ఆంధ్రప్రదేశ్: అమరావతి భూముల కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
అమరావతి భూముల కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని సాక్షి తెలిపింది.
‘‘హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం సోమవారం సుదీర్ఘంగా విచారించింది. చివరకు పిటిషన్‌లో యోగ్యతలు లేవని కొట్టివేసింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ.. అధికారిక రహస్యాల ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్ 418ను హైకోర్టు విస్మరించిందని తెలిపారు.
కొనుగోలుదారులకు భూములు ఎందుకు కొంటున్నారో తెలుసని అమ్మకందారులకు మాత్రం తెలియదని ఆరోపించారు.
హైకోర్టు అనేక అంశాలు విస్మరించిందని, నోటీసులు జారీ చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారు. హైకోర్టు ప్రాథమిక దశలోనే దీనిని కొట్టేసిందని వివరించారు.
ప్రైవేటు వ్యక్తుల భూముల కొనుగోళ్లు, అమ్మకాలలో క్రిమినల్ చట్టాలు ఎలా వర్తింపజేస్తారని హైకోర్టు ప్రశ్నించిందని, విచారణ చేసినప్పుడే కదా అవన్నీ బయటపడేదని దవే వాదించారు. ఇవన్నీ విస్మరించిన హైకోర్టు ప్రాథమిక దశలోనే కేసును కొట్టేసిందని పేర్కొన్నారు.
రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందన్న విషయాన్ని కప్పిపుచ్చి భూములు కొనుగోలు చేశారని ఫిర్యాదుదారుడు ఎస్.సురేష్ తరఫు సీనియర్ న్యాయవాది పారస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరు పక్షాల వాదనల అనంతరం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.

ఫొటో సోర్స్, trspartyonline
తెలంగాణ: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచిన ప్రభుత్వం
తెలంగాణలో జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎ్‌స) వేతనాలను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘ప్రస్తుతం నెలకు రూ. 15 వేల గౌరవ వేతనం పొందుతుండగా ఇకనుంచి వారి వేతనం రూ. 28,719 లకు పెంచుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
పెంచిన వేతనం జూన్ 1, 2021 నుంచే అమలులోకి రానుంది. కాగా, వీరి ప్రొబేషనరీ పీరియడ్‌ను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు.
కొత్త పంచాయతీల ఏర్పాటుతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య 12,769కి చేరింది. ఇందుకు అనుగుణంగా 9,355 మంది జేపీఎ్‌సలను దాదాపు రెండేళ్ల క్రితం తాత్కాలిక ప్రాతిపాదికన ప్రభుత్వం నియమించింది.
నెలకు రూ. 15 వేల వేతనంతో మూడేళ్లు పని చేయాలని పేర్కొంది. ఆపై పనితీరు ఆధారంగా సర్వీసును క్రమబద్ధీకరిస్తామని తెలిపింది’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Facebook/K Haribabu
మిజోరం గవర్నర్‌గా బాధ్యలు చేపట్టిన హరిబాబు
మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు సోమవారం బాధ్యతలు చేపట్టారని వెలుగు ఓ కథనం ప్రచురించింది.
‘‘రాజధాని ఐజ్వాల్‌లోని రాజ్ భవన్ దర్భార్ హాల్‌లో హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ మైకేల్ జోతన్ ఖుమా గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
కరోనా నిబంధనల కారణంగా కేవలం కొద్దిమంది ముఖ్య అతిథులను మాత్రమే కార్యక్రమానికి అనుమతిచ్చారు.
మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్థంగ, డిప్యూటీ సీఎం థాన్ లుయ, స్పీకర్ లాల్ రిన్ లియానా సైలో, మంత్రివర్గ సభ్యులతోపాటు చీఫ్ సెక్రెటరీ, డీజీపీలతో పాటు మరికొందరు ముఖ్యులను మాత్రమే రాజ్ భవన్‌కు అనుమతిచ్చారు’’అని వెలుగు తెలిపింది.

ఫొటో సోర్స్, RAGHU RAMA KRISHNA RAJU/FACEBOOK
చిరంజీవి, పవన్ కన్నా నాకే ప్రజాదరణ ఎక్కువేమో: రఘురామ కృష్ణరాజు
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రపన్ని ఓ మీడియా సంస్థ నుంచి తాను మిలియన్ యూరోలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ఇప్పటివరకు మీడియాలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లకు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు విన్నాం. కానీ వారి కంటే నాకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు, అందుకే నాకు ఇంత మొత్తం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో నాపై అఫిడవిట్ వేసింది. అందులో నాకు ఒక మిలియన్ యూరోలు అందినట్లు పేర్కొంది. వారి డబ్బులు యూరోల్లో బదిలీ అయ్యాయేమో నాకు తెలియదు.
సాధారణంగా మీడియాలో చాలా మంది అడిగే వార్తలు వేయించుకుంటుంటారు. కానీ నాకే ఎదురుడబ్బు ఇచ్చి నా ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.
ఇక్కడితో ఆగకుండా, నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు కొత్త వదంతి సృష్టించారు. నా రాజీనామా అన్న ప్రసక్తే లేదు. నా సభ్యత్వం రద్దు అన్నది కల్ల.
నేను షెడ్యూల్ 10లోని నిబంధనలను ఉల్లంఘించలేదు. వాళ్లు మోపిన అభియోగాలన్నీ అర్థంపర్థం లేనివే. లోక్‌సభ స్పీకర్‌కు దీనిపై వివరణ ఇస్తాను’’అని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








