పీవీ నరసింహారావు శత జయంతి: మోదీ గుర్తు చేసుకుంటే, సోనియా మర్చిపోయారా?

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
- రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నో ప్రధాన వార్తాపత్రికల్లో “తెలంగాణ తేజో మూర్తి... భారతజాతి జ్ఞాన సంపత్తి” అంటూ ఫుల్ పేజీ ప్రకటన వచ్చింది. చాలా పత్రికలు దీనిని మొదటి పేజీలో ప్రచురించాయి. కానీ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల సందర్భంగా వచ్చిన ఈ ప్రకటనను ఇచ్చింది ఆయన రాజకీయ పార్టీ కాంగ్రెస్ కాదు, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.
పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ హోంమంత్రి పి.చిదంబరం కూడా పీవీకి నివాళులు అర్పించారు. పీవీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ “ఆయన నేతృత్వంలో మనం ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలక చర్యలు చేపట్టాం” అన్నారు. “దేశాన్ని శ్రేయస్సు, స్వావలంబన దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి”గా చిదంబరం ఆయనను గుర్తు చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాంగ్రెస్ పార్టీ కూడా ఆదివారం ఒక ట్వీట్ చేసింది. నరసింహారావును ‘దూరదృష్టి గల నేత’గా వర్ణించింది. రాహుల్ గాంధీ కూడా ఒక పోస్టులో ఆయన్ను గుర్తు చేసుకున్నారు. కానీ సోనియా గాంధీ వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడంపై ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తాయి.
అయితే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని పీవీ శతజయంతి వేడుకలను సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెబుతోంది. దానికోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
కానీ తమ పార్టీకే చెందిన ఒక ముఖ్య నేత శతజయంతి వేడుకల గురించి ఆలస్యంగా మేలుకున్న కాంగ్రెస్, దానిని ప్రజల దృష్టి నుంచి దాచలేకపోయింది. స్థానిక మీడియా, సోషల్ మీడియా సోనియా ‘లాబీ’ 1996లో నరసింహారావు అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా తప్పించి, ఆయన స్థానంలో సీతారాం కేసరిని నియమించిన ఘటనలను గుర్తు చేశాయి.

ఫొటో సోర్స్, getty images
దిల్లీలో అంత్యక్రియలూ చేయనివ్వలేదు
రషీద్ కిద్వాయ్ ‘24, అక్బర్ రోడ్’ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన ప్రముఖ జర్నలిస్ట్, మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ఒక విషయం చెప్పారు. తమ సీనియర్ నేతకు దిల్లీలో అంత్యక్రియలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డుకుందో, పీవీ కుటుంబం ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాద్ ఎలా తీసుకెళ్లాల్సి వచ్చిందో గుర్తు చేసుకున్నారు.
‘1991: హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పేరుతో రాసిన తన పుస్తకంలో మాజీ ప్రధానమంత్రి జీవితం గురించి సంజయ్ బారూ చాలా వివరంగా రాశారు.
“వల్లభ్ భాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి, ఇప్పుడు పీవీ నరసింహారావు వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబాలకు సంబంధించని వారిని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూనే వచ్చింది. ముఖ్యంగా ఆ కుటుంబం ఏకఛత్రాధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రయత్నించిన వారిని కచ్చితంగా దూరం పెట్టింది” అని బీజేపీ పార్టీ జాతీయ ప్రతినిధి సుదేశ్ వర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, PIB
పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పీవీ, కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించే విషయం గురించి మాట్లాడారని, సోనియాగాంధీని పార్టీ నుంచి వేరు చేయడానికి ప్రయత్నించారని చాలా మంది చెబుతుంటారు.
పీవీ శతజయంతి సందర్భంగా సోనియా గాంధీ నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గురించి కాంగ్రెస్ గురించి బాగా తెలిసిన తెహ్సీన్ పునావాలా మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ తరఫున, లేదా రాహుల్ గాంధీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించారు. అంటే సోనియా గాంధీ చెప్పడం వల్లే వారు అలా చేసుంటారు. ఎందుకంటే సోనియా పార్టీ అధ్యక్షురాలు అయినా, ఆమె పేరున ట్విటర్ హాండిల్ లేదు. అలాంటప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన సందేశం ఎలా ఇవ్వగలరు” అన్నారు.
కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి కూడా “బీజేపీ ఏదేదో మాట్లాడుతోంది. దేశంలోని గొప్ప వ్యక్తుల్లో పీవీ ఒకరు. ఆయనంటే నా మనసులో చాలా గౌరవం ఉంది” అన్నారు.
బీజేపీ ఆరోపణలపై మాట్లాడిన తెహ్సీన్ పునావాలా “బీజేపీ ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హా లాంటి నేతల పట్ల ఏం చేస్తోందో మొదట చెప్పాలి. వీరంతా పార్టీలో ముఖ్య నేతలుగా ఉండేవారు. కానీ ఇప్పుడు బయటున్నారు. ఎందుకంటే నరేంద్రమోదీకి వారంటే పడదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ముసుగుగా వర్ణిస్తూ ఆర్ఎస్ఎస్ నేత గోవిందాచార్య ఒక ప్రకటన చేసిన తర్వాత ఏం జరిగిందో, రాజకీయాలను నిశితంగా గమనించేవారికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది” అన్నారు.
“బీజేపీ దగ్గర ఎలాంటి ఐకాన్ లేదు. అందుకే వారు సర్దార్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, శాస్త్రీజీ, ఇప్పుడు నరసింహారావు లాంటి వారిని కీర్తిస్తూ, వారిని తమవారుగా ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఒక కాంగ్రెస్ నేత అన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
బీజేపీకి పీవీలో సుగుణాలు కనిపించాయా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసారమైన తన ‘మన్ కీ బాత్’లో పీవీని గుర్తు చేసుకున్నారు. అందరూ ఆయన గురించి ఒక విషయం తెలుసుకోవాలని చెప్పారు. “నిజాం వందేమాతరం పాడడానికి అనుమతించనప్పుడు, పీవీ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు” అన్నారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పీవీ నరసింహారావును బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తుచేసుకున్నారు.
దీనిపై రాజకీయ విశ్లేషకులు రషీద్ కిద్వాయ్ “అవినీతి రహిత భారత దేశం గురించి పదే పదే మాట్లాడే బీజేపీకి పీవీలో ఇన్ని సుగుణాలు ఎప్పటి నుంచి కనిపించడం మొదలైంది. లఖూభాయ్ పాఠక్ అవినీతి కేసు నుంచి, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం, చక్కెర కుంభకోణం, అలాగే మిగతా కేసులన్నిటి గురించి వారు పూర్తిగా మర్చిపోయారా” అని ప్రశ్నించారు.
“నరసింహారావు బాబ్రీ మసీదు కేసు గురించి మాట్లాడుతూ బీజేపీ తనను మోసం చేసిందని చెప్పారు. ఆ విషయం బహుశా ఆ పార్టీ నేతలకు గుర్తులేదేమో. లేదంటే వారు దానిని ఎందుకో పక్కన పెట్టేయాలని అనుకున్నట్టు ఉంది” అన్నారు.

ఫొటో సోర్స్, AFP
పీవీ ప్రశంసలకు పాత్రులేనా?
నెహ్రూ-గాంధీ కుటుంబంతో పడకపోవడంతో పాటూ బాబ్రీ మసీదు విధ్వంసంలో నరసింహారావు పాత్ర, ఆయన సమయంలో జరిగిన కుంభకోణాలతో పార్టీ అసౌకర్యానికి గురైందని కాంగ్రెస్ గురించి బాగా తెలిసినవారు చెబుతున్నారు. ప్రధానమంత్రికి సూట్‌కేసు నిండా డబ్బు పంపించానని ఒక వ్యక్తి ఆరోపించడం చరిత్రలో మొదటిసారి అప్పుడే జరిగిందని అంటున్నారు.
హైదరాబాద్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా పీవీ నరసింహారావు ఉద్యమం చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాత్రం నిజాంను ప్రశంసిస్తూనే ఉంటారు.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్‌ను బీబీసీ దీనిపైనే ప్రశ్నించింది. సమాధానంగా ఆయన “ఒక వ్యక్తిలోని ప్రతికూల అంశాలను ఎప్పుడూ గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు. నిజాం రహదారులు, ఆస్పత్రులు, ఆనకట్టల గురించి కూడా ఆలోచించారనేది నిజం. అవి ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. మనం అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది” అన్నారు.
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో పీవీ పాత్ర గురించి వెల్లువెత్తిన ప్రశ్నలపై మాట్లాడిన ఆయన “అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన జరిగింది, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలోనే. అది కూడా మనం మర్చిపోకూడదు” అన్నారు.
ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కోరారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ విగ్రహాన్ని చాలా నగరాల్లో ఏర్పాటు చేస్తామని, ఆయన పుస్తకాలను ముద్రిస్తామని, ఆయన పేరున స్మారకం ఏర్పాటు చేస్తామని కూడా టీఆర్ఎస్ చెబుతోంది.
మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం “పీవీ ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన ఉదారవాది కారు, మోసాలతో నిండిన కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల్లో ఆయన ఒక భాగం, ఆయన ఏ ప్రశంసలకూ తగరు” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నాన్న అంత్యక్రియలు దిల్లీలో జరగడం ఆమెకు ఇష్టం లేదు’ - పీవీ నరసింహారావు కుమారుడు
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- నెహ్రూ: ‘నేను కేవలం ప్రధానమంత్రిని, ఆమె సంగీత ప్రపంచ మహారాణి’
- తెలంగాణ మూలాలున్న హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఇలా స్థాపించారు
- 'వందేమాతరం' రచయిత బంకిమ్ చంద్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- ఇందిర, ఫిరోజ్‌ల దాంపత్యం: అపోహలు, వదంతులు
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- రాజకీయాలను తలకిందులు చేసిన 5 బలపరీక్షలు
- అభిప్రాయం: వాజ్‌పేయిని కూడా పాకిస్తాన్‌కు పంపుతారా?
- బీజేపీ: అటల్- అడ్వాణీ నుంచి మోదీ-షా వరకు
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








