#HisChoice: ‘'వద్దు' అంటే వదిలేయాల్సిందే... నా కొడుకును అలాగే పెంచుతా

హిజ్ చాయిస్

‘నాన్నా ప్లీజ్... వద్దు’... నేను మా అబ్బాయిని ముట్టుకోగానే ఈ మూడు పదాలే ఈ మధ్య వాడి నోటి నుంచి వస్తున్నాయి.

ఆ మాటలు పని చేస్తున్నాయని వాడికి అర్థమైపోయింది. మా ఆవిడ మా ఇద్దరి మధ్యా ఓ డీల్ కుదిర్చింది. దాని ప్రకారం వాడు 'వద్దు' అంటే వదిలేయాల్సిందే.

ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లగానే వాడిని ఎత్తుకోవాలని అనిపిస్తుంది. అప్పుడప్పుడూ ఆట పట్టించాలని అనిపిస్తుంది. కానీ, మా ఒప్పందం ప్రకారం వాడికి ఇష్టం లేకపోతే నేను వాడిని ముట్టుకోలేను.

నేను ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టి 15-20 రోజులవుతోంది. ఈ చిన్న అలవాటు వాడిలో చాలా మార్పు తెచ్చింది.

ఇంట్లో వాడి మాటలు మేం వింటామని అర్థమైంది. తన ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆ నమ్మకం చాలా అవసరం.

అన్నిటికంటే ముఖ్యమైంది ఏంటంటే... 'వద్దు' అనే మాటకు ఉన్న శక్తిని వాడు ఇప్పట్నుంచే తెలుసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మందికి ఏళ్లు పడుతుంది.

రెండున్నరేళ్ల వయసులోనే వాడు 'నో' అనే పదానికి ఉన్న విలువ అర్థం చేసుకున్నాడంటే, భవిష్యత్తులో ఇతరుల మాటకు కూడా అంతే విలువ ఇస్తాడని నాకు నమ్మకం కలుగుతోంది.

చిన్నప్పుడు 'ఏంటి... అమ్మాయిలా ఏడుస్తున్నావు?' అని అమ్మానాన్న అనేవారు. అంటే, అబ్బాయిలు ఏడవకూడదన్నది వారి ఉద్దేశం. బహుశా వాళ్ల దృష్టిలో పిల్లల్ని పెంచే విధానం అదేనేమో. కానీ, నేను ఇప్పటివరకు దీని గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడలేదు.

కొన్ని రోజుల తరువాత మా అబ్బాయి బయటకు వెళ్లి ఇతర పిల్లలతో ఆడుకుంటాడు. సైకిల్ నడిపిస్తూ కిందపడతాడు. ఆటలో దెబ్బలు తగులుతాయి. కానీ, వాడి నొప్పిని నేను తగ్గించడానికే ప్రయత్నిస్తా తప్ప ఏడుపు ఆపమని అడగను. వాడి భావోద్వేగాలను అడ్డుకోను.

హిజ్ చాయిస్

అయినా నొప్పికి స్పందించడానికి ముందు 'నేను అమ్మాయినా, అబ్బాయినా?' అని ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నొప్పి అందరికీ ఉంటుంది. కానీ, దాన్ని తట్టుకునే శక్తి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. తమ భావాలను బయటపెట్టే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

అబ్బాయిలకు చాలా సందర్భాల్లో, 'అమ్మాయిలు ఏడుస్తారు, అబ్బాయిలు కాదు' అని చెబుతుంటారు. అంటే ఏడుపు బలహీనతకు ఓ సంకేతమని చెప్పే ప్రయత్నం చేస్తారు.

తెలియకుండానే ఆ మాటల ప్రభావం పిల్లల మనసులపైన పడుతుంది. అదే అభిప్రాయంతో వాళ్లు పెరుగుతారు. స్కూల్లో ఆడుకునేప్పుడు... ఆడ పిల్లలు బలహీనులు కాబట్టి వాళ్లు తమ జట్టులో ఉండకూడదని మగపిల్లలు అనుకుంటారు. వాళ్లుంటే ఆట గెలవలేమని భావిస్తారు.

కానీ, అబ్బాయిల్లో కూడా బలహీనులు ఉంటారు. అందుకే... అమ్మాయి చేతిలో ఓడిపోయావేంటీ అని నేను మా అబ్బాయిని ఎప్పుడూ అడగను. ఆటని ఆటలానే చూడాలి కానీ, ఆడ మగ అని వేరు చేసి చూడకూడదు. సామర్థ్యాన్ని బట్టే ఆటలో గెలుపోటములు ఉంటాయి.

ఈ అంతరం వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. నాకు బాగా గుర్తు... 8వ తరగతిలో పునరుత్పత్తికి సంబంధించిన పాఠం చెప్పినప్పుడు క్లాస్‌లో మగపిల్లలంతా ముసిముసి నవ్వులు నవ్వారు. అమ్మాయిలు కాస్త ఇబ్బంది పడ్డారు. దాంతో, ఎలాంటి ప్రశ్నలు స్వీకరించకుండానే టీచర్ పాఠాన్ని ముగించేసింది.

line

బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.

ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.

line

అదే టీచర్ కంటే ముందే పిల్లలు అడిగిన ప్రశ్నలకు తల్లిదండ్రులు సమాధానాలు ఇచ్చుంటే ఆ రోజు క్లాసులో అబ్బాయిలు, అమ్మాయిల్ని అలా చూసుండేవారు కాదు. స్కూల్ కారిడార్లలో కూడా అబ్బాయిలు అమ్మాయిల పైన కామెంట్స్ చేసేవాళ్లు కాదు.

ఈ రోజుల్లో మీటూ, రైట్ టు బ్లీడ్ లాంటి క్యాంపైన్లు చాలా బహిరంగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతో కూడా వాటి గురించి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలతో సున్నితంగా వ్యవహరించాలని వాళ్లకు తెలియాలి. వాళ్ల భావనలను అర్థం చేసుకోవాలి. అప్పుడే అబ్బాయిలు తమ తల్లులను, అక్కచెల్లెళ్లను సరిగా అర్థం చేసుకుంటారు. దాని వల్ల ఓ మంచి సమాజం రూపొందే అవకాశం ఉంది.

ఇప్పుడు కూడా ఆఫీసులో మగవాళ్లు, ఆడవాళ్ల గురించి చర్చిస్తుంటే... 8వ తరగతిలో ఆ పునరుత్పత్తి పాఠమే గుర్తొస్తుంది. ఆ క్లాసుకూ ఆఫీసుల్లో చర్చలకు సంబంధం ఉందనిపిస్తుంది. ఆ వయసులో పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పి ఉంటే, తరువాత మగవాళ్లకు ఆ విషయంపైన అంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. దాని వల్ల నిరుపయోగ చర్చల కోసం గడిపిన ఎంతో సమయం మిగిలుండేది కదా అనిపిస్తుంది.

హిజ్ చాయిస్

పిల్లలు తమంతట తామే చాలా విషయాలు నేర్చుకుంటారు. కానీ, నేను మా అబ్బాయికి సరైన సమయంలో సరైన విషయాలు నేర్పాలనుకుంటున్నాను. వాడి అన్ని ప్రశ్నలకూ దాచకుండా సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా స్నేహితుడి లాంటి వాడినేనని, నాతో అన్ని విషయాలు చర్చించే స్వేచ్ఛ వాడికి ఉందనే నమ్మకాన్ని కలిగించాలని అనుకుంటున్నాను.

అందరిలానే వాడిపైన స్నేహితుల ఒత్తిడి ఉంటుందని, కొన్ని విషయాలను స్వయంగా తెలుసుకోవాలని అనుకుంటాడని నాకు తెలుసు. అందుకే తండ్రీ కొడుకుల బంధం మధ్య ఉన్న ఆ సన్నని రేఖ తొలగకుండానే తప్పు ఒప్పుల గురించి వాడికి చెప్పడం నా బాధ్యత.

నేను మా నాన్నతో స్నేహంగానే ఉండేవాడిని. కానీ, అన్ని విషయాలూ ఆయనతో చెప్పేంత చొరవ ఉండేది కాదు. పిల్లలకు అలాంటి చొరవ ఉంటేనే కదా, వాళ్లకు ఏదైనా సమస్య ఉంటే చెప్పగలిగేది.

టీనేజీలో పిల్లలు తమ వాళ్లతో చాలా విషయాలు చెప్పుకోవాలనుకుంటారు. అది చాలా అవసరం కూడా. నేను అలాంటి స్వేచ్ఛను నా కొడుక్కి ఇస్తాను. మార్కులు ముఖ్యమే కానీ, అదే ప్రపంచం కాదని చెబుతాను.

'అందరూ ఏమనుకుంటారు?'... ఈ ప్రశ్న కలిగించే ఒత్తిడి నుంచి వాడిని దూరంగా ఉంచాలనుకుంటున్నా. అప్పుడే వాడు సొంతంగా ఆలోచించగలడు.

తప్పులు అందరు పిల్లలూ చేస్తారు. కానీ తప్పొప్పుల తేడాను వాడికి చెప్పడం నా బాధ్యత.

వాడు కూడా తప్పులు చేస్తాడు. వాటి నుంచే పాఠాలు నేర్చుకుంటాడు. కానీ, ఆ తప్పుల వల్ల ఇతరులకు ఎలాంటి నష్టం జరగకూడదనే నేను కోరుకుంటా.

ఈ సమస్యలన్నీ మనం ఎదుర్కొన్నాం. అందుకే వాటి నుంచి పిల్లలను తప్పించి, వారికి స్వేచ్ఛనివ్వాల్సిన సమయం ఇది.

(ఒక తండ్రితో మాట్లాడి, అతడి అంతరంగాన్ని అక్షరబద్ధం చేశాం. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ప్రొడ్యూసర్: సుశీలా సింగ్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)