రాహుల్ గాంధీ: అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానిస్తున్నారు

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Telangana congress/facebook

అంబేడ్కర్‌ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే సాగు నీటి ప్రాజెక్టుకు ఆయన పేరు తీసేశారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా భైంసా, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేర్లు మార్చడమే కాకుండా వాటిని రీ డిజైన్ చేసి అవినీతికి పాల్పడుతోందని అన్నారు.

అంచనాల మొత్తాన్ని పెంచి కేసీఆర్ తన సన్నిహితులకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

ఆదివాసీలకు అడవులపై హక్కును కల్పిస్తూ యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

రైతులకు మేలు చేసేందుకు భూసేకరణ చట్టాన్ని అమలు చేశామని తెలిపారు.

తాము తీసుకొచ్చిన చట్టం వల్లే మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం రైతులు అందుకోగలుగుతున్నారని చెప్పారు.

అయితే, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ మూడు సార్లు ప్రయత్నించారని, కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేశారని రాహుల్ విమర్శించారు.ః

కామారెడ్డి సభలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ఫొటో సోర్స్, Indian National Congress - Telangana i

'హామీలిచ్చారు... అమలు మరిచారు'

తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్ అన్నారు. పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు.

''కేసీఆర్ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు. కానీ, ఏ ఒక్కటీ చేయలేకపోయారు'' అని విమర్శించారు.

మీకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లభించాయా? ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు వచ్చాయా? ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు వస్తున్నాయా? ప్రతి బ్యాంకు ఖాతాలో మోదీ 15 లక్షలు వేశారా? అని సభకు వచ్చినవారినుద్దేశించి ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

కామారెడ్డి సభకు హాజరైన మహిళలు

ఫొటో సోర్స్, Indian National Congress - Telangana i

రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు: కేటీఆర్

అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చిందనడం శుద్ధ అబద్ధం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ,తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదువుతున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

అంబేడ్కర్‌ను టీఆర్ఎస్ ప్రభత్వం అవమానించిందని ఆరోపించడం దారుణమని, కాంగ్రెస్ పార్టీయే ఆయనకు భారతరత్న ప్రకటించకుండా అవమానించిందని అన్నారు. వీపీ సింగ్ ప్రభుత్వంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దలను గౌరవించే సంస్కారం లేదని అన్నారు. దిల్లీలో పీవీ సమాధి నిర్మాణానికి అనుమతించకుండా ఆయనను అవమానించిందని చెప్పారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మొదట రీ-డిజైన్ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. 2013లో వచ్చిన భూసేకరణ చట్టం వల్లే తమ ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని వెల్లడించారు.

ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదు: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

రాహుల్‌ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఉన్న అంబేడ్కర్ పేరు మార్చలేదని అన్నారు.

రైతులకు రూ.లక్ష రూపాయిల రుణ మాఫీ చేశామని, ఇప్పటి వరకు దీని వల్ల 98 శాతం రైతులు లబ్ధి పొందారని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని అమలు కూడా హామీలు చేసిందని చెప్పారు.

తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదని అన్నారు.

కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో లేరని, ప్రాజెక్టులు ఆపడానికి కోర్టుల చుట్టు తిరుగుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)