గరిమా అరోరా: రెస్టరెంట్ బిజినెస్‌లో మిషెలిన్ స్టార్ దక్కించుకున్న తొలి భారతీయురాలు

ఫొటో సోర్స్, COURTESY OF GAA, BANGKOK
తమ చేతి వంటను ఎవరైనా పొగిడితే వండిన వారికి కలిగే ఆనందమే వేరు. గరిమా అరోరా అనే భారతీయ మహిళ ఇప్పుడు ఆ ఆనందంలోని అత్యున్నత స్థితిని అందుకున్నారు. ఆమె వంటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు గరిమా నిర్వహిస్తున్న ‘గా’ రెస్టరెంట్‌కు లభించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ సంస్థ ఈ గుర్తింపును అందిస్తుంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ గరిమానే. బ్యాంకాక్‌లో ఆమె ‘గా’ రెస్టరెంట్‌ను నిర్వహిస్తున్నారు.
‘నిజానికి వంట చేయడం చాలా పెద్ద చాకిరీ. మొదట్లో కష్టంగా ఉండేది. తరువాత నేను దానికి అలవాటు పడిపోయా. ఇప్పుడు ఇక్కడి దాకా రాగలిగా’ అంటూ గరిమా బీబీసీ ప్రతినిధి నికితా మందనితో మాట్లాడుతూ చెప్పారు.
ముంబయికి చెందిన గరిమా 21ఏళ్ల వయసులో వంట చేయడం నేర్చుకున్నారు. పాక శాస్త్రంలో శిక్షణ కోసం ప్యారిస్‌లోని కార్డన్ బ్లూ కలినరీ స్కూల్‌లో చేరారు.
పంజాబీ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో మొదట్నుంచీ వంటలపైన తనకు ఆసక్తి ఉందంటారామె.

ఫొటో సోర్స్, GAA, BANGKOK
‘రెస్టరెంట్ నిర్వహించడం అంటే ఇంటికొచ్చిన అతిథులకు మర్యాద చేసి, వాళ్లకు మంచి భోజనం పెట్టడం లాంటిదే. మేం కూడా అతిథులకు అలాంటి అనుభూతినే పంచుతున్నాం. దానికి లభించిన గుర్తింపే మిషెలిన్ స్టార్’ అంటారామె.
వంట చేయడంలో తండ్రే తనకు స్ఫూర్తి అని, ఇంట్లో ఆయన చేసే రకరకాల వంటకాలను గమనిస్తూ పెరిగానని ఆమె చెబుతారు. పాక శాస్త్రంపైన అభిరుచి పెరగడానికి తండ్రి ప్రభావమే కారణమంటారామె.
‘చాలామంది భారతీయులకు ఇప్పుడు పరిచయం లేని వంటకాలను కూడా ఆయన 90ల్లోనే చేసేవారు’ అని ఆమె చెబుతారు.
గత ఏడాది తన సొంత రెస్టరెంట్‌ను తెరవక ముందు గోర్డన్ రామ్సే, రెనె రెజెపి, గగన్ ఆనంద్ లాంటి ప్రముఖ షెఫ్‌ల దగ్గర ఆమె పనిచేశారు.

ఫొటో సోర్స్, GAA, BANGKOK
‘భారతీయ రుచులతో పాటు ఇతర దేశాల ప్రజల అభిరుచులను మేళవించి మా రెస్టరెంట్ మెనూను రూపొందించా. వంట చేయడంలో చాలా సృజనాత్మకత దాగుంటుంది. ఏదో తెలీని సంతృప్తిని అది అందిస్తుంది’ అంటారు గరిమా.
తమ హోటల్ సిబ్బందిని చూసి గర్వపడుతున్నానని, రెస్టరెంట్‌ను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తానని ఆమె చెబుతారు. ‘ఇలాంటి ఆహారాన్ని ముందెప్పుడూ తినలేదే’ అనుకుంటూ తన వినియోగదారులు రెస్టరెంట్ నుంచి అడుగు బయటపెట్టాలని గరిమా కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Gaa
తాను విదేశాల్లో నేర్చుకున్న వంటకాలకు, భారతీయతను జోడించి కొత్త రకం రుచులను అందించేందుకు గరిమా ప్రయత్నిస్తున్నారు.
మిషెలిన్ స్టార్ల ద్వారా రెస్టరెంట్లకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో పాటు, వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని హోటల్ రంగ నిపుణులు భావిస్తారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








