ఎవరి శవపేటికను వాళ్లే తయారు చేసుకుంటున్నారు

శవ పేటిక

మీ శవపేటికను మీరే తయారు చేసుకుని, వాటికి రంగులు వేసుకుంటారా? వినడానికే కాస్త విడ్డూరంగా ఉంది కదూ. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది ఆ పని చేస్తున్నారు. అలా చేసుకోవాలని అనుకునేవారి కోసం కొన్ని క్లబ్‌లు కూడా ఉన్నాయి. శవపేటికల క్లబ్‌లు ఏర్పాటు చేసే ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.

అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో ఈ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలా న్యూజీలాండ్‌లోని రొటోరా ప్రాంతంలో ఉన్న ఒక క్లబ్‌ను బీబీసీ సందర్శించింది. తమ సొంత శవపేటికలను తయారు చేసుకునేందుకు కొందరు వారంవారం ఇక్కడికి వస్తుంటారు.

అలాంటి వాళ్లలో బార్బరా ఒకరు. 'నాకు పిల్లులంటే చాలా ఇష్టం. అందుకే మేగజీన్లు, ఫొటోలు, క్యాలెండర్ల నుంచి సేకరించిన పిల్లుల చిత్రాలతో నా శవపేటికను అలంకరించాను' అని చెబుతారామె తన కోసం తయారు చేసుకున్న శవపేటికను చూపిస్తూ.

బార్బరా తన కోసం తయారు చేసుకున్న శవ పేటిక
ఫొటో క్యాప్షన్, బార్బరా తన కోసం తయారు చేసుకున్న శవ పేటిక

''రేసింగ్‌ పోటీల్లో ముగింపు రేఖ దగ్గర ఊపే జెండాతో నా శవపేటికను తీర్చిదిద్దాలని నిర్ణయించాను. నేను బాగా ఇష్టపడే మోటార్ కార్ రేసింగ్‌తో దీనికి సంబంధం ఉంది. ఇది నా జీవిత ప్రయాణానికి ముగింపును సూచిస్తుంది. ఈ వయసులోనూ నేను చాలా అంత్యక్రియలకు హాజరవుతున్నాను. చాలావరకు అవి మామూలుగానే జరుగుతున్నాయి. కొందరు మాత్రం తమ శవపేటికలను అలంకరించుకోవడం చూశాను. నాకు కూడా వాళ్లలా చేసుకోవాలని అనిపించింది'' అని వివరిస్తారు టోనీ అనే మరో వ్యక్తి.

ఇలా శవపేటికలు తయారు చేసుకోవాలనే వారితో ఒక క్లబ్బును ఏర్పాటు చేయాలనే ఆలోచన మొదట గతంలో నర్సుగా పనిచేసిన కేటీ విలియమ్స్‌ అనే మహిళకు కలిగింది.

''నా ఆలోచన గురించి చెప్పగానే మొదట ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ, కొంత కాలం తర్వాత నన్ను

కలిసేందుకు క్యూ కట్టారు. వారంతా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి ఎలా తేరుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డవారు. నా మాటలు విన్న తర్వాత… 'అలాంటి విషయాల గురించి మాట్లాడటం మంచిదే కదా' అని వారు ఆలోచించారు. మనం పుట్టుకను వేడుకలా జరుపుకుంటాం. కానీ, జీవితానికి ముగింపు అయిన చావును మాత్రం శోకంతో జరుపుకుంటాం. చావును కూడా వేడుకలా చేసుకోవాలన్నది నా భావన'' అంటారు కేటీ.

ఎవరి శవపేటికను వాళ్లే ఎందుకు తయారు చేసుకుంటున్నారో ఈ వీడియోలో చూడండి

వీడియో క్యాప్షన్, ఎవరి శవపేటికను వాళ్లే తయారు చేసుకుంటున్నారో ఈ వీడియోలో చూడండి

ఈ క్లబ్‌ సభ్యులకోసం తయారీదారులు చాలా తక్కువ ధరకే శవపేటికలను అందిస్తారు.

''బయట కొనాలంటే శవపేటికల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి అంత ఖర్చు పెట్టే స్థోమత ఉండదు. ఇక్కడయితే తక్కువకే అవి దొరుకుతాయి. పైగా, మనకు నచ్చిన విధంగా మన శవపేటికలను ఇక్కడ తయారు మార్చేసుకోవచ్చు'' అంటారు అన్నేకీ అనే మరో సభ్యురాలు.

అయితే, ఇది కేవలం శవపేటికలకు సంబంధించిన క్లబ్బు మాత్రమే కాదు. కాస్త వయసు మీదపడినవారు కలుసుకొని మాట్లాడుకునేందుకు ఇదో చక్కని ప్రదేశం. ప్రతి బుధవారం ఇక్కడికి చాలామంది వస్తారు. వారు మాట్లాడుకునేందుకు చుట్టూ జనాలు ఉంటారు. కొన్నిసార్లు ఇక్కడికి రావడం వారికి ఒక విహార యాత్రలా కూడా అనిపిస్తుంది.

కేటీ ఆలోచనల ఫలితమే ఈ క్లబ్
ఫొటో క్యాప్షన్, కేటీ ఆలోచనల ఫలితమే ఈ క్లబ్

కేటీ విలియమ్స్‌కు ఈ ఆలోచన వచ్చిన తర్వాత గడిచిన పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్లబ్‌లు చాలా ఏర్పాటయ్యాయి.

''చివరిసారి నాకు గుర్తున్నంత వరకు యాభై దేశాల నుంచి యాభై మంది నాతో టచ్‌లో ఉన్నారు. మరణానికి సంబంధించి ఆయా దేశాల్లో అనుసరించే సంప్రదాయాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అక్కడి 'కాఫిన్ క్లబ్' సభ్యులు వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఇలాంటి క్లబ్‌లు చాలా ప్రారంభమయ్యాయి. ఈ ట్రెండ్ ఇంగ్లండ్‌లో బాగుంది. చైనా, జపాన్‌ దేశాల్లోనూ ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. వారిని చూసి చాలా గర్వపడుతున్నాను. మా ఆలోచన చాలా చక్కగా పనిచేస్తోంది'' అంటారు ఈ కాఫిన్ క్లబ్‌లకు ప్రాణం పోసిన కేటీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)