థాయ్‌లాండ్ కాల్పులు: 26 మందిని హతమార్చిన సైనికుడిని ఎలా చంపేశారంటే...

ఫొటో సోర్స్, facebook
థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం నాటి సైనికుడి కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 20 నుంచి 26కు పెరిగింది. కాల్పులకు పాల్పడ్డ జూనియర్ ఆఫీసర్ జక్రఫంత్ థొమ్మాను భద్రతా బలగాలు కాల్చి చంపాయని పోలీసులు చెప్పారు.
అతడు జరిపిన కాల్పుల్లో 57 మంది గాయపడ్డారు.
నఖోన్ రట్చసిమా నగరాన్ని కోరట్ అని కూడా అంటారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడున్నరకు సౌథమ్ ఫిథక్ మిలిటరీ క్యాంపులో థొమ్మా కాల్పులు మొదలయ్యాయి.


థొమ్మా మొదట తన కమాండింగ్ ఆఫీసర్‌ను చంపేసి, సైనిక క్యాంపు నుంచి ఆయుధాలను, ఆయుధ సామగ్రిని దొంగిలించి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
క్యాంపులో చనిపోయిన అధికారి కల్నల్ అనంతరోట్ క్రాసే అని బ్యాంకాక్ పోస్ట్ చెప్పింది.
అక్కడ క్రాసే అత్త అయిన 63 ఏళ్ల మహిళ, మరో సైనికుడు కూడా కాల్పుల్లో చనిపోయినట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
క్యాంపు నుంచి హంవీ-తరహా వాహనంలో థొమ్మా బయల్దేరాడు. అనేక చోట్ల కాల్పులు జరుపుతూ సాగాడు. సాయంత్రం ఆరు గంటలకు టర్మినల్ 21 షాపింగ్ సెంటర్‌కు చేరుకున్నాడు.
అతడు అక్కడ వాహనంలోంచి దిగి, పారిపోతున్న జనంపై కాల్పులు జరిపాడని స్థానిక మీడియాలో ప్రసారమైన వీడియోలను బట్టి తెలుస్తోంది.
నగర వీధులతోపాటు షాపింగ్ సెంటర్లో థొమ్మా కాల్పులకు తెగబడ్డాడు. తన దాడి దృశ్యాలను అతడు సోషల్ మీడియాలో పెట్టాడు.
థొమ్మాతో కాల్పులు విరమింపజేయడానికి అధికారులు అతడి తల్లిని కూడా షాపింగ్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
శనివారం రాత్రి షాపింగ్ సెంటర్ భవనంలో అతడిని భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి చంపేశాయి.
థోమా వయసు 32 ఏళ్లు.
థాయ్ ప్రధాని ప్రయుత్ చన్-వోచా నగరంలోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత కాల్పుల ఘటన గురించి మాట్లాడారు. ఇలాంటి ఘటన ముందెన్నడూ జరగలేదని, ఇలాంటి సంక్షోభం మరెన్నడూ తలెత్తకూడదని చెప్పారు. ఓ ఆస్తి లావాదేవీలో మోసపోయాననే భావన థొమ్మాకు ఉండేదని, అదే ఈ దాడికి కారణంగా కనిపిస్తోందని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశాడు?
దాడి సమయంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో థొమ్మా పోస్ట్‌లు పెట్టాడు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌లో- "నేను లొంగిపోవాలా, వద్దా" అని అడిగాడు. ఇంతకుముందు అతడు ఓ తుపాకీ, మూడు తూటాలు ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, ఎగ్జైట్ అవ్వాల్సిన సమయం వచ్చిందని, మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరని రాశాడు.
కాల్పుల ఘటన తర్వాత అతడి పేజీని ఫేస్‌బుక్ తొలగించింది. ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారికి ఫేస్‌బుక్‌లో తావులేదని, ఈ దాడికి ప్రశంసించే లేదా మద్దతిచ్చే వారిని తాము అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీ మరో అయిదారేళ్లు ఆడితే... ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి: కపిల్ దేవ్
- జాను సినిమా రివ్యూ: ఈ రీమేక్ చిత్రం తమిళ '96'లోని ఒరిజినల్ ఫీల్ క్యారీ చేయగలిగిందా?
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌కు 193 కోట్ల జరిమానా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- హోంశాఖ సమాధానంపై వైసీపీ, టీడీపీ ఏమంటున్నాయి? గజెట్ ప్రాధాన్యం ఎంత
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









