శబరిమల: తొడలు కనిపించే ఫొటో' పెట్టారని రెహనా అరెస్ట్

రెహనా అరెస్ట్

ఫొటో సోర్స్, REHANA FATHIMA

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత నెలలో కేరళ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైన మహిళను పోలీసులు 'అశ్లీలత ప్రదర్శించే' ఫొటో పోస్ట్ చేశారనే ఆరోపణలపై ఆరెస్టు చేశారు.

32 ఏళ్ల రెహనా ఫాతిమా శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకున్న సమయంలో ఫేస్‌బుక్‌లోని ఆమె పేజీలో ఒక సెల్ఫీ పెట్టారని, ఆ ఫొటోలో ఆమె తొడలు కనిపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

రెహనా టెలిఫోన్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఒక మోడల్ కూడా. ఇదే ఏడాది అక్టోబర్‌లో రెహనా, మరో మహిళా జర్నలిస్టుతో కలిసి పోలీసు రక్షణతో శబరిమల చేరుకున్నారు. ఆలయం ప్రధాన ద్వారం వరకూ చేరుకోగలిగారు. కానీ అయ్యప్ప భక్తులు వ్యతిరేకించడంతో ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు.

శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా భావిస్తారు. అందుకే రజస్వల వయసులో అంటే 10 ఏళ్ల నుంచి నెలసరి అయ్యే 50 ఏళ్ల మహిళల వరకూ ఆలయంలోకి ప్రవేశించకూడదని చెబుతారు.

కానీ ఇదే ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని తొలగించింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించవచ్చని తీర్పు చెప్పింది.

రెహనా అరెస్ట్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

14 రోజుల కస్టడీకి రెహనా

ఈ తీర్పు వచ్చి సుమారు రెండు నెలలు గడిచిపోయాయి. కానీ హిందూ విశ్వాసాలను గౌరవించే భక్తులు వ్యతిరేక ప్రదర్శనలతో ఇప్పటివరకూ మహిళలు ఆలయంలో ప్రవేశించలేకపోయారు.

రెహనాను మంగళవారం కొచ్చిలోని ఆమె ఆఫీసులో అరెస్టు చేసినట్లు రెహనా స్నేహితురాలు, మానవ హక్కుల కార్యకర్త ఆర్తి బీబీసీకి చెప్పారు.

రెహనాపై ఉన్న ఆరోపణలపై విచారణ కోసం జడ్జి ఆమెను 14 రోజులు కస్టడీకి పంపించారు. మత విశ్వాసాలకు భంగం కలిగించిందని కూడా ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

రెహనా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌లో పని చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

రెహనా అరెస్ట్

ఫొటో సోర్స్, AFP

రెహనాపై ఏ కేసు పెట్టారు

గత నెల శబరిమల వెళ్లే దారిలో రెహనా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె నల్ల దుస్తుల్లో (అయ్యప్ప భక్తులు నల్ల రంగు దుస్తులు ధరిస్తారు) ఉన్నారు.

రెహనా అరెస్ట్

ఫొటో సోర్స్, REHANA FATHIMA

రెహనా నుదుటిపై విభూది కూడా ఉంది. ఆమె తన దుస్తులను మోకాళ్ల వరకూ మడిచారు. ఈ ఫొటోతో ఆమె అయ్యప్ప స్వామి భంగిమను అవమానించారని కొందరు ఆరోపించారు.

'అశ్లీలత ప్రదర్శించే' ఫొటో పోస్ట్ చేయడం, 'అయ్యప్ప భక్తుల మనోభావాలకు భంగం కలిగించినట్టు' ఫిర్యాదులు రావడంతో రెహనాపై కేసు నమోదు చేశారు.

రెహనా ఈ నెల మొదట్లో పోలీసులు తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ ఒక దిగువ కోర్టులో అపీల్ చేశారు. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టివేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.

రెహనా బెయిల్ కోసం అప్లై చేసినట్టు ఆమె కుటుంబం గురువారం తెలిపింది.

రెహనా అరెస్ట్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

పురుషులది అశ్లీలత కాదా?

రెహనా ఏ మత విశ్వాసాలకు భంగం కలిగించాలని అనుకోలేదని, ఎలాంటి అశ్లీల పనులు చేయలేదని ఆమె స్నేహితురాలు ఆర్తి బీబీసీకి చెప్పారు.

"ఛాతీ ప్రదర్శిస్తూ, తొడలు చూపిస్తూ శబరిమల వెళ్లే పురుషులను పట్టించుకోరా?, అలా చేయడాన్ని అశ్లీలతగా ఎందుకు భావించరు" అని ఆమె ప్రశ్నించారు.

"ముస్లిం అయిన రెహనా అయ్యప్ప స్వామి భక్తురాలినని చెప్పుకోవడం వల్లే కొన్ని హిందుత్వ సంస్థలు ఆమెపై కోపంగా ఉన్నాయని" ఆర్తి చెప్పారు.

రెహనా తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు ఎన్నో అభ్యంతరకరమైన కామెంట్లు వచ్చాయని ఆర్తి చెప్పారు. కొందరు అత్యాచారం చేస్తామని కూడా ఆమెను బెదిరించారని తెలిపారు.

మహిళల కోసం ఆలయం తలుపులు తెరవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపై కేరళతోపాటు దేశమంతా రెండు సెక్షన్లుగా చీలిపోయింది.

రెహనా అరెస్ట్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వేలాది ఆందోళనకారులు మహిళా భక్తులను అడ్డుకోవడం కోసం రహదారులపైకి వచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ ఆందోళనల సమయంలో మహిళలపై దాడులు జరిగాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి.

మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో చాలా మందిని వదిలిపెట్టగా, కొంతమంది ఇఫ్పటికీ జైళ్లలోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)