#MeToo: హీరో అర్జున్ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా తడిమారు - హీరోయిన్ శ్రుతి హరిహరన్ : ప్రెస్‌రివ్యూ

శ్రుతి హరిహరన్

ఫొటో సోర్స్, sruthiharihariharanofficial/facebook

ప్రముఖ నటుడు అర్జున్‌ తనను లైంగికంగా వేధించారని కన్నడ నటి శ్రుతి హరిహరన్ ఆరోపించారు. కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం 'నిబుణన్‌' సెట్స్‌లో (కన్నడలో 'విస్మయ') ఈ వేధింపులు చోటు చేసుకున్నాయని ఆమె వెల్లడించారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

"నా లైఫ్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను. ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంకేతాలు నాకు కనిపించాయి. కొన్ని భయంకరమైన సంఘటల నుంచి తెలివిగా తప్పించుకోగలిగా. అయితే చిన్నప్పటి నుంచి అర్జున్‌ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. 2016లో అర్జున్‌తో వర్క్‌ చేసే ఛాన్స్‌ రాగానే ఎగ్జైట్‌ అయ్యాను.

కానీ 'విస్మయ' సినిమా సెట్‌లో ఓ రొమాంటిక్‌ సీన్‌ రిహార్సల్స్‌లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారు. 'మీటూ' ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్‌ఫుల్‌గా తయారవుతోంది. అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా చెబుతున్నాను'' అంటూ సోషల్‌ మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు శ్రుతి హరిహరన్‌.

అర్జున్, శ్రుతి హరిహరన్

ఫొటో సోర్స్, arun.vaidyanathan/facebook

'నాకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉంది’

"సినిమాలో ఏ సంఘటన గురించి అయితే ఇంత వివాదం జరుగుతుందో ఆ సీన్‌ను నేను స్క్రిప్టింగ్‌ టైమ్‌లో చాలా రొమాంటిక్‌గా రాశాను. అది చదువుతున్నప్పుడే 'నాకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉంది. ఇటువంటి సీన్స్‌లో నటించలేను' అని అర్జున్‌ సార్‌ చెప్పారు. ఆయన కోరికే మేరకే ఆ సీన్‌లో రొమాంటిక్‌ ఫ్లేవర్‌ను తగ్గించాను. ఇప్పుడు అర్జున్‌పై శ్రుతి హరిహరన్‌ చేసిన ఆరోపణలు విని షాక్‌ అయ్యాను. ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది. మినిట్‌ టు మినిట్‌ నాకు గుర్తులేదు. ఈ సినిమా షూట్‌ టైమ్‌లో సెట్‌లో మేం చాలా బాగా ఎంజాయ్‌ చేశాం. అర్జున్, శ్రుతి ఇద్దరూ నాకు మంచి స్నేహితులే" అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌.

"కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు మహిళలకు అన్ని చోట్లా సేఫ్‌ అండ్‌ సెక్యూర్డ్‌ సిచ్యువేషన్స్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది" అని 'మీటూ' గురించి ఆయన చెప్పారు.

శ్రుతి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు అర్జున్‌. "మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 150 సినిమాల్లో నటించా. దాదాపు 60 మంది హీరోయిన్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. వారందరితో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. అప్పట్లో ఆ సీన్‌ కాస్త రొమాంటిక్‌గా ఉందని నేను డైరెక్టర్‌తో కూడా చెప్పాను. ఇప్పుడు శ్రుతి ఎందుకు ఇలా నాపై ఆరోపణలు చేస్తోందో అర్థం కావడం లేదు" అని అర్జున్‌ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయని సాక్షి తెలిపింది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook

‘తిత్లీ తుపానుతో రూ. 3,435 కోట్ల నష్టం.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి’

తిత్లీ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం సాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తుపానుతో రూ.3,435.29కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణం రూ.1200కోట్ల సాయం అందించాలని కోరారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

తిత్లీ వల్ల దెబ్బతిన్న 2.25లక్షల కుటుంబాలకు సాయం అందించాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం శనివారం మరో లేఖ రాశారు. ఈనెల 13న ప్రధానికి, 15న హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశామని, అయినా నష్టం అంచనాకు కనీసం కేంద్ర బృందాలను కూడా పంపలేదని ఆయన ఆరోపించారు.

తుపాను కారణంగా 49,112 ఇళ్లు దెబ్బతిన్నాయని, 1.65 లక్షల హెక్టార్లలో వ్యవసాయం, 17,109 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. విద్యుత్‌శాఖకు రూ.505 కోట్లు, రోడ్లు, రహదారులు, భవనాల శాఖ పరిధిలో రూ.406 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.140 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.802 కోట్లు, ఉద్యానశాఖ పరిధిలో రూ.వెయ్యి కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.50 కోట్లు, మత్స్యశాఖ పరిధిలో రూ.50 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.100 కోట్లు, సాగునీటి శాఖలో రూ.100 కోట్లు, ఇళ్లు దెబ్బతినడం ద్వారా రూ.220 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.50 కోట్లు, వైద్య, ఆరోగ్యశాఖకు రూ.కోటి, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.9 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలను కూడా చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఓటరు గుర్తింపు కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో కొత్త ఓటర్లు 19.90 లక్షలు

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. 2014లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. ఆ సమయంలో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 2,53,27,785 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర ఓటర్లు 2,73,18,603. దీనిప్రకారం 19,90,818 మంది కొత్త ఓటర్లు తాజా ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ఓటర్లలో 9.38 లక్షల మంది పురుషులు (47.13 శాతం) ఉండగా, మహిళలు 10.52 లక్షల (52.87 శాతం) మంది ఉన్నారు.

2014లో పురుష ఓటర్ల సంఖ్య 1,28,49,470 ఉండగా.. ప్రస్తుతం 1,37,87,920కు పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య 1,24,75,576 నుంచి 1,35,28,020కి పెరిగింది. 2014 జాబితాతో పోల్చితే థర్డ్ జెండర్స్ సంఖ్య తగ్గింది. 2014లో 2,739 థర్డ్ జెండర్స్ ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 2,663కు తగ్గిపోయింది.

జిల్లాలవారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో 2014తో పోలిస్తే తాజాగా 2,62,684 మంది, సంగారెడ్డి జిల్లాలో 1,55,981 మంది ఓటర్లు పెరిగారు. హైదరాబాద్‌లో 1,53,887, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1,51,188, కరీంనగర్ జిల్లాలో 1,20,425 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.

2014 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కొత్తగూడెం భద్రాచలం జిల్లాలోని పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలను పాక్షికంగా ఏపీలో కలపడంతో జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2014లో ఈ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో 7,85,456 మంది ఓటర్లు ఉండగా, తాజాగా జాబితాలో ఓటర్ల సంఖ్య 8,47,528కి పెరిగింది.

అంబటి రాయుడు

ఫొటో సోర్స్, Getty Images

‘నాలుగో స్థానంలో అంబటి రాయుడు.. సమయం ఇవ్వాలి’

నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకుంటే టీమిండియా ఎదుర్కొంటున్న గందరగోళం తీరినట్లేనని శనివారం టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కొన్ని నెలల్లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ కీలక స్థానంపై కోహ్లీ స్పందించాడని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

'చాలా కాలంగా ఈ స్థానంలో సరైన వ్యక్తి కోసం చూస్తున్నాం. చాలా మంది ఆటగాళ్లను పరిశీలించాం. కానీ మేం కోరుకున్న విధంగా వారు రాణించలేకపోయారు. ఆసియా కప్‌లో రాయుడు మంచి ఆటతీరు కనబరిచాడు. ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో అతడు నాలుగో స్థానంలో కుదురుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి' అని విరాట్ అన్నాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రాయుడు 43.00 సగటుతో 602 పరుగులు చేశాడు. 149.75 స్ట్రైక్‌ రేట్‌ను సాధించాడు. దాంతో ఇంగ్లాండ్ పర్యటన కోసం పిలుపు వచ్చింది. కానీ యోయో టెస్ట్‌లో విఫలం కావడంతో టీమిండియాలో చోటు పొందలేకపోయాడు. కానీ యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో మాత్రం భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

'అతడి ఆటను గమనించాను. రాయుడు మిడిల్ ఆర్డర్‌‌లో ఆడటానికి సరిగ్గా సరిపోతాడు. కొంతమేర మా మిడిల్ ఆర్డర్‌ కుదురుకుందని భావిస్తున్నాం' అని రాయుడు ఆట తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్‌. భారత బృందం ప్రపంచ కప్‌కు ముందు 18 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో వెస్టిండీస్‌‌తో ఆడనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆదివారం ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)