ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు

ఫొటో సోర్స్, TRENT LAWSON/TMANADVENTURE
- రచయిత, షైమా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ ఆస్ట్రేలియాలోని కంగారూ ఐలాండ్‌ను దాని జీవావరణానికి ప్రత్యేకం. కానీ భయంకరమైన కార్చిచ్చు ఈ వారం ఆ దీవిని చుట్టుముట్టిన తర్వాత అది ఇక కోలుకోలేదేమోనని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారం క్రితం తన ఇంటిని, కుటుంబాన్ని, జంతువులను కాల్చేస్తాయేమో అనేంతగా భయపెట్టిన అగ్ని కీలలను గుర్తుచేసుకున్న శామ్ మిచెల్.. ‘మీరు దూరం నుంచే అక్కడ ఆ మంటలు చూడచ్చు’ అన్నారు.
శామ్ కంగారూ ఐలాండ్ వైల్డ్ లైఫ్ పార్కును చూసుకుంటూ ఉంటారు. తన భార్య, 19 ఏళ్ల కొడుకుతో అక్కడే ఉంటున్నారు. మంటలు ఇంటి దగ్గరికి రాగానే, ఖాళీ చేయమనే హెచ్చరికలు వచ్చాయి.
20 నిమిషాల్లో మొత్తం బూడిదైందని శామ్ చెప్పాడు. కానీ శామ్, ఆయన మరో నలుగురు అక్కడే ఉండిపోయారు.

‘‘మనం దున్నలు, నిప్పుకోళ్లు, కాస్సోవరీ(నిప్పుకోడి లాంటి పక్షి)లు లాంటివి ఉన్న 800 జంతువులను కదిలించలేం కదా. మేం వాటిని తరలించలేకపోయినా, మనకు అవి కనిపిస్తే, వాటిని కాపాడాలని అనుకున్నాం. మాకు ఆర్మీ సాయం చేస్తోంది. ఎలాగోలా మేం బతికాం. కానీ మా చుట్టూ ఇది మండుతూనే ఉంది’’ అని శామ్ అన్నారు.
జనవరి 9న రెండోసారి వచ్చిన పెద్ద మంట కంగారూ ఐలాండ్‌ను వారంలోపే చుట్టేసింది. జనవరి 4న కార్చిచ్చులో ఇద్దరు పురుషులు చనిపోయారు. హైవేపై వెళ్తున్నప్పుడు మంటలు చుట్టుముట్టడంతో వారు కాలిపోయారని అధికారులు భావిస్తున్నారు.
కంగారూ ఐలాండ్‌లో మంటల వేగం, అవి వ్యాపించిన షాకింగ్‌గా ఉంది.
తన పార్కును కాపాడుకోగలిగిన శామ్‌కు తను కొడుకును పంపించిన కింగ్‌స్కోట్ టౌన్‌కు మంటల ముప్పు ఉందని తెలిసింది.
‘‘నేను తనను సురక్షితమైన చోటుకు పంపించానని అనుకున్నా, ఆ మంట మమ్మల్ని వదిలి వాళ్ల వైపు వెళ్తున్నట్టు తెలిసింది. మంటలు కింగ్‌స్కోట్‌కు చాలా దగ్గరగా వచ్చాయి. కానీ టౌన్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. ఆ మాట చెబుతున్నప్పుడు శామ్ కళ్లు వెనక పార్కులో ఆడుకుంటున్న కొడుకు మీదే ఉన్నాయి. మన చుట్టూ మంటలు చుట్టుముట్టిన సమయంలో, అవేవీ తెలియని తను అమాయకంగా ఆడుకోవడం చూస్తుంటే చాలా కష్టంగా ఉంది’’ శామ్ అన్నారు.

విధ్వంసపు జాడలు
కంగారూ ఐలాండ్‌లో తగలబడిన అడవుల మధ్యలో దారిలో వెళ్తుంటే కొన్ని వరుసల చెట్లు నల్లగా మసిబారి ఉన్నాయి. వాటిలో కొన్ని ఇంకా మండుతూనే ఉన్నాయి. కింద నేలంతా పొగ చూరి నల్లగా మారిపోయుంది.
బొగ్గులా మారిన పది పన్నెండు కోలా, కంగారూల కళేబరాలు రోడ్డుకు పక్కన పడి ఉన్నాయి.
ఈ జీవావరణ విధ్వంసం చాలా పెద్దది. సైన్యాన్ని పిలిపించారు. మంటల్లో చనిపోయిన వేలాది పశువులు, గొర్రెల కోసం కొంతమంది గుంతలు తీయడానికి సాయం చేశారు.

దీవికి పశ్చిమంగా హాన్సన్ తీరంలో మేం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సైనికులు అంతా తిరుగుతున్నారు. వందలాది కోలాలు, కంగారూలు, వాల్లబీలు, పక్షుల భాగాలు తెచ్చిపెడుతున్నారు.
దుర్గంధం రాకుండా మాస్కులు వేసుకున్న వారు బొగ్గుల్లా మారిన కళేబరాలను కుప్పగా వేస్తున్నారు. తర్వాత వాటిని ఒక ట్రక్కులో నింపి తీసుకెళ్లి లోతైన గుంతల్లో వేస్తున్నారు.
ఇది సరదా కాదన్న మేజర్ ఆంథొనీ పర్డీ ఎవరూ చనిపోయిన అడవి జంతువులను ఇలా చేయాలని కోరుకోరు. కానీ మేం సమాజానికి సాయం చేయడానికి మేం ఇక్కడికి వచ్చాం. అది అవసరమైనంత కాలం మేం సిద్ధంగా ఉంటాం.
భూభాగం చాలా ముఖ్యం
ఆస్ట్రేలియాల అతి ముఖ్యమైన వైల్డ్ లైఫ్ శాంక్చురీలలో కంగారూ ఐలాండ్ ఒకటి. జీవవైవిధ్యానికి ఇది ప్రముఖమైనది. ఇప్పుడు ఈ దీవిలోని సగం(215 వేల హెక్టార్లకు పైగా) తగలబడిపోయింది.
వివోన్నే బేలో కొన్ని ప్రాంతాల్లో, మంటలు సముద్రం వరకూ వచ్చాయి.
ఇది చాలా దారుణం అని ఫ్లిండర్స్ చేజ్‌లో 8 ఏళ్లు రేంజర్‌గా పనిచేసిన కరోలిన్ పీటర్సన్ అన్నారు.
ఐలాండ్ నేషనల్ పార్కుకు వాయవ్య ప్రాంతం ఇల్లు లాంటిది. ఇప్పుడు దాన్నంతా మంటలు చుట్టుముట్టాయి. డిసెంబర్ 20 నుంచి అది తగలబడుతూనే ఉంది అన్నారు.
ఏవైనా ఇంకా కొన్ని మిగిలున్నాయా అనేది చూడాలంటే మాకు కష్టంగా ఉంది అని ఆమె కన్నీళ్లతో చెప్పారు.
ఇది చాలా ప్రత్యేకమైన ప్రాంతం, ఈ దీవిని చాలా వ్యాధుల నుంచి కాపాడుతూ వచ్చాం. మాకు మొత్తం భూభాగం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, EPA
కంగారూ ఐలాండ్‌లో అక్కడి సహజ జాతులు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉండడానికి కారణం అక్కడ కుందేళ్లూ, నక్కలు లేకపోవడమే.
యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఎకాలజీ ప్రొఫెసర్ క్రిస్టఫర్ డిక్‌మాన్ ఇది చెప్పారు
స్థానిక వన్యప్రాణుల్లో నక్కలను పెంచడం తప్పించారు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఇక్కడ కుందేళ్లు అసలు లేకపోవడంతో ఇక్కడ పచ్చదనానికి ఎలాంటి సమస్యా రాలేదు.
ఆస్ట్రేలియా తీరంలో ఉండే అతిపెద్ద ఐలాండ్ ఇదే. ఇది ఆస్ట్రేలియా మెయిన్ లాండ్ నుంచి ఎన్నో వేల ఏళ్ల క్రితమే విడిపోయింది. అని డిక్‌మన్ చెప్పారు.
ఇక్కడ ఎన్నో రకాల వృక్షజాలం, జంతు జాలం ఉంది. ఎందుకంటే దీవిలోని చాలా ప్రాంతాలు పూర్తిగా సహజంగా ఏర్పడ్డాయి. మనం కంగారూ ఐలాండ్ మీద అడుగుపెట్టినపుడు కాలంలో వెనక్కు వెళ్లినట్లు ఉంటుంది అన్నారు.
పశ్చిమ ప్రాంతాలను చాలావరకూ ఎవరూ చేరలేదు. అంటే మనం దక్షిణ ఆస్ట్రేలియా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది మంచి జీవజాతుల కలయికలా కనిపిస్తుంది.
ఇప్పుడు కంగారూ ఐలాండ్‌లోని ఎన్నో అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల గురించి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాటిలో జన్నర్ట్( ఎలుక లాంటి జంతువు) కూడా ఉంది.
ఈ దీవిలో లిగురియన్ జాతి తేనెటీగలు కూడా ఉంటాయి. దాదాపు పావు వంతు తేనెతుట్టెలు మంటల్లో కాలిపోయినట్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక ఇక్కడ పిగ్మీ పొస్సమ్స్, దక్షిణాది బ్రౌన్ పందికొక్కులు కూడా ఉన్నాయి.
‘‘అవి మంటల్లో కాలిపోయుండచ్చు. ఇక బతికినవి తమ నివాస ప్రాంతాలు కోల్పోయాయి’’ అని డిక్‌మాన్ చెప్పారు.
అక్కడ ఆహారం, నీళ్లు, ఆశ్రయం కొరత ఉంది. అక్కడ ఫెరల్ పిల్లులు కూడా ఉన్నాయి. మంటల ముందు అవి సమస్యగా ఉండేవి. వాటిని పిల్లులు వేటాడే ప్రమాదం ఉండేది.
ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ విషాదం నష్యాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది చాలా కష్టంగా మారుతోంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మంటలు ఇంకా శాంతించడం లేదు. దీవిలో కొన్ని ప్రాంతాల్లో అవి మరింత రాజుకుంటున్నాయి.
ప్రస్తుతం ఇంకా కార్చిచ్చు రగులుతూనే ఉంది. మేం పార్కులన్నీ మూసేశాం అని కారలైన్ పాటర్సన్ చెప్పారు.
మేం ఏమేం కోల్పోయాం అనేది అప్పుడే కచ్చితంగా చెప్పలేం. కానీ, మనకు ఆశ్రయం లేకపోతే. జీవజాతులు ఉండవు.

ఫొటో సోర్స్, Getty Images
కోలాలను కాపాడేందుకు పరుగులు
కంగారూ దీవిలోని 50 వేల కోలాల్లో సగం మంటల్లో ప్రాణాలు కోల్పోయాని అంచనా వేశారు. ఇక్కడ జీవించే వాటి జనాభాకు అది చాలా పెద్ద దెబ్బ.
ఆస్ట్రేలియా మిగతా ప్రాంతాల్లోలాగే, కంగారూ ఐలాండ్‌లో ఉండే కోలాలు, చల్మిడియా అనే వ్యాధికి గురికాకుండా ఉంటాయి. ఈ వ్యాధి వల్ల కోలాలు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతాయి.
మంటలు మొదలైనప్పటి నుంచి కాలిన స్థితిలో ఉన్న ఎన్నో కోలాలను శామ్ మిచెల్ రోజూ కాపాడేవారు. రాత్రికూడా మంటలు వాటిపైకి వస్తున్నప్పుడు రెండు డజన్ల కోలాలను చికిత్స కోసం తీసుకొచ్చారు.
బయట ఉన్న ఒక ప్రాంతంలో ఒక తాత్కాలిక క్లినిక్ వేశారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ జంతువులకు చికిత్స చేసేందుకు వాలంటీర్లు పరుగులు తీస్తున్నారు.
కోలాలకు మత్తుమందు ఇచ్చినా అవి బాధగా అరుస్తుంటాయి. యాంటీబయాటిక్స్ రాస్తుంటే ముడుచుకుపోతుంటాయి. కానీ ఇక్కడకు తీసుకొచ్చే అన్నిటినీ కాపాడలేం. వాటిలో కొన్ని చాలా ఘోరంగా గాయపడ్డాయి.
''దురదృష్టవశాత్తూ చాలా జంతువులు చనిపోయాయి. కొన్ని మరీ దూరం వెళ్లిపోయాయి'' అని డంకన్ అన్నారు.
కొన్ని జంతువులను పెట్టడానికి వేరే చోటు లేక లాండ్రీ బుట్టల్లో పెట్టి కాపాడుతున్నారు. పార్క్ అంతా జనరేటర్లతో నడుస్తోంది. ఈ ప్రాంతంలో విద్యుత్ తీగలన్నీ మంటల్లో కాలిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రంగా గాయపడిన జంతువులకు ఇక్కడ చికిత్స అందించడం కూడా కష్టమే.
''గాలుల వల్ల దూళి రేగుతుంది. అడవుల్లో కలుషితమవుతున్నాయి. జంతువుల కోసం మంచి బోనులు కూడా కావాలి'' అని బెలిండా చెప్పారు.
వ్యవసాయం సహా ప్రతి రంగంపైనా ఈ కార్చిచ్చుల ప్రభావం పడింది. గొర్రెలు, పాడి పశువులు వేలల్లో దహనమైపోయాయి. వేల ఎకరాల మైదానాలు కాలిపోయాయి.
వణ్యప్రాణుల పార్క్‌కిది సాధారణంగా పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే సమయం. కానీ, కార్చిచ్చుల వల్ల పర్యటకులంతా ఈ ప్రాంతం నుంచి ఎప్పుడో వెళ్లిపోయారు.
''మాదొక ప్రైవేటు వ్యాపారం. నేను, నా భార్య, కొడుకు దీన్ని నడిపిస్తాం. మరో పది మంది మాపై ఆధారపడ్డారు. వణ్యప్రాణులను చూసేందుకే ఇక్కడికి పర్యటకులు వస్తారు. రోజూ 100-200మంది వచ్చేవాళ్లు. ఈ పార్క్‌కు ఆదాయం కూడా అలా వచ్చేదే. కానీ, ఇప్పుడు అంతా మూతపడింది. మేం త్వరగానే దివాళా తీయొచ్చు'' అని శామ్ చెప్పారు.
''ఇంకా కొన్ని మండని ప్రాంతాలు ఉన్నాయి. కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. వేసవి ముగియలేదు. ఈ ద్వీపమంతా కాలడం చూస్తామేమో'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- చమురు కోసం జరిగే అంతర్జాతీయ ఘర్షణలకు సౌర విద్యుత్ ముగింపు పలుకుతుందా...
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది
- అమెరికా, చైనా వాణిజ్యం: ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ ఒప్పందం
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- చైనా కరెన్సీ నోట్లపై చిరస్థాయిగా నిలిచిపోయిన 'ట్రాక్టర్ హీరోయిన్' ఇక లేరు
- అంతుచిక్కని మరణాలు... వేల పక్షులు అక్కడే ఎందుకు చనిపోయాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








