ఆస్ట్రేలియా: యూనివర్శిటీని ఖాళీ చేయించిన కుళ్లిన పండు వాసన

డురియన్ ఫలం, ఆస్ట్రేలియా యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

అసలే డురియన్ పండు దుర్గంధం వెదజల్లుతుంటుంది. అలాంటి పండు కుళ్లిపోతే మొత్తం యూనివర్సిటీనే ఖాళీ చేయించాల్సిన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీలో సంభవించింది.

ప్రమాదకరమైన గ్యాస్ లీకైందన్న అనుమానంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన సుమారు 5 వందల మంది విద్యార్థులు, అధ్యాపకులను యూనివర్సిటీ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించారు.

అయితే తర్వాత ఆ వాసన ఓ కప్‌బోర్డులో ఉంచిన కుళ్లిపోయిన డురియన్ పండు నుంచి వెలువడుతోందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

డురియన్ ఫలం చాలా ఘాటైన దుర్గంధం వెదజల్లుతుంటుంది. అయితే అది చాలా మధురమైన ఫలం. సాధారణంగా ఇది ఆగ్నేయాసియా దేశాలలో లభిస్తుంది.

డురియన్ పళ్లు కొబ్బరి బొండం పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆకుపచ్చని రంగులో ఉండి, పనసపళ్లకు ఉన్నట్లు వాటిపై బుడిపెలు ఉంటాయి.

వీటి ఘాటైన వాసన కారణంగా సాధారణంగా వాటిని హోటళ్లలో, రవాణాలో అనుమతించరు.

డురియన్ ఫలం, ఆస్ట్రేలియా యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ద్వారా ఆ కుళ్లిన పండు వాసన మొత్తం క్యాంపస్ అంతా వ్యాపించడంతో హడలిపోయిన యూనివర్సిటీ అధికారులు గ్యాస్ లీకైందని భావించి, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది కిందామీదా పడి అది డురియన్ పండు నుంచి వస్తోందని తేల్చారు.

ఆ వాసన వెలువడుతున్న భవనంలోనే ప్రమాదకరమైన రసాయనాలు కూడా నిల్వ ఉంచడం వల్ల, ఇలాంటి అనుమానం తలెత్తిందని యూనివర్సిటీ అధికారులు వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)