ప్రమాదకరమైన సూపర్ బగ్స్ పనిపట్టే ‘బ్లాక్ బస్టర్’ ఔషధాలు వచ్చేస్తున్నాయి..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చాలా వ్యాధుల చికిత్సలో యాంటీ బయాటిక్స్ కీలకం. అయితే, వీటి ప్రభావం క్రమంగా తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.
చాలా రకాల బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతూ, ఔషధాల శక్తిని తగ్గిస్తున్నాయి. అంటే, ఆ ఔషధాలను తట్టుకునే శక్తిని బ్యాక్టీరియాలు పెంచుకుంటున్నాయి.
యాంటీబయాటిక్‌లకు లొంగని ‘సూపర్ బగ్స్’ వల్ల 2021లో ప్రపంచవ్యాప్తంగా 11.40 లక్షల మంది మరణించారని ది లాన్సెట్ తెలిపింది. తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడంలో తొలిదశ రక్షణ శ్రేణిగా భావించే యాంటీబయాటిక్స్ ఇప్పుడు అనేక కేసుల్లో పని చేయడం లేదు.
యాంటీబయాటిక్ ఔషధాలకు లొంగని బ్యాక్టీరియాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారత్ కూడా ఉంది. 2019లో ఇలాంటి బ్యాక్టీరియాల వల్ల 3 లక్షల మంది చనిపోయారు. ఇలాంటి బ్యాక్టీరియాల కారణంగా దేశంలో ఏటా 60వేల మంది పిల్లలు చనిపోతున్నారు.
అయితే, ఇప్పుడు ఊరట కలిగించే విషయం ఏంటంటే...యాంటీ బయాటిక్స్‌కు లొంగని వ్యాధికారకాలను ఎదుర్కోవడానికి స్థానికంగా అభివృద్ధి చేసిన కొన్ని కొత్త ఔషధాలు ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. కొన్ని వ్యాధులకు చివరి దశ చికిత్సలో రోగిని కాపాడేందుకు అవి ఉపయోగపడుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
చైన్నెకి చెందిన సంస్థ ఆర్చిడ్ ఫార్మా తయారు చేసిన ఎన్మెటజొబాక్టమ్, భారత దేశంలో తొలి యాంటీమైక్రోబయల్ ఔషధం. దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది. దీన్ని ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యూటీఐ), న్యూమోనియా, రక్త నాళాల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ ఇంజక్షన్ బ్యాక్టీరియాపై కాకుండా బ్యాక్టీరియాలోని రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పని చేస్తుంది.
బ్యాక్టీరియా తరచుగా బీటా లాక్టమేస్ అనే ఎంజైమ్‌లను విడుదలను చేస్తుంది. ఇవి యాంటీబయాటిక్స్‌ను నాశనం చేస్తాయి. ఎన్మెటజొబాక్టమ్ ఆ ఎంజైమ్‌లను కట్టిపడేస్తుంది. వాటిని ధ్వంసం చేసి బ్యాక్టీరియాను చంపేలా చూస్తుంది.
సులభంగా చెప్పాలంటే. ఈ ఔషధం బ్యాక్టీరియా దగ్గరున్న ఆయుధాలు మరోసారి తేలిగ్గా చెలరేగకుండా అదుపు చేస్తుంది.
19 దేశాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత, ఈ ఔషధాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి. వెయ్యి మందికి పైగా రోగులపై ఇది ప్రభావవంతంగా పని చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
"ఈ ఔషధం కొన్నేళ్లుగా ఉన్న బ్యాక్టీరియాపై అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ ఇంజక్షన్‌ను ఆసుపత్రులలో తీవ్రంగా జబ్బుల బారిన పడిన రోగులకు నరాల ద్వారా ఇచ్చారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందు ప్రస్తుతం అందుబాటులో లేదు’’ అని ది లీడ్ కో ఇన్వెంటర్ ఆఫ్ ది డ్రగ్ సంస్థకు చెందిన డాక్టర్ మనీష్ పాల్ బీబీసీకి చెప్పారు.
ముంబయికి చెందిన వోకార్డ్ కొత్త యాంటీబయాటిక్‌ను పరీక్షిస్తోంది. దీన్ని జేనిచ్ అని అంటున్నారు. పిలుస్తున్నారు. ఇది కూడా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల మీద పని చేస్తుంది. 25 ఏళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధం, ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. వచ్చే ఏడాది ఇది మార్కెట్‌లోకి వస్తుంది.
"అన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌ల మీద పని చేసేందుకు రూపొందించిన యాంటీబయాటిక్స్‌లో ఇదొక విప్లవాత్మక ఆవిష్కరణ" అని జేనిచ్ గురించి వోకార్డ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ హబీబ్ ఖొరకివాలా చెప్పారు.
ఇతర యాంటీబయాటిక్స్‌కు కోలుకోని 30 మంది తీవ్రంగా జబ్బు బారిన పడిన రోగుల మీద జేనిచ్‌ను ప్రయోగించారు. వీరంతా అద్భుతంగా కోలుకున్నారు.
"ఇది భారతదేశానికి గర్వకారణం" అని ఖోరకివాలా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వోకార్డ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రోమైసిన్ మూడో దశ పరీక్షల్లో ఉంది. ఇది మిఖ్నాఫ్ ట్రేడ్‌మార్క్‌తో వస్తోంది. సీజనల్‌గా వచ్చే న్యూమోనియాకు చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని మూడు రోజులు నోటి ద్వారా తీసుకున్నప్పుడు న్యూమోనియాను తగ్గించడంలో 97 శాతం విజయవంతమైందని ఆ సంస్థ చెప్పింది.
న్యూమోనియా చికిత్సల్లో భాగంగా ఉపయోగిస్తున్న యాంటీబయాటిక్స్‌కు 60 శాతం బ్యాక్టీరియాలు లొంగడం లేదు. నఫిత్రోమైసిన్ ట్రయల్స్ వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి పొందితే వచ్చే ఏడాదే ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని సంస్థ తెలిపింది.
బెంగళూరు కేంద్రంగా 30 మంది సభ్యులతో పని చేస్తున్న బయో ఫార్మా సంస్థ బగ్‌వర్క్స్ రీసర్చ్, జెనీవాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ గ్లోబల్ యాంటీబయాటిక్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జట్టు కట్టాయి. ఈ రెండూ కలిసి తీవ్రమైన డ్రగ్ రెసిస్టెంట్ వ్యాధులను నయం చేసేందుకు అవసరమైన కొత్త తరహా యాంటీబయాటిక్స్‌ను డెవలప్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఇవి తొలి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ ఔషధాలు మార్కెట్‌లోకి వచ్చేందుకు ఐదు నుంచి ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉంది.
"యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గిపోతోంది. అయితే క్యాన్సర్, డయాబెటిస్, ఇతర వ్యాధులకు సంబంధించిన మందులతో ఎక్కువ ఆదాయం వస్తుంది. యాంటీబయాటిక్స్ వల్ల రాదు" అని బగ్‌వర్క్స్ సీఈఓ ఆనంద్ ఆనంద్ కుమార్ బీబీసీతో చెప్పారు.
"యాంటీబయాటిక్స్‌ను అఖరి ప్రత్యామ్నాయంగా భావించడం వల్ల వాటిని కనుక్కోవడంపై చాలా తక్కువగా దృష్టిపెడుతున్నారు. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ మీద పెద్ద ఫార్మా సంస్థలు దృష్టి పెట్టడంలేదు. మాకు వివిధ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయి. అందులో భారత్ నుంచి వస్తున్న నిధులు 10 శాతం కంటే తక్కువ" అని ఆయన చెప్పారు.
అయితే, ఈ పరిస్థితి మారాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 21 ప్రత్యేక స్పెషలైజ్డ్ కేర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన లక్షకు పైగా బ్యాక్టీరియల్ కల్చర్స్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ విశ్లేషించినప్పుడు, బ్యాక్టీరియాల్లో యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కొనే శక్తి పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని 2023లో విడుదలైన డ్రగ్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నివేదిక తెలిపింది.
సాధారణంగా కలుషిత ఆహారం తిన్న తర్వాత మనుషులు, జంతువుల పేగుల్లో కనిపించే వ్యాధికారక బ్యాక్టీరియా ఈ. కొలీ. దీని వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి.
దీని కారణంగా క్లెబ్‌సైల్లా న్యూమోనియా వస్తుంది. ఇది న్యూమోనియాతో పాటు రక్తాన్ని కూడా కలుషితం చేస్తుంది. శరీరం మీద గాట్లు, మెదడు లైనింగ్‌ను దెబ్బ తీసి మెంజైటిస్‌కు దారి తీస్తుంది.
ఐసీయూల్లో వెంటిలేటర్ మీద ఆధారపడిన రోగుల ఊపిరితిత్తుల మీద దాడి చేసే అసినెటో బాక్టర్ బౌమన్ని అనే వ్యాధికారక బ్యాక్టీరియా అనేక ఔషధాలను తట్టుకునే దశకు చేరుకుంది.
ఈ. కొలీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న యాంటీబయాటిక్స్ ప్రభావం వేగంగా తగ్గుతోందని సర్వే నివేదికలో తేలింది. న్యూమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియాలో డ్రగ్ రెసిస్టెన్స్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఈ వ్యాధికారక క్రిముల వల్ల వచ్చే జబ్బులకు చికిత్స చెయ్యడంలో ప్రధాన యాంటీబయాటిక్స్ 15 శాతం కంటే తక్కువగా ప్రభావవంతంగా పని చేస్తున్నాయని వైద్యులు గుర్తించారు.
చివరి అవకాశంగా ఉపయోగించే కార్బాపెనెమ్స్‌ను కూడా తట్టుకునేలా వ్యాధికారక క్రిములు ఎదగడంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇది బ్యాక్టీరియాతో వాక్ ఏ మోల్ ఆడటం లాంటిది. అవి చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. మనం వాటిని ఇంకా వేగంగా వెళ్లి పట్టుకునే ఆట ఆడుతున్నాం. ఒక దాన్ని వదిలించుకుంటే మరొకటి పుట్టుకొస్తుంది. మనం గత తప్పుల నుంచి నేర్చోకోవాలి. మరిన్ని ఆవిష్కరణలు జరగాలి" అని జీఏఆర్డీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మణికా బాలశేఖరం బీబీసీతో చెప్పారు.
జీఏఆర్డీపీ భారత్‌పై దృష్టి సారించడం ఆశ్చర్యపరిచే అంశమేమీ కాదు. జోలిఫ్లోడాసిన్ అనే ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఔరిజీన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్‌తో జీఏఆర్డీపీ జట్టు కట్టింది. ఈ ఔషదాన్ని లైంగిక చర్యలతో వ్యాపించే గనేరియా నియంత్రణకు వాడతారు. గనేరియా వ్యాధి కారక బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కొనే శక్తిని సంతరించుకున్నట్లు కనిపిస్తోంది.
సెఫిడెరెకోల్ అనే ఔషధాన్ని పంపిణీ చేసేందుకు జపాన్‌కు చెందిన ఫార్మా సంస్థ షియోనోగితోనూ జీఏఆర్డీపీ జట్టు కట్టింది. యూటీఐ, ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లు సోకడం ద్వారా వచ్చే న్యూమోనియా వంటి వ్యాధుల నివారణకు 135 దేశాల్లో సెఫిడెరెకోల్ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతులు ఇచ్చింది. ఈ ఔషధాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయాలని జీఏఆర్డీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అయితే ఇదంతా కథలో కేవలం ఒక భాగం మాత్రమే. భారతదేశంలో ప్రిస్క్రిప్షన్ విధానంలో సత్వర సంస్కరణలు అవసరం అని వైద్యులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్‌ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల అవి అనేక బ్యాక్టీరియాలను చంపేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాలను కూడా అంతం చేస్తాయి. ఇది అనేక దుష్ప్రభావాలకు కారణమవుతోంది. యాంటీబయాటిక్స్ నిరోధకతను పెంచుకుంటాయి. కొత్త రకం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకు కూడా కారణమవుతాయి.
దీనికి బదులుగా, ప్రత్యేకించి ఒక గ్రూప్ బ్యాక్టీరియాను అరికట్టే యాంటీబయాటిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆసుపత్రులు యాంటీ బయోగ్రామ్స్ మైక్రో బయాలజీ ఆధారిత యాంటీబయాటిక్స్ నియమావళి ఆసుపత్రుల్లో ఉండటం లేదు. దీంతో డాక్టర్లు గుడ్డిగా, విస్తృతంగా యాంటీబయాటిక్స్‌ను సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
"మనకు కొత్త డ్రగ్స్ అందుబాటులోకి వస్తాయనేది కచ్చితంగా ఉత్సాహం కలిగించే అంశం. అయితే మనం గతంలో బ్లాక్ బస్టర్ డ్రగ్స్‌ను దుర్వినియోగం చేసినట్లుగా కాకుండా కొత్త వాటి వినియోగంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహించడం ముఖ్యం." అని ఐసీఎంఆర్‌లో శాస్త్రవేత్త డాక్టర్ కామిని వాలియా హెచ్చరించారు.
బ్యాక్టీరియాల్లో కొత్త మ్యుటేషన్లు కొన్ని గంటల్లో జరుగుతోంది. ఇది యాంటీబయాటిక్స్ వాడకంలో సమగ్ర విధానం అవసరం గురించి చెబుతోంది. ఇందులో శుభ్రంగా ఉండే నీరు తాగడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, వ్యాక్సీన్లు వేసుకోవడం, ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణ విధానాలు, వైద్యులకు అవగాహన కల్పించడం, రోగులు సొంతంగా వైద్యం చేసుకునే విధానాలకు స్వస్తి చెప్పడం లాంటివి ఉన్నాయి.
"యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను ఎదుర్కోవడం ఆరోగ్య సంరక్షణ, వ్యవస్థాపరమైన బాధ్యత వంటి బహుముఖ సవాళ్లతో కూడిన సంక్లిష్టమైన వ్యవహారం" అని డాక్టర్ వాలియా చెప్పారు.
సందేశం స్పష్టంగా ఉంది. సత్వర చర్య తీసుకోకపోతే, మన భవిష్యత్ ప్రమాదంలో పడినట్లే. లేకపోతే చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














