భారత్ టాక్సీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ క్యాబ్ బుకింగ్ యాప్ ఏమిటి? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? రేట్లు తక్కువ ఉంటాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జస్పాల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి సాధారణ ధరలకంటే ఎక్కువ కనిపించడం మీకు అనుభవమయ్యే ఉంటుంది.
మరోవైపు డ్రైవర్లు, క్యాబ్ యజమానుల గురించి మాట్లాడుకుంటే, బుకింగ్ యాప్‌లు తమ అదనపు కమీషన్‌ను తగిస్తున్నాయని, బకాయిలు చెల్లించడంలేదనే ఫిర్యాదులు వింటుంటాం.
డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో రేట్లు పెంచితే, వాటి ప్రయోజనం కారు డ్రైవర్లకుగానీ, వాటి యజమానులకుగానీ అందడంలేదనే ఫిర్యాదు చేస్తుంటారు.


ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ‘భారత్ టాక్సీ’?
ఇప్పుడు 'భారత్ టాక్సీ' పేరుతో కొత్త క్యాబ్ బుకింగ్‌యాప్ ఒకటి మార్కెట్‌లోకి రానుంది. రెండు సమస్యలకు పరిష్కారం చూపుతామని ఈ యాప్ ప్రకటించుకుంది. ఈ యాప్‌ను భారత ప్రభుత్వం 'సహకార్ టాక్సీ' పేరుతో సహకార రంగంలో ప్రారంభించింది.
ఈ విషయంపై కేంద్ర హోం శాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా బుధవారం పంచ్‌కులాలో మాట్లాడుతూ "మార్కెట్‌లో టాక్సీ సేవలను అందించే అనేక కంపెనీలు ఉన్నాయి, కానీ లాభాలు డ్రైవర్లకుకాకుండా, యజమానులకే వెళ్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ చొరవతో, ఇకపై అన్ని లాభాలు డ్రైవర్లకు చేరతాయి. దీనితో పాటు, డ్రైవర్లకు బీమా వంటి సౌకర్యాలు కూడా అందుతాయి"అన్నారు.
డిసెంబర్ 2న కూడా లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా భారత్ టాక్సీ యాప్ గురించి సమాచారం ఇచ్చారు.
"ప్రభుత్వం సహకార సంఘం ఆధ్వర్యంలో మొబిలిటీ యాప్‌ను ప్రారంభిస్తోంది. ఈయాప్ దేశంలోని వాణిజ్య వాహన డ్రైవర్లు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ యాప్‌ను బహుళ-రాష్ట్ర సహకార సంఘం అయిన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ యాప్‌కు భారత్ టాక్సీ అని పేరు పెట్టనున్నారు" అన్నారు.
నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను నిర్వహిస్తారు. దీంతోపాటు దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఏడు సహకార సంస్థలు మద్దతు ఇస్తున్నాయి, వీటిలో అమూల్, నాబార్డ్, ఇఫ్కో వంటి ప్రధాన సహకార సంస్థలు కూడా ఉన్నాయి.
డిసెంబర్ 25 వరకు, ఒక లక్షా 20 వేల మంది డ్రైవర్లు ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు.
ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
ఈ క్యాబ్ సర్వీస్ యాప్‌ను దిల్లీలో నూతన సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు.
దీని తరువాత ఉత్తరప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్రలలో ప్రారంభిస్తారు.
భవిష్యత్తులో ఈ యాప్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
ఈ యాప్ ద్వారా క్యాబ్‌లు మాత్రమే కాకుండా ఆటోలు, బైక్‌లు కూడా బుక్ చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, sahkar-taxi.in
యాప్ ముఖ్యాంశాలు
సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లోని సమాచారం మేరకు...
- ఈ యాప్‌లో నమోదు చేసుకున్న డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయరు.
- ప్రతి ప్రయాణం నుంచి వచ్చే మొత్తం సంపాదన డ్రైవర్‌కే లభిస్తుంది.
- సహకార సంఘంమొత్తం లాభం డ్రైవర్లకు పంపిణీ చేస్తారు.
- ఈ యాప్‌లో ఛార్జీలు ఎప్పుడూ ఒకలానే ఉంటాయి. వీటిని పారదర్శక పద్ధతిలో నిర్ణయిస్తారు.
- వర్షం, రద్దీ లేదా ట్రాఫిక్ సమయంలో కూడా ఛార్జీ స్థిరంగా ఉంటుంది, అంటే అదనపు ఛార్జీలు విధించరు. ఇది తరచుగా మొబైల్ యాప్‌లలో జరుగుతుంటుంది.
- 24x7 కస్టమర్ సేవ అందుబాటులో ఉంటుంది.
- ప్రయాణికులు, డ్రైవర్లు ఇద్దరి సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను రూపొందించారు. రూపొందించబడింది.
టాక్సీలో ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఒక పెద్ద సమస్య. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు, ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయిన టాక్సీలలో జీపీఎస్ ఉంటుంది.
దిల్లీలో ప్రారంభించనున్న ఈ యాప్‌కు భద్రతా ఏర్పాట్ల కోసం సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ దిల్లీ పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుంది.
‘పారదర్శకత లోపించింది’
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ అధ్యక్షుడు ప్రశాంత్ భాగేష్ సావర్దేకర్ ఈ యాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రభుత్వం ఒక యాప్ తీసుకువస్తుంటే, అందులో డ్రైవర్‌కు ఎటువంటి కమీషన్ లేకుండా పూర్తి మొత్తం లభిస్తుంది, అప్పుడు అది మాకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఈ సహకార సంఘాన్ని ఎవరు నడుపుతున్నారో మనం చూడాలి" అంటున్నారు ఆయన.
"ఈ సంస్థ ప్రభుత్వానికి చెందినదా అని కూడా మేం ప్రభుత్వాన్ని అడిగాం, వారు కాదు, కమిటీని ఏర్పాటు చేస్తాం, మిగిలిన వాటిని డ్రైవర్లు నిర్వహిస్తారు అని చెప్పారు. కానీ మరోవైపు, ప్రభుత్వం ఈ సహకార సంఘంలో ఇతర సహకార సంస్థల నుంచి అధికారులను నియమించింది."
ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకత లోపించిందని ప్రశాంత్ భాగేష్ అంటున్నారు.
సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా జాయెన్ మెహతా ఉన్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దీంతో పాటు, ఆయన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ డైరెక్టర్ కూడా.
"ఓలా, ఉబర్ వంటి కంపెనీలు మొదట్లో మాకు అనేక సౌకర్యాలు కల్పించాయి, కానీ తర్వాత మార్పులు చేయడం ప్రారంభించాయి. మా నుంచి వసూలు చేసే కమీషన్‌ను కూడా వారు మార్చారు. ప్రారంభంలో, వారు మాకు కనీస ట్రేడింగ్ మొత్తాన్ని కూడా హామీ ఇచ్చారు, కానీ క్రమంగా ప్రతిదీ తగ్గడం ప్రారంభమైంది" అని ఆయన చెప్పారు.
ఇండియా టాక్సీ మోడల్ ఎంత విజయవంతమవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని ప్రశాంత్ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














