పాకిస్తాన్: హఫీజ్ సయీద్‌కు అయిదున్నరేళ్ల జైలు శిక్ష విధించిన లాహోర్ కోర్టు

హఫీజ్ సయీద్

ఫొటో సోర్స్, Getty Images

ముంబై దాడుల మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న హఫీజ్ సయీద్‌కు మిలిటెంట్లకు అక్రమంగా నిధులు సమకూరుస్తున్నారనే రెండు వేర్వేరు కేసుల్లో లాహోర్ కోర్టు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

రెండు వేరు వేరు కేసుల్లో హఫీజ్ సయీద్‌కు విధించిన రెండూ శిక్షలనూ ఐదున్నరేళ్ల పాటు ఒకేసారి అమలుచేస్తారు.

లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజంకోర్టు లాహోర్, గుజ్రాన్‌వాలా పరిధిలోని రెండు వేరు వేరు కేసుల్లో ఈ శిక్షలు విధించింది.

నిషేధిత జమాత్-ఉద్-దవా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్, అతని సహచరుడు జఫర్ ఇక్బాల్‌పై మిలిటెంట్లకు అక్రమంగా నిధులు అందించారనే(ఇల్లీగల్ ఫండింగ్) ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసుల్లో హఫీజ్ మొహమ్మద్ సయీద్, అతని సంస్థలోని సహచరులను 2019 డిసెంబర్‌లో దోషులుగా ఖరారు చేశారు.

హఫీజ్ సయీద్, అతడి సహచరులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అంటున్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు.

హఫీజ్ సయీద్

ఫొటో సోర్స్, Getty Images

ఏడాది క్రితం అరెస్ట్

పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు నిషేధిత జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై నమోదైన రెండు రెండు వేర్వేరు కేసులపై విచారణ పూర్తి చేసి, తీర్పును ఫిబ్రవరి ఆరుకు రిజర్వ్ చేసింది.

పంజాబ్ పోలీస్‌కు చెందిన 'కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్' గత ఏడాది జులై 17న హఫీజ్ మొహమ్మద్ సయీద్, అతడి సహచరుడు జఫర్ ఇక్బాల్‌ను పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాలో అరెస్ట్ చేసింది.

వీరిపై నమోదైన కేసులపై ప్రాథమిక విచారణ గుజ్రాన్‌వాలా స్పెషల్ యాంటీ-టెర్రరిజం కోర్టులో జరిగాయి. కానీ హఫీజ్ సయీద్ అభ్యర్థనతో లాహోర్ హైకోర్ట్ అతడిపై నమోదైన కేసులను లాహోర్‌లోని స్పెషల్ యాంటీ-టెర్రరిజం కోర్టుకు బదిలీ చేసింది.

హఫీజ్ సయీద్

ఫొటో సోర్స్, Getty Images

రెండు డజన్ కేసులు

పోలీసులు హఫీజ్ సయీద్‌ను యాంటీ టెర్రరిజం కోర్టులో హాజరు పరుస్తూ వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 11న కోర్టు అతడిపై అభియోగాలు ఖరారు చేసింది. ఆ తర్వాత విచారణ ప్రారంభమైంది.

"హఫీజ్ మహమ్మద్ సయీద్, అతడి సహచరుడికి వ్యతిరేకంగా నమోదైన ఆరోపణలను నిర్ధారించేందుకు తగిన సాక్ష్యాలను మేం కోర్టులో ప్రవేశపెట్టాం" అని స్పెషల్ ప్రాసిక్యూటర్ అబ్దుల్ రవూఫ్ వట్టో బీబీసీకి చెప్పారు.

యాంటీ-టెర్రరిజం కోర్టు హఫీజ్ సయీద్‌పై నమోదైన కేసుల్లో సాక్ష్యుల వాంగ్మూలం రికార్డ్ చేసింది. విచారణ పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది.

హఫీజ్ మొహమ్మద్ సయీద్, అతడి నిషేధిత సంస్థ నేతలపై పాక్ పంజాబ్ అంతటా దాదాపు రెండు డజన్ల కేసులు నమోదయ్యాయి.

అటు, హఫీజ్ సయీద్, అతడి నిషేధిత సంస్థకు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్ రహమాన్ మక్కీ సహా ఐదుగురు కీలక నేతలపై నమోదైన మరో 4 కేసుల్లో కూడా యాంటీ-టెర్రరిజం కోర్టులో విచారణలు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)