ఎర్త్ డే: ధరిత్రి దినోత్సవం ఎప్పుడు మొదలైంది, ఇప్పటిదాకా సాధించిందేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో 1970లో మొదలైన ఎర్త్ డే కార్యక్రమం ఇప్పుడు ప్రపంచమంతటా గుర్తింపు పొందింది.
ఎర్త్ డే అంటే ఏమిటి?
ఏటా ఏప్రిల్ 22న ఎర్త్ డే జరుపుకుంటారు.
పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యాన్నిఎర్త్‌డే తెలియజేస్తుంది.
యుఎస్ సెనేటర్, పర్యావరణవేత్త గేలార్డ్ నెల్సన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి డెనిస్ హేస్ కలిసి 1970లో దీనిని ప్రారంభించారు.
కాలిఫోర్నియాలోని శాంటాబార్బారాలో 1960లో జరిగిన చమురు లీకేజీల్లాంటి ఘటనల కారణంగా అమెరికాలో పర్యావరణానికి కలుగుతున్న నష్టం వారిద్దరిని ఆందోళనకు గురి చేసింది.
దీంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి వీరిద్దరూ ఎర్త్ డేను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ఎర్త్ డే సందర్భంగా అమెరికావ్యాప్తంగా రెండు కోట్ల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
1990లో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు ఏటా దాదాపు 200 దేశాలలో కోటిమందికిపైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
‘‘చాలామంది ప్రజలు పర్యావరణానికి సంబంధించి చేసే మొదటి పని ఎర్త్ డేని జరుపుకోవడమే’’ అని ఎర్త్‌డే.ఓఆర్‌జి అధ్యక్షుడు కేథ్లీన్ రోజర్స్ చెప్పారు.
‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్’
ప్లాస్టిక్ కాలుష్యం మానవాళికి, భూగోళ ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో చెప్పేందుకు ఈ ఏడాది ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్’’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు.
వాతావరణ మార్పులు, చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, క్లీన్ ఎనర్జీ నుంచి జీవులను రక్షించడం తదితర అంశాలను గతంలో ఎర్త్ డే థీమ్స్‌గా తీసుకున్నారు.
2040 నాటికల్లా ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలకాలని యూకే సహ 50కు పైగా దేశాలు పిలుపునిచ్చాయి.
ఎర్త్ డే నిర్వాహకులు మరో అడుగు ముందుకు వేసి 2040 నాటికల్లా అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను 60 శాతం తగ్గించాలని కోరుతున్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడంతో పాటు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎర్త్ డే సాధించిందేమిటి?
1970లో ఎర్త్ డే మొదలైన కొన్నేళ్ళకే అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అనేక పర్యావరణ చట్టాలను తీసుకువచ్చారు. క్లీన్ ఎయిర్ యాక్ట్ లాంటి వాటిని ఏర్పాటుచేసి, వాటిని చెప్పుకోదగ్గ స్థాయులో బలోపేతం చేశారు.
ఇటీవల కాలంలో లక్షలాది మొక్కలు నాటడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా నిలవడంతో పాటు, ప్రపంచమంతటా వాతావరణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
జాతీయ, అంతర్జాతీయ ఎజెండాలో పర్యావరణ సమస్యలు చోటు దక్కించుకోవడానికి ఎర్త్ డే కీలక పాత్ర పోషిస్తోందని కొందరు పరిశీలకులు ఉదహరిస్తున్నారు.
‘‘అనేక సమస్యలపై సమాజ ప్రాథమ్యాల కారణంగా వాతావరణ సవాళ్ళు అట్టడుగున పడుతున్నాయి. కానీ ఎర్త్ డే మనం దీర్ఘకాలంలో ఎదుర్కోబోయే నష్టాలను గుర్తించేలా చేస్తోంది’’ అని ఐక్యరాజ్యసమితి మాజీ వాతావరణ చీఫ్ వైవో డి బోయర్ చెప్పారు.
2015 చివరిలో కుదిరిన చారిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేయడానికి 2016 ఎర్త్ డేను అధికారికంగా ఎంచుకున్నారు.
గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా అంగీకరించిన మొదటి సందర్భమది.
విమర్శకులు ఏమంటున్నారు?
మానవ కార్యకలాపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు జీవులు అంతరించిపోతున్నాయని అనేకమంది పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
ఈ ధోరణులను నిలువరించడానికి జరుగుతున్న ప్రయత్నాలు చాలవని అంటున్నారు.
కొంతమంది వ్యక్తులు, కంపెనీలు నిజంగా అవసరమైన అసలైన మార్పులను చేయకుండా ఎర్త్ డేను ఒక అవకాశంగా తీసుకుని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
దీనినే ‘గ్రీన్ వాషింగ్’ అంటున్నారు.
2022లో పర్యావరణ ప్రచారకర్త గ్రేటా థన్బర్గ్ ఓ ట్వీట్ చేశారు.
‘‘అధికారంలో ఉన్నవారికి ఈ గ్రహంపై ప్రేమను చాటుకునేందుకు ఎర్త్ డే ఒక అవకాశంగా మారింది. కానీ అదే సమయంలో దానిని నాశనం చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.
‘‘గ్రీన్ వాషింగ్ జరుగుతోందని మనందరికీ తెలుసు. అది ఆగ్రహాన్ని కలిగిస్తోంది’’ అని ఎర్త్ డే నిర్వాహకులు రోజర్స్ బీబీసీ న్యూస్‌కు తెలిపారు.
‘‘దీనికి మనం కారణం కాదు. కానీ కొంతమంది వ్యాపారులు తమ స్వప్రయోజనాల కోసం ఎర్త్ డే ను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘వినియోగదారులకు అన్యాయం చేసే ఏ వ్యాపారమైనా, పరిశ్రమపైనైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పరోటాలు రోజూ తింటే ఏమవుతుంది? మైదాపిండిపై ఉన్న అపోహలు, వాస్తవాలు
- దుబయ్ వరదలు: ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులో ఎందుకు పడింది?
- రెండు బస్సుల సైజున్న ఆ జీవి ఎముకలు బీచ్‌లో దొరికాయి, ఏమిటా జంతువు?
- పాకిస్తాన్: ‘సైన్యం మమ్మల్ని చితకబాదింది, ఏ మొహంతో డ్యూటీ చేయగలం’ అని అక్కడి పోలీసులు ఎందుకు వాపోతున్నారు?
- ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జోర్డాన్ ఎందుకు జోక్యం చేసుకుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














