పుతిన్ సన్నిహితుడి రూ.4,700 కోట్ల విలాసవంతమైన నౌక.. ఆంక్షలు ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధిని ఎలా దాటగలిగింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, హ్యారీ సికులెక్, యారోస్లావ్ లుకివ్
- చదివే సమయం: 5 నిమిషాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన ఒకరికి చెందిన విలాసవంతమైన నౌక (సూపర్ యాట్) హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించింది.
అమెరికా ఈ కీలక జలమార్గాన్ని దిగ్బంధించినప్పటికీ ఈ నౌక ప్రయాణించగలగడం చర్చనీయమైంది.
మరోవైపు, హార్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఏ నౌక కూడా ఇక్కడి నుంచి వెళ్లలేదని ఇరాన్ కూడా ప్రకటించింది.
దాదాపు 142 మీటర్ల (465 అడుగులు) పొడవున్న 'నార్డ్' అనే ఈ యాట్ ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా బిలియనీర్ అలెక్సీ మోర్దాషోవ్‌కు చెందినదిగా చెబుతున్నారు.

దుబయి నుంచి ఒమన్‌లోని మస్కట్ వరకు ప్రయాణించిన ఈ విలాసవంతమైన నౌక ఇటీవలి కాలంలో హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించిన అతికొద్ది నౌకలలో ఒకటి.
మరోవైపు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే విషయంలో అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, ఇరాన్ ఈ వారంలో రష్యాతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది.

ఫొటో సోర్స్, Lam Yik/Bloomberg via Getty Images
ఈ షిప్ పరిమాణం, ధర ఎంత?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంది.
కాగా రష్యా జెండాతో ఉన్న ఈ నౌకకు అధికారిక యజమానిగా మోర్దాషోవ్ పేరు ఎక్కడా నమోదు కాలేదు.
అయితే, 'నార్డ్' రికార్డుల ప్రకారం 2022లో ఇది మోర్దాషోవ్ భార్యకు చెందిన ఒక కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.
'నార్డ్' విలువ 50 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. అంటే సుమారు 4,700 కోట్ల రూపాయలు.
మెరైన్ ట్రాఫిక్ ప్లాట్‌ఫామ్ డేటా ప్రకారం 'నార్డ్' శుక్రవారం రాత్రి దుబయి నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం ఒమన్ రాజధానిలోని 'అల్ మౌజ్ మెరీనా'కు చేరుకుంది.
ట్రాకర్‌లో చూపిన మార్గం సాధారణంగా ఇరాన్ అంగీకారంతో ప్రయాణించే నౌకలు ఉపయోగించే మార్గమే.
అయినప్పటికీ, 'నార్డ్' ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇరాన్ నుంచి అనుమతి పొందిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ మోర్దాషోవ్?
మోర్దాషోవ్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఉక్కు, మైనింగ్ కంపెనీ 'సెవెర్‌స్టాల్' ద్వారా సంపాదించారు. ఈ రంగంలో రష్యాలోనే అతిపెద్ద కంపెనీలలో సెవెర్‌స్టాల్ ఒకటి.
సుమారు 37 బిలియన్ డాలర్ల (రూ.3.10 లక్షల కోట్లు) ఆస్తి అంచనాతో, అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' ఆయన్ను అత్యంత ధనవంతుడైన రష్యన్ పౌరుడిగా పేర్కొంది.
ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధి మీదుగా సాగే సముద్ర రవాణాపై ఇరాన్ కఠినమైన ఆంక్షలు విధించింది.
హార్ముజ్ సమీపంలోకి వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని ఈ నెల ప్రారంభంలో ఇరాన్ హెచ్చరించింది.
దీని తర్వాత, ఇరాన్ ఓడరేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను తన సైన్యం అడ్డుకుంటుందని లేదా తిరిగి పంపివేస్తుందని అమెరికా ప్రకటించింది.
మెరైన్ ట్రాఫిక్ డేటాలో చూపిన 'నార్డ్' మార్గాన్ని బట్టి, ఈ యాట్ ఇరాన్‌లో ఎక్కడైనా ఆగిందా లేదా అనే సంకేతాలేవీ కనిపించడం లేదు.
అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకారం, ఈ నౌక చివరిగా రిపోర్ట్ చేసిన ప్రదేశానికి మరింత తూర్పు వైపు నుంచి దిగ్బంధనం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.
గల్ఫ్ దేశాల ఈ సముద్ర మార్గంలో సాగే రవాణా ప్రస్తుతం యుద్ధానికి ముందున్న స్థాయితో పోలిస్తే చాలా తగ్గిపోయింది.
ఈ సంఘర్షణ కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం నాడు గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ 'బ్రెండ్ క్రూడ్' ధర బ్యారెల్‌కు 109 డాలర్ల (సుమారు రూ.9,150)కు చేరింది.

ఫొటో సోర్స్, EPA
ఆ నౌకలో ఏయే సౌకర్యాలు ఉన్నాయి?
'సూపర్ యాట్ టైమ్స్' పత్రిక ప్రకారం, 'నార్డ్'లో స్విమ్మింగ్ పూల్, సబ్ మెరైన్, హెలిప్యాడ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.
2022లో రష్యా యుక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా పాశ్చాత్య దేశాలు మోర్దాషోవ్‌పై ఆంక్షలు విధించాయి.
గతంలో పాశ్చాత్య దేశాలు విజ్ఞప్తి చేసినప్పటికీ హాంకాంగ్, మాల్దీవులు 'నార్డ్'ను స్వాధీనం చేసుకోవడానికి నిరాకరించాయి.
2022 మార్చిలో మోర్దాషోవ్‌కు చెందిన 'లేడీ ఎమ్' అనే మరో చిన్న నౌకను ఇటలీ పోలీసులు ఇంపీరియా ఓడరేవు వద్ద జప్తు చేశారు. ఇది 65 మీటర్ల (215 అడుగుల) పొడవు ఉంటుంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి విధించిన ఆంక్షల కింద, పలువురు రష్యన్ బిలియనీర్ల నౌకలను యూరోపియన్ ఓడరేవుల్లో స్వాధీనం చేసుకోవడమో లేదా వాటి ప్రవేశాన్ని నిలిపివేయడమో జరిగింది.
దీని కారణంగా, అటువంటి విలాసవంతమైన నౌకలు ఆంక్షల పరిధిలోకి రాని మిడిల్ ఈస్ట్, ఆసియా ప్రాంతాల్లోని ఓడరేవుల వైపు మళ్లుతున్నాయి.
అమెరికాతో ఇరాన్ జరుపుతున్న శాంతి చర్చలు ప్రస్తుతం నిలిచిపోవడంతో, ఈ వారంలో తన మిత్రదేశమైన రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరాన్ దృష్టి సారించింది.
సోమవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్ ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇరు దేశాల మధ్య ఉన్న 'వ్యూహాత్మక సంబంధాలను' కొనియాడారు.
అరాగ్చీ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న చిత్రాలలో ఆయన పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లతో నవ్వుతూ కరచాలనం చేస్తూ కనిపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































