అభిప్రాయం: వాజ్‌పేయిని కూడా పాకిస్తాన్‌కు పంపుతారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వుసతుల్లా ఖాన్
- హోదా, సీనియర్ పాత్రికేయులు, పాకిస్తాన్ నుంచి బీబీసీ కోసం
భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన సమయంలో ప్రజలు దేశభక్తులుగా, ధీరోదాత్తులుగా భావించేవారిని 'కాలాపానీ'కి పంపేవారు. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమూ లేదు, అండమాన్‌లో కాలాపానీ లేదు. ప్రమాదకరమైన నేరస్తులను నాగ్‌పూర్ లేదా దిల్లీలోని తీహార్ జైలుకు పంపుతున్నారు.
కానీ భారతదేశంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక కొత్త 'కాలాపానీ' ఉనికిలోకి వచ్చింది. దాని పేరే 'పాకిస్తాన్'.
షారుఖ్ ఖాన్‌కు అంత మాట అనే ధైర్యం ఎలా వచ్చింది, అతణ్ని పాకిస్తాన్‌కు పంపేయండి. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్‌కు భారతదేశంలో ఉండాలంటే భయమేస్తోందట. ఆమెను కూడా పాకిస్తాన్ పంపేయండి. ఇలా ఎవరేమన్నా వెంటనే పాకిస్తాన్‌కు పంపేయమనే సూచనలు వినిపిస్తాయి.

ఫొటో సోర్స్, Hindustan Times
సంజయ్ లీలా భన్సాలీకి ఖిల్జీ మీద సినిమా తీయాలనిపిస్తే, పాకిస్తాన్ వెళ్లి తీసుకోమనండి. జేఎన్‌యూలో ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడానికి నిరసనగా నినాదాలు చేసే విద్యార్థులందరినీ పాకిస్తాన్ పంపండి.
వందేమాతరం పాడని దేశద్రోహులంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోండి. ఇది పాకిస్తాన్ కాదు, ఇండియా. ఇక్కడ లవ్ జిహాద్ నడవదు.
హిందుత్వ లేదా మోదీ అంటే ఇష్టం లేని వాళ్లంతా పాకిస్తాన్‌కు వెళ్లిపొండి.
నువ్వు దేశీ గర్ల్‌వి అయ్యుండి, డాలర్ల కోసం మన దేశంలోని హిందువులను తీవ్రవాదులు అనేంతటి దేశ ద్రోహానికి పాల్పడతావా? అరే ఓ ప్రియాంక, పాకిస్తాన్‌కు వెళ్లు. మళ్లీ ముంబైకు రాకు, వింటున్నావా?

ఫొటో సోర్స్, Getty Images
24 గంటలూ టీవీ చూసే రోగం ఉన్న నా స్నేహితుడు అబ్దుల్లా ఇలాంటి వార్తలు చెప్పీచెప్పీ నా బుర్ర తింటుంటాడు.
నిన్న తను మళ్లీ నన్ను ఆపి, ''భయ్యా, భారతదేశంలోని వీళ్లు ఏం మాట్లాడుతున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? వీళ్లు ప్రియాంక, షారుఖ్, అమీర్ ఖాన్.. వీళ్లందరినీ పాకిస్తాన్ పంపించాలనుకుంటున్నారు సరే! కానీ వీళ్లు కరాచీలో జిన్నా సమాధిని సందర్శించిన అడ్వాణీని కూడా పాకిస్తాన్ పంపేయరు కదా?''
''అలాగే పాకిస్తాన్ పర్యటన సందర్భంగా మీనార్-ఎ-పాకిస్తాన్‌ను సందర్శించిన వాజ్‌పేయిని అదే బస్సులో తిరిగి మన పాకిస్తాన్‌కు పంపరు కదా? సింధు జలాల ఒప్పందం కింద ఆరు నదుల్లో మూడు నదులపై పాకిస్తాన్ హక్కులకు అంగీకరించిన నెహ్రూ అస్థికలను పాకిస్తాన్‌కు పంపరుగా?'' అని ప్రశ్నించాడు.

ఫొటో సోర్స్, Getty Images
అతని ప్రశ్నకు సమాధానంగా అలాంటిదేమీ జరగదని అబ్దుల్లాకు భరోసా ఇచ్చాను. ఇదంతా రాజకీయాల్లో సర్వసాధారణమేనని చెప్పాను. ప్రేమకు ఎవరూ వీసాలు ఇవ్వరు. ద్వేషానికి వీసా అవసరం లేదు.
ఈ సమాధానం విని అబ్దుల్లా తల పంకిస్తూ, ''మీరు చెప్పింది నాకు పూర్తిగా బుర్రలోకి ఎక్కలేదు. కానీ, మీరు చెప్పిన విషయంలో వాస్తవం ఉంది.'' అన్నాడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








