ఆఫ్రికన్లు.. వేరే ఆఫ్రికా దేశాలకు వెళ్లటం ఎందుకంత కష్టం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ల్యారీ మదోవో
- హోదా, బీబీసీ ఆఫ్రికా బిజినెస్ ఎడిటర్
ఆఫ్రికాలో అత్యంత సంపన్నుడు అలికో డాన్గోట్.. తన నైజీరియా పాస్‌పోర్ట్‌తో ఆఫ్రికా ఖండంలో పర్యటించటానికి తనకు 38 వీసాలు అవసరమని చెప్పారు. అయితే.. యూరప్ దేశస్థులు చాలా మంది చాలా ఆఫ్రికా దేశాల్లోకి వీసా లేకుండా వెళ్లిరావచ్చు.
నిజానికి ఆఫ్రికా దేశాల్లో పర్యటించటానికి ఆఫ్రికా పౌరులందరికీ వీసాలు జారీ చేసే విధానాన్ని 2018 నాటికి రద్దు చేయాల్సి ఉంది.
ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) సభ్య దేశాలు 2013లో ఆమోదించిన యాభై ఏళ్ల కార్యాచరణ ప్రణాళికలో ఇది కీలక అంశం.
కానీ.. ప్రస్తుతానికి సీషెల్స్ ఒక్కటే వీసా లేకుండా ఆఫ్రికా వాసులందరినీ అనుమతిస్తున్న దేశం. వాస్తవానికి ఆ దేశం ఆఫ్రికా వాసులకు ఎన్నడూ వీసా నిబంధన పెట్టలేదు.
ఆఫ్రికా దేశాల్లోని 22 శాతం దేశాలకు మాత్రమే ఆఫ్రికావాసులు వీసా లేకుండా ప్రయాణించగలరని ఇటీవలి ఏయూ నివేదిక ఒకటి గుర్తించింది.
ఇది చాలా సున్నితమైన అంశం.
ఆర్థిక పురోగతికి ప్రజలు స్వేచ్ఛగా సంచరించగలగటం చాలా కీలకమని.. కేప్ నుంచి కైరో వరకూ ప్రభుత్వాధినేతలందరూ ఉద్ఘాటిస్తున్నప్పటికీ.. కొన్ని ధనిక ఆఫ్రికా దేశాల్లో విదేశీయుల పట్ల విముఖత వ్యక్తమవుతోంది.
''వలసవాద సరిహద్దులను పరిరక్షించటానికి మా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది'' అని దక్షిణాఫ్రికా పర్యటన బ్లాగర్ కాట్చీ నజ్మా చెప్తున్నారు. ఆఫ్రికాలోని 55 దేశాల్లో 35 దేశాలను సందర్శించారు.
యూరోపియన్ యూనియన్ తరహాలోనే.. 120 కోట్ల మంది ఆఫ్రికన్లందరూ అన్ని దేశాల్లోనూ స్వేచ్ఛగా సంచరించగలిగేలా అంతర్గత సరిహద్దులు ఆఫ్రికా ఖండం కావాలని ఏయూ కాంక్షిస్తుండొచ్చు. కానీ.. దీనికి చాలా అవరోధాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
బుర్కినా ఫాసోలో వలస అధికారులు వీసా ఇవ్వటానికి 200 డాలర్లు వసూలు చేస్తారు. టాంజానియాలోకి అక్రమంగా వచ్చిన తూర్పు ఆఫ్రికా వాసులను అరెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. ట్యునీసియాలో విమానం రద్దయిన తర్వాత చిక్కుకుపోయిన ఆఫ్రికన్లకు కూడా ఆ దేశం వీసా నిరాకరిస్తుంది. ఏదేమైనా.. ఆఫ్రికా దేశాల మధ్య అంతర్గత ప్రయాణాలపై అన్ని చోట్లా అనుమానపు దృక్కులే ఉంటాయి.

ద్వంద్వ ప్రమాణాలు?
ఆఫ్రికా ఖండంలో వీసాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు దక్షిణాఫ్రికాలో విస్పష్టంగా కనిపిస్తాయి.
ఆఫ్రికాలోని కేవలం 15 దేశాల పౌరులు మాత్రమే వీసా లేకుండా దక్షిణాఫ్రికా రావచ్చు. అదే 28 యూరప్ దేశాల పాస్‌పోర్టులు ఉన్న వారు ఈ దేశానికి స్వేచ్ఛగా వచ్చివెళ్లొచ్చు.
ఈ వీసా మినహాయింపు విధానాన్ని ఆయా దేశాల ప్రతిస్పందనను బట్టి రూపొందించామని దక్షిణాఫ్రికా అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తాబో మోక్‌గోలా సమర్థించుకున్నారు. పలు ఆఫ్రికా దేశాలతోనూ ఇదే తరహా విధానాన్ని ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
అయితే.. కెన్యా తన దేశానికి వచ్చే దక్షిణాఫ్రికా వాసులకు రాగానే ఉచితంగా వీసా జారీచేస్తుంది. అదే కెన్యా వాసులు దక్షిణాఫ్రికాకు వెళ్లాలంటే కనీసం ఐదు రోజులు ముందుగా వీసాకు దరఖాస్తు చేసుకుని సర్వీస్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది.
ఆఫ్రికాలోని అన్ని దేశాలూ.. ఆఫ్రికావాసులందరికీ వీసా విధానాన్ని 2018 నాటికి రద్దు చేయాలని ఆఫ్రికన్ యూనియన్ 2013లో సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. అయితే.. రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా సరిగ్గా దానికి వ్యతిరేకంగా మరింత కఠినమైన వీసా నిబంధనలను ప్రకటించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆర్థిక మాంద్యం, పర్యటకుల సంఖ్య తగ్గిపోవటంతో దక్షిణాఫ్రికా ఇటీవల దిగివచ్చింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటం కోసం ప్రయాణ నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, AFP/BBC
ఆఫ్రికా పాస్‌పోర్ట్...
నమీబియా, మారిషస్, ఘనా, రువాండా, బెనైన్, కెన్యాలు.. ఇతర ఆఫ్రికాదేశస్తుల విషయంలో ప్రయాణ ఆంక్షలను సడలించాయి. తమ దేశంలోకి వచ్చిన ఇతర ఆఫ్రికా దేశస్తులకు రాగానే వీసా ఇవ్వటమో, కేవలం పాస్‌పోర్ట్ ఆధారంగానే 90 రోజుల వరకూ తమ దేశంలో ఉండటానికి అనుమతించటమో చేస్తున్నాయి.
ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల్లో సగానికి పైగా దేశాలకు ప్రయాణించాలంటే ఆఫ్రికావాసులకు ఇప్పటికీ ఆయా దేశాల వీసా అవసరమే.
''మా సంస్థ ఎంత పెద్దది అయినప్పటికీ.. ఆఫ్రికా అంతా తిరగాలంటే నాకు 38 వీసాలు అవసరం'' అని నైజీరియా బిలియనీర్ అలికో డాన్‌గోట్ 2016లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
2016లో ప్రారంభించిన ఆఫ్రికా పాస్‌పోర్టును పొందిన తొలి ఆఫ్రికన్లలో ఆయన ఒకరుగా చెప్తున్నారు. ఆఫ్రికా దేశాలకు విడివిడిగా ఉన్న పాస్‌పోర్టులను తొలగించి.. దానిస్థానంలో ప్రవేశపెట్టటం ఈ ఆఫ్రికా పాస్‌పోర్టు లక్ష్యం. కానీ.. ఇది ప్రస్తుతం కొందరు దేశాధినేతలు, సీనియర్ దౌత్యాధికారులు, ఆఫ్రికన్ యూనియన్ ఉన్నతస్థాయి అధికారులకు మాత్రమే పరిమితమైంది.
అయితే.. ఈస్ట్రన్ ఆఫ్రికన్ కమ్యూనిటీ, ఎకానిమక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ, మఘారెబ్, సెంట్రల్ ఆఫ్రికన్ ఎకానమిక్ అండ్ మానిటరీ కమ్యూనిటీ వంటి దేశాల బృందాల్లో అంతర్గత రాకపోకలు సులభంగానే ఉంటాయి. కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆంక్షలు లేకుండా ప్రయాణించటం సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
భారీ చార్జీలు...
ఆఫ్రికాలో అంతర్గత ప్రయాణాలకు మరో ఆటంకం.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాణిజ్య విమానాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న విమానాలకూ చార్జీల ధరలు చాలా భారీగా ఉంటాయి.
''విమానంలో కెన్యా నుంచి నమీబియా వెళ్లాలంటే.. థాయ్‌లాండ్ వెళ్లటానికి ఎంత ఖర్చవుతుందో అంత ఖర్చవుతుంది. నైరోబి నుంచి మొరాకోకు వెళ్లటం కన్నా దుబాయ్ వెళ్లటానికి అయ్యే ఖర్చు తక్కువ'' అని కెన్యా పర్యాటక బ్లాగర్ విన్నీ రియోబా చెప్తారు.
పైగా.. ఇది వీసా ఫీజులకు అదనం.
జిబోటీకి వెళ్లటానికి వీసా కోసం రియోబా 90 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. యూరప్‌లోని 25 దేశాల్లో పర్యటనకు అనుమతినిచ్చే షెన్‌జెన్ వీసా కోసం చెల్లించే 75 డాలర్ల కన్నా ఇది ఎక్కువ.
''ఆఫ్రికా ఖండంలో పర్యటన కోసం నా ప్రయాణాలకైన ఖర్చుకన్నా వీసాలకు ఎక్కువ ఖర్చయింది'' అని నజ్మా కూడా తెలిపారు.
''కేవలం రాయబార కార్యాలయాలకు చెల్లించిన డబ్బు మాత్రమే కాదు. ఆ కార్యాలయాలకు వెళ్లి రావటానికి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవటానికి కూడా చాలా డబ్బు, సమయం వెచ్చించాల్సి ఉంటుంది. చాలా సార్లు ఇదంతా అనవసరమని నాకు అనిపించింది'' అని ఈ దక్షిణాఫ్రికా పర్యాటక బ్లాగర్ పేర్కొన్నారు.
ఈ ప్రయాణాలకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవటంలో తన సహ నైజీరియన్లకు సాయం చేయటం కోసం.. ఫున్మీ ఒయాటోగున్ అనే పారిశ్రామికవేత్త ఏ ఆఫ్రికా దేశానికి వెళ్లటం సులభమో తెలియజేసే ఒక మ్యాప్‌ను రూపొందించారు.
''ఆఫ్రికావాసులు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రయాణించటాన్ని సులభం చేయటం మీద మేం దృష్టి కేంద్రీకరించాం'' అని టీవీపీ అడ్వెంచర్స్‌ను ఆరంభించటం గురించి ఆమె చెప్పారు.
ఆఫ్రికా ఖండంలో అంతర్గతంగా పర్యటించటానికి ఆఫ్రికా వాసులకు వీసాలను రద్దు చేయాలన్న ఆలోచనకు విస్తృత మద్దతు ఉంది.
కానీ.. 2018 నాటికి ఈ వీసాలను రద్దు చేయాలన్న కాల పరిమితి ముగిసిపోతున్నా.. అది ఇప్పట్లో సాకారమవుతుందని భావించేవారు తక్కువే.
ఇది ఇలా కొనసాగుతుండగానే.. అసలు ఆఫ్రికా ఖండం బయటకు వెళ్లటం మరింత ఆకర్షణీయంగా ఉంటోంది.
''అంగోలాకు వెళ్లటం కన్నా.. యూరప్‌లో ఐదు దేశాల్లో పర్యటించటం చౌక అయినపుడు.. నా సహచర ఆఫ్రికన్ ప్రయాణికులను అంగోలా పర్యటనకు వెళ్లాలని నేనెలా ఒప్పించగలను?'' అని రియోబా ప్రశ్నిస్తున్నారు.
ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో పెట్టుబడులు పెట్టిన బిలియనీర్ డాన్‌గోట్‌కి కూడా తన పెట్టుబడులున్న దేశాలకు వెళ్లటానికి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
''మనవల్ల వాళ్లకి ప్రయోజనముంటే వాళ్లు వీసా ఇస్తారు'' అని ఆయన అంటారు.
ఇది కూడా చూడండి
- నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- #HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- మెంగ్ హాంగ్వే నిర్బంధం: ఇంటర్‌పోల్ చీఫ్ లంచం తీసుకున్నారని ప్రకటించిన చైనా
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









