అమృత్‌సర్ విషాదం: ‘రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం అబద్ధం'

అమృత్‌సర్‌లో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 58మంది చనిపోయారు. అయితే, ఆ ప్రమాదానికి కారణమైన రైలును నడిపిన డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.
ఓ వంతెన మీద వేలాడుతున్న మృతదేహానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ... ‘అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా అతడి వ్యక్తిత్వాన్ని పదేపదే కించపరచడమే దానికి కారణం. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి’ అని పేర్కొంటూ వేలాదిమంది దాన్ని షేర్ చేస్తున్నారు.
ఆ ఫొటోతో పాటు ఆ డ్రైవర్ పేరును అరవింద్ కుమార్‌గా పేర్కొంటూ, అతడు రాసిన ఆత్మహత్య లేఖ అంటూ ఒక లేఖను కూడా చూపిస్తూ ఆ పోస్టును సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. #AmritsarTrainTragedy అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో పంజాబ్ పోలీసు అధికారి కూడా ఒకరు ఉండటంతో ఆ పోస్టుకు మరింత బలం చేకూరింది.
ఇదీ నిజం
అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు. అతడు ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో పోలీసుల అదుపులో ఉన్నాడు. అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీవాస్తవ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆ ఫొటోల్లో ఆత్మహత్య లేఖ అంటూ చూపుతున్న లేఖ అసలు ఆత్మహత్య లేఖే కాదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేసి విషయాన్ని సంచలనంగా మార్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు.
అమృత్‌సర్ స్టేషన్ సుపరింటెండెంట్ కూడా ఈ ఫొటోలు, వీడియో నకిలీవని తేల్చారు.
ఆ ఫొటో ఎవరిది?
సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో అక్టోబర్ 20 అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతంలో ఉరి వేసుకుని చనిపోయిన ఓ వ్యక్తిదని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




