ఆంధ్రప్రదేశ్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలి' - ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ Newsreel

జగన్

ఫొటో సోర్స్, Facebook/Andhra Pradesh CM

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణపై పునారాలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్‌ను మెరుగ్గా మార్చడానికి మార్గాలు అన్వేషించాలని కోరిన జగన్, దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ ఫ్యాక్టరీ రాష్ట్రానికి వచ్చిందని గుర్తు చేశారు.

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పదేళ్లకు పైగా సాగిన ఆనాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2002-2015 మధ్య కాలంలో మంచి పనితీరు కనబరిచిందని, ప్లాంట్ పరిధిలో 19,700 కరాల విలువైన భూములున్నాయని, వాటి విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు.

పెట్టుబడుల ఉపసంహరణకు బదులు స్టీల్ ప్లాంట్‌కు అండగా నిలబడడం ద్వారా మళ్లీ ప్రగతి బాటలోకి తీసుకువెళ్లవచ్చని సూచించారు. నిజానికి, ఈ ప్లాంట్ 2020లో రూ. 200 కోట్ల లాభాన్ని ఆర్జించిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

"విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి ఖనిజాన్ని బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజానికి రూ. 5,260 చొప్పున చెల్లిస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ. 3,472లు చొప్పున భారం పడుతోంది. అదే, సెయిల్ విషయానికి వస్తే, ఆ సంస్థకు సొంతంగా గనులు ఉన్నాయి. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడంద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లవచ్చు" అని జగన్ తన లేఖలో వివరించారు.

శరద్ పవార్, సచిన్ టెండూల్కర్

ఫొటో సోర్స్, PAWARSPEAKS/REUTERS

'ఇతర విషయాలపై జాగ్రత్తగా మాట్లాడాలి' - సచిన్‌కు శరద్ పవార్ సూచన

రైతుల ఆందోళన గురించి ఇటీవల ట్వీట్ చేసిన సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్ లపై ఎన్సీపీ నేత శరద్ పవార్ పరోక్షంగా విమర్శలు చేశారు.

తమ వృత్తితో సంబంధంలేని విషయాలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని ఆయన సూచించారు.

''రైతు ఉద్యమం విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. రైతు నాయకులు కూడా ప్రభుత్వంతో మాట్లాడాలి'' అని శరద్ పవార్ అన్నారు."స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో రైతుల ఉద్యమం జరగలేదు. అన్నం పెట్టేవాడు రోడ్డు మీద కూర్చుంటే ప్రభుత్వం స్పందించాలి" అని అన్నారాయన.

భారత్‌లో కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్' - ICMR సెరో సర్వే

భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్ర‌జలు కోవిడ్ -19 బారిన ప‌డ్డార‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది.

28,589 మందిపై నిర్వ‌హించిన సెరో స‌ర్వేలో 21.4% మంది కోవిడ్ వైర‌స్‌కు గురైన‌ట్లు తేలింది. 18 సంవ‌త్సరాల‌కు పైబ‌డిన వారిపై ఈ స‌ర్వే నిర్వహించిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇంకా అనేక‌ మంది కోవిడ్ బారినప‌డే ప్ర‌మాద‌ముంద‌ని కూడా ఐసీఎంఆర్ హెచ్చ‌రించింది.

భార‌త‌దేశంలో వ్యాక్సినేష‌న్ మొద‌లు కావ‌డానికి రెండువారాల ముందు అంటే డిసెంబ‌ర్ 17 నుంచి జ‌న‌వ‌రి 8 మ‌ధ్య‌ కాలంలో ఈ స‌ర్వే జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో జ‌రిగిన సెరో సర్వేలలో ఇది మూడోది.

తొలి దశ‌ టీకాక‌ర‌ణ‌లో భాగంగా భారత్‌లో ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు సుమారు 4.5 మిలియ‌న్ డోసుల వ్యాక్సినేష‌న్ ఇచ్చారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కోటికి పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులు న‌మోదైన దేశాల‌లో భార‌త్ రెండో స్థానంలో ఉండ‌గా, అమెరికా మొద‌టి స్థానంలో కొన‌సాగుతోంది.

కొన్నివారాలుగా భారత్‌లో కేసుల సంఖ్య క్ర‌మంగా ప‌డిపోతున్న‌ద‌ని అధికారిక గ‌ణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌లో కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరిలో యాంటీబాడీస్ ఎక్కువ ?

10 నుంచి 17 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్కులైన వారిలో కోవిడ్ వైర‌స్ ప్ర‌తిరోధ‌కాలు (యాంటీ బాడీస్‌) 25.3% వ‌ర‌కు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

ఆరోగ్య సిబ్బందిలో సెరో-ప్రాబ‌ల్యం 25.7% ఉన్న‌ట్లు తేలింద‌ని, అయితే డాక్ట‌ర్లు, న‌ర్సులలో ఇది 26.6% ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మిగ‌తా సిబ్బందిలో కేవ‌లం 24.9% మాత్ర‌మే సెరో ప్రాబ‌ల్యం ఉన్న‌ట్లు వెల్లడించారు.

ఒక స‌మూహంలో కోవిడ్‌-19ను ఎదుర్కోగ‌ల యాంటీబాడీల అస్తిత్వాన్నే సెరో ప్రాబల్యం అంటారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోని మురికివాడ‌ల్లో 31.7%, మిగ‌తా ప్రాంతాల‌లో 26.2% సెరో ప్రాబ‌ల్యం ఉన్న‌ట్లు తేలింది. అయితే కోవిడ్ ప్ర‌భావం ఉన్న గ్రామీణ ప్రాంతాల‌క‌న్నా ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోనే సెరో ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వెల్లడైంది.

హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందా ?

దేశ‌రాజ‌ధాని దిల్లీ ప్రాంతంలో అయిదుసార్లు జ‌రిగిన సెరో సర్వేలో 56.13% మందిలో కోవిడ్ -19కు యాంటీబాడీస్ త‌యారైన‌ట్లు బైటపడింది. రాజ‌ధాని న‌గ‌రం హెర్డ్ ఇమ్యూనిటీ దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని దిల్లీ ఆరోగ్య‌శాఖ‌మంత్రి వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై వైద్యరంగ నిపుణులు స్పందించ లేదు.

యాంటీబాడీలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి కోవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

‘‘రిపోర్టుల‌తో సంబంధం లేకుండా అంద‌రూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది’’ అని నేషన‌ల్ టాస్క్ ఫోర్స్ స‌భ్యుడైన డాక్ట‌ర్ వినోద్ పాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.

హెర్డ్ ఇమ్యూనిటీ పొంద‌డానికి భార‌త‌దేశం ఇంకా చాలా దూరం ప‌య‌నించాల్సి ఉంద‌ని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)