కారున్న వారికీ ఆరోగ్యశ్రీ వర్తింపు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం కారు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులేనని ఈనాడు కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో ఎంతోమంది పేదలకు ఉపయుక్తంగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకంలోకి మరింత మందికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం వార్షికాదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంచారని ఈనాడు చెప్పింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం 12 ఎకరాల లోపు మాగాణి, 35 ఎకరాల లోపు మెట్ట భూమి, లేదా మాగాణి-మెట్ట కలిపి 35 ఎకరాలు లోపు ఉంటే వారికి ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.
వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే లేదా రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారు (ఆదాయ పన్ను పరిధిలో ఉన్నప్పటికీ) ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.
3 వేల చదరపు అడుగులు లేదా 334 చదరపు గజాలలో ఇల్లు ఉండి ఆస్తిపన్ను చెల్లించేవారు కూడా ఆరోగ్య శ్రీకి అర్హులే.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, పించనర్లు కాకుండా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ఒప్పంద, పొరుగు సేవలు, పార్ట్ టైం, గౌరవ వేతనం తీసుకునే ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చెప్పినట్లు ఈనాడు ప్రచురించింది.
కుటుంబం లేదా ఒక ఇంటికి ఒక కారు ఉన్న వారు (వ్యక్తిగతం) కూడా ఆరోగ్య శ్రీకి అర్హులేనని ఇందులో చెప్పారు.
ప్రస్తుతం బియ్యం కార్డులు, వైఎస్ఆర్ పించన్ కానుక కార్డు, జగనన్న విద్య, వసతి దీవెన కార్డుదారులకు ఆరోగ్య శ్రీ వర్తింప జేస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook/Telangana CMO
భూ వివాదాల్లో తలదూర్చద్దు - ముఖ్యమంత్రి కేసీఆర్
భూ వివాదాల్లో సమస్యలు కొనితెచ్చుకోవద్దని తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి కథనం చెప్పింది.
''ఒక్కో భూమిని నలుగురైదుగురు క్లెయిమ్ చేస్తున్నారు. ఏదో ఒక పక్షం వైపు ఉండి వివాదాలు కొని తెచ్చుకోవద్దు. భూముల వివాదాలకు దూరంగా ఉండండి'' అని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ సభ్యులు ఎవరైనా వివాదాస్పద భూ లావాదేవీలు చేసి ఉంటే, వెంటనే పరిష్కరించుకుని పక్కకు జరగాలని, లేకపోతే, భవిష్యత్తులో ఆ వివాదం మీ మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు.
"అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్య కేసు నిందితుడితో తాజా, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విపక్షాలు కూడా ఓ ప్రజా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాయి. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమకు సంబంధం లేదని ప్రకటనలు చేశారు. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు" అని ఆంధ్రజ్యోతి కథనంలో చెప్పింది.
తహసీల్దార్ హత్య తర్వాత గత 10 రోజులుగా దాదాపు 20 మందికిపైగా ప్రజా ప్రతినిధులు సీఎంను కలిశారు. వారిలో కీలకమైన వారినందరినీ సీఎం అప్రమత్తం చేశారు.

ఫొటో సోర్స్, facebook/Andhra Pradesh CM
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి- ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని వైసీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేసినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం ఎంపీలకు సూచించారు.
లోక్‌సభలో వైఎస్సార్ సీపీ నాలుగో పెద్ద పార్టీ అని గుర్తు చేస్తూ మన బలాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలని ఆయన ఎంపీలను కోరారు.
పోలవరం సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోసం కృషి చేయాలని, విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చేలా కేంద్రాన్ని గట్టిగా కోరాలని సూచించారని సాక్షి చెప్పింది.
ఈనెల 18వతేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని ఈ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో అద్దె బస్సుల టెండర్లు పూర్తి
తెలంగాణలో అద్దె బస్సుల కోసం జారీ చేసిన టెండర్లు పూర్తి అయినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు 1,035 అద్దెబస్సుల కోసం జారీచేసిన టెండర్లు ముగిశాయని తెలంగాణ ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు వెల్లడించారు.
టీఎస్ ఆర్టీసీలోకి అద్దెబస్సులను తీసుకునే టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ టీఎస్ ఆర్టీసీ కార్మికసంఘ్ దాఖలుచేసిన పిటిషన్‌లో సునీల్‌శర్మ శుక్రవారం కౌంటర్ దాఖలుచేశారు.
అక్టోబర్ 14న టెండర్ నోటిఫికేషన్ వేశామని, అదే నెల 21తో గడువు ముగియడంతో అదేరోజు టెండర్లను ఓపెన్ చేశామని చెప్పినట్లు నమస్తే తెలంగాణ చెప్పింది.
విజయవంతంగా టెండర్లు దక్కించుకున్న 287 మంది బిడ్డర్లకు అలాట్‌మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.
ఆర్టీసీలో 20% అద్దెబస్సులు ఉండాలన్న నిబంధనను మారుస్తూ 2013లోనే ఆర్టీసీ బోర్డు తీర్మానం చేసిందని పేర్కొన్నారు.
పిటిషనర్ బస్సు యజమాని లేదా టెండర్లలో పాల్గొన్న బిడ్డర్ కానందున టెండర్ నోటిఫికేషన్‌ను సవాలుచేసే హక్కు లేదని, ఈ మేరకు పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించారు.
టీఎస్ఆర్టీసీ ఆర్థికంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని, రూ.5 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్నందున కొత్తబస్సులు కొనే పరిస్థితి లేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా నడిపేందుకు 1,035 బస్సులను హైర్ నిబంధనల కింద తీసుకుంటున్నట్టు వివరించారని కథనం చెప్పింది.
ఆర్టీసీ యాక్ట్ 1950 సెక్షన్ 34 (1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే టెండర్ల ప్రక్రియ చేపట్టామని సునీల్ శర్మ హైకోర్టుకు స్పష్టంచేశారని ఇందులో వివరించారు.
ఇవి కూడా చదవండి
- మా అమ్మకు వరుడు కావలెను
- భాయిచంద్ పటేల్: 'ఆ అమ్మాయిలకు తిరగడానికి తెల్లవాళ్ళు, పెళ్లికి మాత్రం మనలాంటి వాళ్లు కావాలి'
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- అయోధ్య కేసు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా?
- టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?
- షావొమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్: పిక్సెల్ పెరిగితే ఫొటో క్వాలిటీ పెరుగుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








