దిల్లీలో వీహెచ్‌పీ ర్యాలీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మోదీ ప్రభుత్వం అనుకూలంగా ఉందా? ఆర్డినెన్స్ తీసుకురానుందా?

బాబ్రీ మసీదు, రామ మందిరం, బీజేపీ, వీహెచ్‌పీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత కొన్ని నెలలుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నా, అయోధ్య ధర్మసభకు అనుకున్నంత మంది హాజరు కాలేదు. అయినా రామమందిర నిర్మాణం కోసం చట్టాన్ని చేయాలన్న డిమాండ్ మరింత ఎక్కువగా వినిపిస్తోంది. హిందూ సంస్థలు, సాధువులు 11 డిసెంబర్ తర్వాత ఏదైనా జరుగుతుందని హామీ ఇస్తున్నారు.

హిందూ ధర్మగురు స్వామి రామభద్రాచార్య నవంబర్ 25న బీబీసీతో మాట్లాడుతూ, ''ప్రభుత్వం ఇచ్చిన హామీని బట్టి, ప్రధానమంత్రి రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తారని భావిస్తున్నాను. మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ వెలువడొచ్చు లేదా మరేదైనా జరగొచ్చు'' అన్నారు.

రామమందిరంపై తనకు మోదీ క్యాబినెట్‌లో రెండో స్థానంలో ఉన్న మంత్రి నుంచి తమకు హామీ లభించిందని అన్నారు.

అయితే కేవలం 'సాధువుల ఆజ్ఞలు', 'రాజ్యాంగం ప్రకారమైనా చేయండి లేదా చట్టప్రకారమైనా చేయండి' లాంటి నినాదాలు, వ్యాఖ్యల ద్వారా రామమందిర నిర్మాణం కోసం ఒక చట్టాన్నో, ఆర్డినెన్స్‌నో చేయడం సాధ్యం కాదు. అందుకు కొన్ని సమస్యలున్నాయి.

అయోధ్య ధర్మ పరిషత్‌కు వందల కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని అల్వార్‌లో ప్రధాని నరేంద్రమోదీ, నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా రామ మందిరానికి సంబంధించిన ప్రకటనలు చేశారు.

కర్ణాటకలోని ధార్వాడ్ ఎంపీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ రాకేశ్ సిన్హాల ప్రైవేట్ బిల్లు కూడా దీనిలో భాగమే అని భావిస్తున్నారు.

బాబ్రీ మసీదు, రామ మందిరం, బీజేపీ, వీహెచ్‌పీ

ఫొటో సోర్స్, Getty Images

వ్యక్తిగత నిర్ణయం.. పార్టీకి సంబంధం లేదు

ఇతర రాజకీయ పార్టీల నుంచి తగినంత ప్రతిస్పందన లేని కారణంగా, పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని, అయితే ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి ముసాయిదా ప్రతిని లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు రాకేష్ సిన్హా తెలిపారు.

ప్రస్తుతం స్పీకర్ కార్యాలయ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి బీబీసీకి తెలిపారు. తన నియోజకవర్గంలో ఆలయ నిర్మాణం చేపట్టాలంటూ తీవ్ర ఒత్తిడి వస్తోందని, దాని వల్లే తాను ప్రైవేట్ బిల్లు పెట్టాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అది తన వ్యక్తిగత నిర్ణయమన్న ఆయన, పార్టీతో దీనికి సంబంధం లేదన్నారు.

స్పీకర్ కార్యాలయ ప్రతిస్పందనను బట్టి ఈ శీతాకాల సమావేశాలలో దానిపై చర్చ జరుగుతుందా లేదా అన్నది తేలిపోతుంది.

బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ కూడా దీన్ని ధృవీకరించారు.

రామ మందిరం కోసం హిందూ సంస్థలు ఆర్డినెన్స్ కానీ, చట్టం కానీ చేయాలని కోరడంపై షానవాజ్ స్పందిస్తూ.. ''అది వారి హక్కు'' అన్నారు.

బాబ్రీ మసీదు, రామ మందిరం, బీజేపీ, వీహెచ్‌పీ

ఫొటో సోర్స్, VHP

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ నుంచి రామ మందిర నిర్మాణం కోసం వీహెచ్‌పీ పలు కార్యక్రమాలు చేపడుతోంది

కోర్టులో పరిష్కారం దొరకదు..

గత అక్టోబర్ నుంచి వివిధ ప్రాంతాలలో, అయోధ్యలో వివిధ రకాల మతసమ్మేళనాలను చేపట్టిన వీహెచ్‌పీ, మరోసారి దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఈరోజు (2018 డిసెంబర్ 9వ తేదీ ఆదివారం) హిందూ సాధువుల సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది.

దిల్లీ కార్యక్రమం 'చట్టబద్ధంగా ఆలయాన్ని నిర్మించడం' అన్న ఉద్యమంలో తదుపరి దశ అని వీహెచ్‌పీ అంటోంది. వీహెచ్‌పీ మొదటి దశలో సాధువుల ద్వారా రాష్ట్రపతికి ఒక విజ్ఞాపన సమర్పించడం, గవర్నర్‌లను, అన్ని పార్టీల ఎంపీలను కలుసుకోవడం చేసింది.

ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్.. రామమందిర నిర్మాణం కోసం మద్దతు ఇస్తామని అధికార, విపక్ష ఎంపీలంతా తమకు హామీ ఇచ్చారని తెలిపారు.

''రామమందిరంపై గత కొన్ని దశాబ్దాలుగా అనేక కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. వాటికి కోర్టులో పరిష్కారం దొరకదు, అందువల్ల వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణం కోసం చట్టం చేయాలి'' అని సురేంద్ర జైన్ అన్నారు.

మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, AFP

ఆ మాటల వెనుక నిగూఢార్థం..

'అయోధ్య ద డార్క్ నైట్' అన్న పుస్తక సహ రచయిత ధీరేంద్ర ఝా మాట్లాడుతూ.. ''రామభద్రాచార్య, ఆరెస్సెస్ చీఫ్, నరేంద్ర మోదీల ప్రకటనలు.. వీహెచ్‌పీ ఒకదాని వెనుక ఒకటి నిర్వహిస్తున్న కార్యక్రమాల వెనుక ఏదో నిగూఢార్థం ఉండే ఉంటుంది'' అన్నారు.

నవంబర్‌లో అయోధ్యలో సాధువుల సమావేశం జరుగుతున్నపుడు, దాదాపు అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎన్నికల సమావేశంలో.. సుప్రీంకోర్టులో మందిరం అంశంపై విచారణ ఆలస్యం కావడానికి కాంగ్రెస్సే కారణమని అన్నారు.

మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అదే రోజు నాగ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో.. రామమందిరం కేసు విచారణలో జరుగుతున్న జాప్యానికి సుప్రీంకోర్టు ప్రజల భావాలను పట్టించుకోకపోవడమే కారణమని అన్నారు. అందువల్లే, మందిర నిర్మాణంపై చట్టం చేయాలన్నారు.

నాగ్‌పూర్‌కు చెందిన విశ్లేషకులు దిలీప్ దేవధర్.. ‘‘ప్రస్తుతం మోదీ-షా-భయ్యాజీ-భాగవత్‌ల మధ్య పూర్తి ఐకమత్యం ఉంది. ఇప్పుడు అందరూ ఒకేలా మాట్లాడుతున్నారంటే దాన్ని తీవ్రంగానే పరిగణించాలి'' అన్నారు.

మరోవైపు రాజకీయ విశ్లేషకుడు అజయ్ సింగ్, బాబ్రీ మసీదు-రామ మందిర వివాదం సుప్రీంకోర్టులో ఉన్నంత వరకు ప్రభుత్వం దానిపై చట్టం చేసే సాహసం చేయదని అభిప్రాయప్డారు. ఆరెస్సెస్ నిర్వహిస్తున్న సదస్సులు, ప్రకటనలు గుర్తింపు కోసమే అని అన్నారు.

ప్రభుత్వానికి మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారమున్నా, దానిని వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తారని, అక్కడ కోర్టు దానిని కొట్టివేస్తుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

రాజ్యసభలో తగిన మెజారిటీ లేనందున రామమందిరంపై ప్రభుత్వం చట్టం చేయడం కష్టం కావచ్చు.

బాబ్రీ మసీదు, రామ మందిరం, బీజేపీ, వీహెచ్‌పీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రామ మందిరమే కూటమిని నిర్ణయిస్తుందా?

ప్రభుత్వ సంకేతాలతోనే రామ మందిరం డిమాండ్

రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయాలన్న డిమాండ్ పూర్తిగా రాజకీయ చర్య అని.. ప్రభుత్వ సంకేతాలతోనే ఆ డిమాండ్ చేస్తున్నారని ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నారు.

దీని వల్ల ఈ విషయంపై తాము చాలా ప్రయత్నాలు చేసినా, ఇతర పార్టీలు బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పుకోవచ్చు.

రామమందిర నిర్మాణంపై బిల్లు తీసుకురావడం వెనుక మరో ఉద్దేశం అది రాబోయే రోజుల్లో రాజకీయ కూటమిని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, సుతిమెత్తని హిందుత్వ పంథాను అనుసరిస్తున్న కాంగ్రెస్ తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటోంది.

ఒకవేళ కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకిస్తే, బీజేపీ 'కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి' అంటూ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ బిల్లుకు మద్దతిస్తే, పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మద్దతుదారులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)