారు.

ఈ సదస్సుకు హాజరైన వారిలో చాలా మంది.. మొత్తం ప్యాకేజీ మీద అసంతృప్తిగా ఉన్నారు. సైన్స్ చెప్తున్న అత్యవసర పరిస్థితిని ఈ ఒప్పందం ప్రతిఫలించటం లేదని వారు భావిస్తున్నారు.

భూతాపం

భూతాపానికి సాక్ష్యాలేమిటి?

వరల్డ్ మెటిరియోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) చెప్తున్న దాని ప్రకారం.. ప్రపంచం.. పారిశ్రామికీకరణ విస్తరించటానికన్నా ముందు నాటికన్నా ఇప్పుడు ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువ వేడిగా ఉంది.

ఇప్పటివరకూ, అత్యంత ఉష్ణతాపం కలిగిన 20 సంవత్సరాలు... గత 22 ఏళ్ళలోనే నమోదయ్యాయి. అందులోనూ, 2015 నుంచి 2018 వరకూ నాలుగు సంవత్సరాలు ఆ జాబితాలో అగ్రభాగాన నిలిచాయి.

వాతావరణం వేడెక్కుతున్న ప్రస్తుత పోకడ కొనసాగితే ఈ శతాబ్దం ముగిసేనాటికి వాతావరణాలు 3 నుంచి 5 సెంటీగ్రేడ్స్ మధ్య పెరగవచ్చునని డబ్ల్యూఎంఓ చెబుతోంది.

ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెంటీగ్రేడ్స్ దాటితే.. భూతాపం ప్రమాదకరంగా పరిణమిస్తుందని పరిగణించారు. ఇటీవలి కాలంలో..

ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెంటీగ్రేడ్స్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవటం.. ప్రపంచానికి సురక్షితమైన భూతాప పరిమితి అని శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు వాదిస్తున్నారు.

కానీ, భూతాపం పెరుగుదల 1.5 సెంటీగ్రేడ్స్ లోపే పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే, ''సమాజంలోని అన్ని రంగాల్లో వేగవంతమైన, సమూలమైన, అసాధారణమైన మార్పులు అవసరం'' అని 2018లో ఐపీసీసీ నివేదిక పేర్కొంది.

వాతావరణ మార్పు

ఫొటో సోర్స్, Reuters

వాతావరణ మార్పు మనపై చూపే ప్రభావం ఏమిటి?

ఈ ప్రభావాల తీవ్రత ఎలా ఉంటుందనే అంశంపై వివిధ స్థాయిల్లో అనిశ్చితి ఉంది.

ఈ మార్పుల వల్ల మంచి నీటి కొరత పెరగవచ్చు, దానివల్ల ఆహార ఉత్పత్తిలో మన సామర్థ్యం సమూలంగా మారిపోతుంది. వరదలు, తుపానులు, వడగాడ్పులు, కరవు మరణాల సంఖ్య పెరుగుతుంది.

ఇప్పుడు మనం కర్బన ఉద్గారాలను నాటకీయ స్థాయిలో తగ్గించినప్పటికీ.. ఈ ప్రభావాలు కొనసాగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎందుకంటే, వాతావరణ వ్యవస్థలోని కొన్ని భాగాలు - ముఖ్యంగా భారీ నీరు, మంచు ప్రాంతాలు ఉష్ణోగ్రతల్లో మార్పులకు ప్రతిస్పందించటానికి వందలాది సంవత్సరాలు పడుతుంది.

వాతావరణం నుంచి కర్బన గ్రీన్‌హౌస్ వాయువులను తొలగించటానికి కూడా దశాబ్దాల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)