గ్రెటా థన్‌బర్గ్: ప్రపంచ నాయకులను కాల్చి పడేయాలని అనలేదు.. అలా అర్థమైతే క్షమించండి

ఫొటో సోర్స్, AFP
పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ఇటీవల ప్రపంచ నాయకులనుద్దేశించి తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
ఇటలీలోని ట్యూరిన్‌లో శుక్రవారం ఆమె తదుపరి కార్యాచరణపై మాట్లాడుతూ ''World leaders should be put against the wall" అన్నారు. ఇంగ్లిష్‌లో ''put against the wall" అనే పదబంధానికి 'కాల్చి చంపేయాలి' అన్న అర్థం ఉంది. దీంతో గ్రెటా వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రెటా మాత్రం తన సొంత భాష స్వీడిష్‌లో ఈ పదబంధానికి వేరే అర్థం ఉందని చెబుతున్నారు. సొంత భాష కాకుండా వేరే భాషలో ఉపన్యసించడం వల్ల ఇలా జరిగిందని శనివారం ఆమె చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, EPA
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన కాప్-25 సదస్సులో పాల్గొన్న అనంతరం ఆమె శుక్రవారం ఇటలీలోని ట్యూరిన్‌లో మాట్లాడారు.
వాతావరణ మార్పులను నియంత్రించే చర్యలకు పురికొల్పేలా ఈ సదస్సు ఒక్కటే చాలదని.. ప్రపంచ నేతలు ఈ దిశగా కార్యాచరణ చేపట్టేలా పర్యావరణ ఉద్యమకారులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
''ప్రపంచ దేశాల నాయకులు తమ బాధ్యతల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, వారు తప్పించుకోలేకుండా చేయాలి మనం'' అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
''ఇందుకోసం వారిని జవాబుదారీ చేయాలి.. మన భవిష్యత్తును రక్షించడానికి వారు పనిచేసేలా చేయాలి'' అన్నారు. ఈ సందర్భంలోనే ఆమె ''put against the wall" అనే పదబంధాన్ని ఉపయోగించారు.
ఈ పదబంధం ఉపయోగించడంపై వ్యతిరేకత రావడంతో ట్విటర్ వేదికగా ఆమె స్పష్టత ఇచ్చారు. నాయకులు జవాబుదారీగా ఉండాలనే అర్థంలో తాను వాడానని.. స్వీడన్‌లో అదే అర్థంలో వాడతారని.. కానీ, దానికి వేరే అర్థం ఉందని ఇప్పుడే తెలిసిందని చెప్పుకొచ్చారు.
''నా మాటలను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే వారికి క్షమాపణలు చెబుతున్నాను'' అని ట్వీట్ చేశారు.
వాతావరణ సంక్షోభంపై పోరాటంలో ప్రపంచాన్ని కదిలించిన అతి చిన్న వయస్కురాలిగా ఇటీవలే టైమ్ మ్యాగజీన్ ఆమెను 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా గుర్తించింది.
ఇవి కూడా చదవండి:
- హిందూ, ముస్లిం, క్రైస్తవుల తీర్థయాత్రలకు ప్రభుత్వం ఎలా ఆర్థిక సహాయం అందిస్తోంది...
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సంసిద్ధతపై 5 ప్రశ్నలు
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
- 'స్మోకింగ్ నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది '
- మా అమ్మకు వరుడు కావలెను
- టీఎన్ శేషన్ (1932-2019): ఎవరికీ భయపడని భారత ఎన్నికల కమిషనర్
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








