అఫ్గానిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు: మిలిటెంట్ల దాడుల మధ్య పోలింగ్... నలుగురు మృతి

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

మిలిటెంట్ల బాంబు దాడులు, భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం అఫ్గానిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు.

పోలింగ్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా 70 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అయినప్పటికీ పలు ఓటింగ్ కేంద్రాలపై మిలిటెంట్లు బాంబులు, మోర్టార్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ హింసలో నలుగురు చనిపోయారు. 80 మంది గాయపడ్డారు.

దక్షిణ ప్రాంత నగరం కాందహార్లో ఓ పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి జరిగినప్పటికీ, ఎంతో మంది మహిళలు క్యూలలో నిలబడి ఓట్లు వేశారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందనే వార్తలు వస్తున్నాయి. పోలింగ్ బూత్‌లపై దాడులు జరుపుతామన్న తాలిబన్ల హెచ్చరికలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మార్పు రాకపోవచ్చనే భావన కూడా ఓటర్ల నిరుత్సాహానికి కారణం కావొచ్చు.

ఓటింగ్‌లో మోసాలను నివారించే ప్రయత్నంలో భాగంగా బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించారు. బయోమెట్రిక్ పరికరాలతో నిర్ధరించుకున్న ఓట్లను మాత్రమే లెక్కిస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. ఫలితాలు మూడు వారాల తర్వాత వెలువడతాయి.

శనివారం మజారీషరీఫ్‌ నగరంలోని పోలింగ్ కేంద్రంలో బయోమెట్రిక్ పరికరంతో ఓటరు ముఖాన్ని స్కాన్ చేస్తున్న ఎన్నికల అధికారి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, శనివారం మజారీషరీఫ్‌ నగరంలోని పోలింగ్ కేంద్రంలో బయోమెట్రిక్ పరికరంతో ఓటరు ముఖాన్ని స్కాన్ చేస్తున్న ఎన్నికల అధికారి

అఫ్గానిస్తాన్ జనాభా సుమారు 3.7 కోట్లు. వీరిలో కోటి కంటే తక్కువ మందే ఓటు వేయడానికి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఇందులో దాదాపు 35 శాతం మంది వరకు మహిళలు ఉన్నారు.

తాజా ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా అబ్దుల్లా. 2014 నుంచి ఒకే ప్రభుత్వంలో వీరిద్దరూ అధికారాన్ని పంచుకొంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు 18 మంది వివరాలు నమోదు చేయించుకున్నారు. తర్వాత వీరిలో ఐదుగురు వెనకడుగు వేశారు. అధ్యక్ష పదవికి మహిళలు ఎవరూ పోటీపడటం లేదు.

2014లో అధ్యక్ష పీఠమెక్కేందుకు నెలలపాటు పోరాడిన ఇద్దరు ముఖ్య నాయకులే ఈ ఎన్నికల్లోనూ ప్రధాన పోటీదారులుగా తలపడుతున్నారు.

అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరిద్దరిపైనా ఉన్నాయి.

అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రధాన పోటీదారులు అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా

14 వేల మంది అమెరికా సైనికులు

నాలుగు దశాబ్దాలుగా యుద్ధంతో అఫ్గానిస్తాన్‌లో ఎంతో విధ్వంసం జరుగుతోంది. ఏటా వేల మంది చనిపోతున్నారు.

వివిధ దేశాల సైనిక బలగాలు అఫ్గాన్ యుద్ధ క్షేత్రంలో పోరాడుతున్నాయి. అఫ్గానిస్తాన్ యుద్ధంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొంది. సంక్షోభం ముగిసిపోయేలా తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అమెరికా ప్రయత్నిస్తూ వస్తోంది.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనికులు సుమారు 14 వేల మంది ఉన్నారు. బ్రిటన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాల సైనికులూ వేలల్లో ఉన్నారు. అఫ్గాన్ భద్రతా బలగాలకు శిక్షణ, సలహాలు, సహాయం అందించడానికి నాటో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

అఫ్గానిస్థాన్‌లో హెరాత్‌లో పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్థాన్‌లో హెరాత్‌లో పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు

ఈ ఎన్నికల ప్రాధాన్యం ఏమిటి?

2001లో తాలిబన్లను అమెరికా నాయకత్వంలోని సైనిక బలగాలు గద్దె దించిన తర్వాత జరుగుతున్న నాలుగో ఎన్నిక ఇది. అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు కీలక దశలో ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అఫ్గాన్ గమనంలో ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుంది.

ఈ నెల్లో తాలిబన్లు, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి.

అఫ్గాన్ ప్రభుత్వానికి చట్టబద్ధత లేదంటూ, ఈ సర్కారుతో నేరుగా చర్చలు జరిపేందుకు తాలిబన్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడం లేదు. అమెరికాతో ఒప్పందం కుదిరాకే అఫ్గానిస్తాన్‌ అధికార యంత్రాంగంతో చర్చలు జరపుతామని స్పష్టం చేస్తోంది.

సైన్యం, తాలిబన్లు, ఇతర ఇన్‌సర్జెంట్ల మధ్య పోరుతో సతమతమవుతున్న సాధారణ ప్రజానీకానికి ఈ ఎన్నికల చాలా ముఖ్యం.

జలాలాబాద్‌లో ఓటు వేస్తున్న ఒక ఓటర్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జలాలాబాద్‌లో ఓటు వేస్తున్న ఒక ఓటర్

రెండు దశల్లో ఎన్నిక

రెండు దశలతో కూడిన ప్రత్యక్ష ఓటింగ్ విధానం ప్రకారం అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.

తొలి దశలో ఏ అభ్యర్థికీ 50 శాతానికన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే, మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు రెండో దశలో ఎన్నిక నిర్వహిస్తారు.

రెండో దశ ఎన్నిక అవసరమయ్యే పక్షంలో దానిని నవంబరులో జరుపుతారు.

అఫ్గానిస్తాన్ దాడులు, మృతులు

రోజుకు 74 మంది మృతి

బీబీసీ పరిశోధన ప్రకారం- అఫ్గానిస్తాన్‌ హింస వల్ల ఆగస్టులో రోజుకు సగటున మగవారు, ఆడవారు, చిన్నపిల్లలు అంతా కలిపి 74 మంది చనిపోయారు. వీరిలో అయిదో వంతు మంది పౌరులే.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం- 2019 ప్రథమార్ధంలో ఇన్‌సర్జెంట్ల చేతిలో కంటే అఫ్గాన్, అమెరికా బలగాల చేతిలోనే ఎక్కువ మంది పౌరులు చనిపోయారు.

శాంతి, శాంతి స్థాపన అంశంలో ఎవరి సామర్థ్యం ఎంతనేది అత్యధిక ఓటర్లకు అధిక ప్రాధాన్యమున్న అంశం.

కాబూల్‌లో భద్రతా ఏర్పాట్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాబూల్‌లో భద్రతా ఏర్పాట్లు

గత ఎన్నికలపై ఆరోపణలు

అయిదేళ్ల క్రితం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో మోసం, రిగ్గింగ్ జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.

ప్రభుత్వం ఏర్పడటానికి కొన్ని నెలలు పట్టింది. ఇద్దరు ప్రధాన పోటీదారులతో అమెరికా చర్చలు జరిపి, ఉభయుల మధ్య ఒప్పందాన్ని కుదిర్చింది.

అందుకు అనుగుణంగా 'నేషనల్ యూనిటీ గవర్నమెంట్' ఏర్పడింది.

అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా మధ్య అధికార పంపిణీపై ఒప్పందం కుదిరింది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్తాన్‌లో 55 శాతం జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. నిరుద్యోగిత 25 శాతంగా ఉంది.

ఎన్నికల నిర్వహణ విజయవంతమైందని, ఈసారి తాలిబన్ల భారీ దాడులేవీ లేవని అఫ్గానిస్తాన్ అధికారులు ప్రకటించారని అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని బీబీసీ ప్రతినిధి మార్టిన్ పేషన్స్ ప్రస్తావించారు.

దేశంలో భద్రత ఎంతగా దిగజారిందో ఇది సూచిస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)