స్టాక్ మార్కెట్లు: నష్టాలు ఎందుకు? ఇప్పట్లో ఆగేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలు చవిచూశాయి.
బుధవారం సెన్సెక్స్ ముగింపు 34,760 పాయింట్లు. గురువారం ప్రారంభం 34,063 పాయింట్లు, ముగింపు 34001. అంటే ప్రారంభంలో దాదాపు 700 పాయింట్లు నష్ట పోయింది, ఆ తర్వాత ఓ దశలో దాదాపు 1000 పాయింట్ల నష్టాన్ని చవిచూసిన సూచీలు తర్వాత కొద్దిగా కోలుకున్నాయి. చివరకు 759 పాయింట్ల నష్టంతో గురువారం ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ కూడా క్రితం ముగింపు 10,460 పాయింట్లతో పోలిస్తే దాదాపు 225 పాయింట్లు కోల్పోయి 10234 వద్ద ముగిసింది.
ఇందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్న విధానాన్ని ట్రంప్ తప్పుబట్టారు. పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా పెంచుకుంటూ పోతోందని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో బుధవారం డోజోన్స్ 3.1 శాతం, నాస్‌డాక్ 4.1శాతం నష్టపోయాయి. గత రెండేళ్లలో ఇవి భారీ నష్టాలు. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా పడింది. గురువారం షాంఘై 5.22శాతం, నిక్కీ 3.89శాతం, హాంగ్‌సెంగ్ 3.54శాతం చొప్పున నష్టపోయాయి.
ఇక అమెరికాను కాదని రష్యాతో భారత్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంపై, త్వరలోనే తగిన విధంగా స్పందిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది ఆగస్టు 31న సెన్సెక్స్ 38,645 పాయింట్ల వద్ద ఉండేది. అక్టోబరు 11 అంటే నేడు అది దాదాపు 34,000 పాయింట్లకు పడిపోయింది.
ఇక 11, 674 వద్ద ఉన్న నిఫ్టీ కూడా నేడు దాదాపు 10, 200 పాయింట్లకు క్షీణించింది.
ఈ గణాంకాలు చూస్తే చాలు స్టాక్ మార్కెట్లు ఏ విధంగా నీరసించి పోతున్నాయో అర్థమవుతోంది.
కేవలం 41 రోజుల్లో దాదాపు 4,690 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. ఇదే కాలంలో నిఫ్టీ 1, 374 పాయింట్లు నష్ట పోయింది.
స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొత్త కాదు. కానీ గత కొద్ది రోజులుగా ఆడుతున్న ఈ నష్టకథా చిత్రం మదుపర్లను ఆందోళనలకు గురి చేస్తోంది.
2008 ఆర్థిక సంక్షోభంలో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన నష్టాలను చవి చూశాయి. ఆ ఏడాది జనవరిలో 21,000 పాయింట్ల వద్ద సెన్సెక్స్ అక్టోబర్ నాటికి 9,000 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ కూడా దాదాపు 6,000 పాయింట్ల నుంచి 2,500 పాయింట్లకు దిగజారింది. ఈ నష్టాలకు ప్రధాన కారణం నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం.

ఫొటో సోర్స్, Getty Images
మరి ఏడాది కిందట దాదాపు 24 శాతం దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నేల చూపులు ఎందుకు చూస్తున్నాయి?
1. రూపాయి
గత కొద్ది రోజులుగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం ఒక డాలరుకు దాదాపు 74 రూపాయల వద్ద కదలాడుతోంది. రూపాయి విలువ క్షీణిస్తూ పోతుంటే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. దిగుమతులకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
2. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు
కొద్ది రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) స్టాక్ మార్కెట్లలోని తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఒక్క సెప్టెంబరులోనే రూ.10,824 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అక్టోబరు నెలలోనూ గత ఏడు సెషన్లు పరిశీలిస్తే నికరంగా దాదాపు రూ.14,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. డాలరు బలపడుతుండటం, రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రూపాయి విలువ తగ్గుతూ ఉంటే విదేశీ మదుపర్ల పెట్టుబడులు కూడా అంతకంతకూ హరించుకు పోతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
3. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం
అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. అసలే మందగమనంలో ఉన్న చైనా ఎగుమతులపై అమెరికా పెద్ద ఎత్తున్న విధిస్తున్న సుంకాలు మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఆసియాలో అతి పెద్ద వినియోగదారుగా ఉన్న చైనాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు, భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలను కలవరపెడుతోంది. ఆ ఆందోళన స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.
4. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్
రహదారులు, నిర్మాణ రంగంలో పెద్ద సంస్థల్లో ఒకటైన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ దివాలా తీయడం మరిన్ని ఆందోళనలకు తెరతీసింది. దాదాపు రూ.90,000 కోట్ల రుణభారంతో ఉన్న ఆ సంస్థ స్వల్పకాలిక రుణాలు కూడా చెల్లించలేక చేతులు ఎత్తేసింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వేల కోట్ల రూపాయలను ఆ సంస్థ జారీ చేసిన బాండ్లలో మదుపు చేశాయి. మరెన్నో బ్యాంకులు దీనికి రుణాలు ఇచ్చి ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగల ఈ పరిణామంపై మదుపర్లు ఆందోళనలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'రాబోయే రోజుల్లో అనిశ్చితి': శరణ్యారెడ్డి, సీఎఫ్ఏ
స్టాక్ మార్కెట్లపై దేశీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. వాటిలో ఆర్థిక, రాజకీయ అంశాలు ముఖ్యమైనవి. ఆర్థికంగా చూస్తే చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు వంటివి ప్రధానం. ముడిచమురుకు సంబంధించి భారత్ ఎక్కువగా ఇరాన్‌పైనే ఆధారపడుతోంది. రూపాయి రోజురోజుకూ క్షీణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా పోతోంది. ఇక రాజకీయ అంశాల దృష్టికి వస్తే 2019 ఎన్నికలు కీలకం కానున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేక సుస్థిర ప్రభుత్వం వస్తుందా అన్నది దేశీ, విదేశీ మదుపర్లు గమనిస్తారు. కాబట్టి రాబోయే రోజులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. మదుపర్లు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని ప్రభావాలను బేరీజు వేసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








