రజినీకాంత్ 2.0: సెల్ టవర్ల గురించి నిజంగా అంత భయపడాలా?

రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గురుప్రీత్ సైనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి ఉరి వేసుకుంటాడు. ఆ వ్యక్తి మరణానికి రోదిస్తున్నట్లు వేలాది పక్షులు ఆ టవర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి.

ఇటీవల విడుదలైన రజినీకాంత్ చిత్రం 2.0 ఇలా మొదలౌతుంది. ఆ తర్వాత సీనులో హఠాత్తుగా ప్రజల చేతుల్లోంచి ఫోన్లు గాలిలోకి ఎగిరిపోతుంటాయి. ప్రభుత్వం దీనిని పరిష్కరించేందుకు పోలీసులను రంగంలోకి దింపుతుంది. కానీ ఆ ఫోన్లు ఏమైపోయాయో ఎవరికీ అంతు చిక్కదు.

అప్పుడు అదే మొబైల్ ఫోన్లతో చేసిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. కోపం నిండిన కళ్లతో, ''చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తీ ఒక హంతకుడే'' అంటాడు.

ఆ వ్యక్తి ప్రతి 'హంతకుడి'నీ శిక్షించాలనుకుంటాడు. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడుతున్న రేడియేషనే పక్షుల మరణానికి కారణమని ఆరోపిస్తాడు. మొత్తం సినిమా ఈ పాయింట్ చుట్టూ నడుస్తుంది.

ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మీకు మీరే ఓ క్రిమినల్ అని, హంతకుడని అనిపిస్తుంది. నిజంగానే పక్షులు మొబైల్ టవర్ రేడియేషన్ కారణంగా మరణిస్తున్నాయా అనే అనుమానం మీలో తలెత్తుతుంది.

బీబీసీ ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నించింది.

2.0లో అక్షయ్ కుమార్

ఫొటో సోర్స్, 2.0 trailer grab

ఫొటో క్యాప్షన్, 2.0లో అక్షయ్ కుమార్

'సినిమాలో నిజమే చూపించారు'

ఈ సినిమాలో చూపించిన విషయాలు చాలావరకు నిజాలే అని వైద్యుడు, వన్యప్రాణి నిపుణులు డాక్టర్ రీనా దేవ్ అన్నారు.

డాక్టర్ రీనా ప్రకారం పక్షులు రెండు రకాలు. ఒకటి మన చుట్టూ పక్కల ఉండే పక్షులు. రెండో రకం దూరప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు. అవి ఇతర దేశాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. భూమి అయస్కాంత క్షేత్రం ఆధారంగా అవి దారి కనుక్కుంటాయి. అయితే ఏదైనా మొబైల్ టవర్ల నుంచి వెలువడే ఎలెక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వాటి దారికి అడ్డంగా వచ్చినపుడు అవి గందరగోళంలో పడతాయి.

డాక్టర్ రీనా, ''నాకోసారి ముంబై తూర్పు అంధేరిలోని పారిశ్రామిక ప్రాంతంలో మాస్క్డ్ బూబీ (వలస పక్షి) కనిపించింది. అదో సముద్రపక్షి. అది పారిశ్రామిక ప్రాంతంలో కనిపించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇలా చాలా పక్షులు మునుపు కానరాని ప్రదేశాల్లో కనిపించడం క్రమంగా పెరుగుతోంది'' అని తెలిపారు.

డాక్టర్ రీనా చెబుతున్న దాని ప్రకారం.. రేడియేషన్ కారణంగా పక్షుల ఫలదీకరణ సామర్థ్యం, గుడ్ల పరిమాణం, గుడ్ల పెంకు మందం కూడా ప్రభావితమవుతున్నాయి.

మాస్క్డ్ బూబీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్క్డ్ బూబీ

100 శాతం ఖచ్చితంగా నిరూపణ కాలేదు

పక్షులపై మొబైల్ టవర్ల ప్రభావం గురించి విదేశాలలో చాలా పరిశోధనలు జరిగాయి కానీ భారతదేశంలో కూడా అలాంటి పరిశోధనలు జరిగినప్పుడు వాటి వల్ల కలిగే నష్టాలను ఖచ్చితంగా అంచనా వేయొచ్చని ఆమె అన్నారు.

పక్షి శాస్త్రవేత్త డాక్టర్ పంకజ్ గుప్తా.. విదేశాలలో నిర్వహించిన పరిశోధనల్లో మొబైల్ టవర్ల వల్ల పక్షులకు నష్టమని 100 శాతం ఖచ్చితంగా నిరూపితం కాలేదన్నారు.

అడవులు, నీటి కుంటలు అంతరించి పోవడం వల్లే పక్షులు నగరాలలో కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. కొన్నిసార్లు తుపాన్లు, వాతావరణంలోని మార్పుల వల్ల కూడా అవి దారి తప్పే అవకాశం ఉంది.

2.0లో అక్షయ్ కుమార్

ఫొటో సోర్స్, 2.0 trailer grab

మరి రేడియేషన్ ప్రభావం ఉండదా?

తమిళనాడులోని మదురైలో ఉన్న అమెరికన్ కాలేజీలో బయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్ ఎం.రాజేశ్.. రేడియషన్ ప్రభావం అసలు ఉండదని కాదు కానీ, వాటి వల్ల పక్షులు అంతరించిపోయేంత ప్రమాదం లేదన్నారు.

ఒక లేబరేటరీలో పక్షులపై ఎలెక్ట్రోమేగ్నటిక్ ఫీల్డ్ రేడియేషన్‌ను ఉపయోగించినపుడు వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

దీనికి సమాధానంగా డాక్టర్ రాజేశ్.. లేబరేటరీలో రేడియేషన్ సరాసరి వాటి శరీరంపై పడుతుంది కాబట్టి, దాని వల్ల దుష్పలితాలు ఉంటాయని.. కానీ మొబైల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ మొత్తం వాతావరణమంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి వాటి వల్ల పెద్దగా హాని ఉండదని అన్నారు.

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మాజీ డీన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జుక్లా కూడా ప్రొఫెసర్ రాజేశ్‌తో ఏకీభవించారు. రేడియేషన్ - అయొనైజింగ్, నాన్ అయొనైజింగ్ అని రెండు రకాలుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎక్స్ రే రేడియేషన్ అయొజైనింగ్ కిందకు వస్తుంది. అది శరీరానికి హాని చేస్తుంది. దాని వల్ల కేన్సర్ కూడా రావచ్చు. అదే మొబైల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ చాలా తక్కువ శక్తి కలిగినది. అది ప్రమాదకరం కాదు.

అలాంటి మొబైల్ టవర్ల చుట్టూ ఉండేవాళ్లకు ప్రమాదం అన్నవాదన కూడా సత్యం కాదు అంటారాయన.

పక్షులు, మొబైల్ టవర్లు, రేడియేషన్

ఫొటో సోర్స్, Getty Images

సెల్ టవర్లపై జుహీ చావ్లా ప్రజా ప్రయోజన వ్యాజ్యం

భారతదేశంలో మొబైల్ ఫోన్ మార్కెట్ చాలా పెద్దది. అయినా సెల్ ఫోన్ టవర్లు ఎక్కడ పెట్టాలన్న దానిపై మాత్రం ఒక నిర్దిష్ట విధానం లేదు.

అయితే జనావాస ప్రాంతాలలో మొబైల్ టవర్లపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. నటి జుహీ చావ్లా కూడా వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.

ఈ వ్యతిరేకత నేపథ్యంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ పక్షులు, తేనెటీగలపై మొబైల్ టవర్ల ప్రభావాన్ని తెలుసునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేడియేషన్ ప్రభావంపై విడుదలైన 919 నివేదికలను పరిశీలించింది. వాటిలో 81 శాతం నివేదికలు మానవులపై మొబైల్ టవర్ల ప్రభావానికి సంబంధించినవి. కేవలం మూడు శాతం మాత్రం పక్షులపై రేడియేషన్ ప్రభావానికి సంబంధించినవి. అలాంటి 30 నివేదికలలో 23 నివేదికలు పక్షులపై ఎలెక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ ప్రభావం చూపుతుందని తేల్చాయి.

ఈ కమిటీ అధ్యక్షుడైన అసద్ రహమానీ.. అప్పటికే ఉన్న పత్రాల ఆధారంగా తమ కమిటీ సభ్యులు సర్వే చేశారని, అయితే అలాంటి నివేదికలను పూర్తిగా నమ్మలేమన్నారు. రేడియేషన్ ప్రభావంపై నిపుణులు ఉన్నపుడే అలాంటి నివేదికలకు ప్రామాణికత ఉంటుందని అన్నారు.

''చాలా పక్షుల గూళ్లు మొబైల్ టవర్లపైనే ఉంటాయి. అవి మరణించవు. పావురాలను చూడండి. నగరాల్లో అవి పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి కదా'' అని రహమానీ అన్నారు.

పక్షులు, మొబైల్ టవర్లు, రేడియేషన్

ఫొటో సోర్స్, Getty Images

అయితే డాక్టర్ రీనా దేవ్ మాత్రం.. పావురాలు పట్టణ పక్షులని, అవి మనకు అలవాటైపోయాయని, అందువల్ల వాటికి రేడియేషన్ ప్రమాదం ఉండదని అన్నారు.

డాక్టర్ రీనా, రహమానీ ఇరువురూ కూడా మొబైల్ టవర్ ప్రభావాలపై విస్తృతమైన పరిశోధన జరిగినపుడు మాత్రమే వాస్తవాలు వెల్లడి అవుతాయన్నారు.

పక్షులు, మొబైల్ టవర్లు, రేడియేషన్

ఫొటో సోర్స్, Getty Images

2.0పై మొబైల్ ఆపరేటర్ల అభ్యంతరం

మొబైల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ పై భారతదేశంలోనూ పరిశోధనలు జరగలేదని కాదు.

డాక్టర్ సీవీ రామన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆర్కే సింగ్ కర్ణాటకలోని బిజాపూర్‌తో పాటు అనేక ప్రాంతాలలో పరిశోధనలు నిర్వహించారు.

ఆయన పరిశోధనలో పక్షులు మొబైల్ టవర్లు ఉన్న ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోతున్నాయని వెల్లడైంది.

దీర్ఘకాలంలో నాన్ అయొనైజింగ్ రేడియేషన్ వల్ల కూడా నష్టాలు ఉన్నాయని డాక్టర్ ఆర్కేసింగ్ అన్నారు. 2.0 సినిమాలో చూపించిన విషయాలు వాస్తవమే అని తెలిపారు.

2.0 సినిమాపై సెల్యూలార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరాలు తెలుపుతూ లేఖ రాసింది. ఇది మొబైల్ ఫోన్లు, టవర్లపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎ.మాథ్యూ బీబీసీకి తెలిపారు.

పక్షులు, మొబైల్ టవర్లు, రేడియేషన్

ఫొటో సోర్స్, Getty Images

మొబైల్ టవర్ల పవర్ తగ్గించే ఆదేశాలు

భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి మొబైల్ టవర్ల రేడియో ఫ్రీక్వెన్నీ తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.

తదనుగుణంగా టెలికమ్యూనికేషన్స్ శాఖ, రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్‌ను చదరపు మీటరుకు 9.2 నుంచి 0.92 వాట్లకు తగ్గించాలని.. రెండు టవర్ల మధ్య కనీసం ఒక కిలోమీటరు దూరం ఉండాలని సూచించింది.

పక్షులు, మొబైల్ టవర్లు, రేడియేషన్

ఫొటో సోర్స్, Getty Images

తలచిందొకటి.. జరిగిందొకటి

2013లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రేడియేషన్ నిపుణలు మైఖేల్ రెపాచోలి భారతదేశం వచ్చారు. మొబైల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను తగ్గించాలని భారతదేశ ప్రభుత్వం ఆదేశిస్తే, దానికి వ్యతిరేక ఫలితాలు వెలువడుతున్నాయని అన్నారు.

వాటి శక్తి తగ్గంచడం వల్ల ప్రజల ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతోందని తెలిపారు.

''సెల్ టవర్ల రేడియేషన్‌ను తగ్గించడం వల్ల ప్రమాదం తగ్గదు. బేస్ స్టేషన్ పవర్‌ను తగ్గిస్తే, దాని వల్ల మొబైల్ ఆ నెట్ వర్క్ కనెక్షన్ కోసం మరింత ఎక్కువ ఫ్రీక్వెన్సీని ట్రాన్స్‌మిట్ చేస్తుంది. ఫోన్ శరీరానికి దగ్గరగా ఉంటుంది. దాని వల్ల ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది,'' అని మైఖేల్ తెలిపారు.

మొబైల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల కలిగే నష్టాల గురించి ఖచ్చితమైన వివరాలు తెలియాలంటే దీనిపై ఒక శాస్త్రబద్ధమైన పరిశోధన జరగాలని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)