స్వీడన్: 9 నెలల్లో 97 పేలుళ్లు, అసలేం జరుగుతోంది

స్వీడన్

ఫొటో సోర్స్, JEPPE GUSTAFSSON/AFP

ప్రశాంతంగా ఉండే స్వీడన్‌లో ఇప్పుడు పేలుళ్ల కలకలం రేగుతోంది.

దేశ రాజధాని స్టాక్‌హోమ్‌లో గత నెలలో ఒకే రాత్రి మూడు చోట్ల పేలుళ్లు జరిగాయి. స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఈ తరహా పేలుళ్లు దేశంలో సాధారణమైపోయాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లోనే దేశవ్యాప్తంగా 97 పేలుళ్లు జరిగాయి.

చిన్నపాటి బాంబులు, ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్స్, గ్రెనేడ్లతో ఈ పేలుళ్లు జరుగుతున్నాయని స్వీడన్ నేషనల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ ఇంటెలిజెన్స్ హెడ్ లిండా హెచ్ స్ట్రాఫ్ తెలిపారు.

స్థానికంగా ఉండే నేరస్థుల ముఠాలు పరస్పరం దాడులు చేసుకునే క్రమంలో ఈ పేలుళ్లకు పాల్పడుతున్నాయని ఆమె వివరించారు.

''ఒక ముఠా వాళ్లు ఇంకో ముఠా సభ్యుల స్నేహితులు, కుటుంబ సభ్యులను భయపెట్టేందుకు ఈ పేలుళ్లకు పాల్పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగానే ఉంది. కానీ, సాధారణ ప్రజలు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ పేలుళ్లకు వాళ్లు లక్ష్యం కారు'' అని అన్నారు.

2018లో 162 పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 2017కు ముందు ఇలాంటి పేలుళ్ల గురించి పోలీసులు లెక్కలు కూడా తీయలేదు.

ఈ తరహా నేరాలు తమ దేశానికి కొత్త అని నేషనల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ మాట్స్ లవ్నింగ్ చెప్పారు.

అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్‌లోని ముఠా నేరాల కట్టడిలో నిపుణులైన అధికారులను కలిసేందుకు స్వీడన్ పోలీసు విభాగం తమ బృందాలను పంపిస్తోంది. విధ్యంసకర పదార్థాలతో ఎలా వ్యవహరించాలన్న దానిపై సైన్యం సహకారం తీసుకుంటోంది.

స్వీడన్

స్థానిక నేర పరిశోధకుడు ఆమిర్ రోస్తామీ స్వీడన్‌లోని పరిస్థితిని మెక్సికోలోని నేరముఠాల తగాదాలతో పోల్చారు.

''ఇంతవరకూ స్వీడన్ చరిత్రలో పెద్దగా యుద్ధాలు, ఉగ్రవాదం లాంటివి లేవు. ఇలాంటి పరిస్థితి తలెత్తడం విచిత్రంగా ఉంది'' అని ఆయన అన్నారు.

స్టాక్‌హోమ్, గోతెన్‌బర్గ్, మాల్మో నగరాల్లోని కొన్ని అల్పాదాయ ప్రాంతాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మాల్మోలో ఈ నెల మొదట్లో ఒక్క రోజు వ్యవధిలో మూడు పేలుళ్లు జరిగాయి.

ఖరీదైన ప్రాంతాలకూ ఈ పేలుళ్లు విస్తరిస్తున్నాయి. స్టాక్‌హోమ్‌లోని బ్రొమ్మాలో ఓ అపార్టుమెంటు ప్రవేశ ద్వారం వద్ద పేలుడు జరిగింది. దీని ధాటికి భవనం కిటికీలు, అక్కడున్న కార్లు ధ్వంసమయ్యాయి.

లింకోపింగ్‌లో జరిగిన మరో పేలుడులో 25 మంది గాయపడ్డారు.

ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

డ్రగ్స్ వ్యాపారం, గన్ క్రైమ్‌ పెరిగేందుకు కారణమైన ముఠాలే ఈ పేలుళ్లకు పాల్పడుతుండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

2018లో స్వీడన్‌లో 45 ప్రాణాంతక కాల్పుల ఘటనలు జరిగాయి. 2011లో ఇలాంటివి 11 మాత్రమే చోటుచేసుకున్నాయి.

ఈ ముఠాలు విధ్వంసకర పదార్థాల వాడకం ఎందుకు మొదలుపెట్టాయన్న దానిపై స్పష్టత లేదు.

స్వీడన్

ఫొటో సోర్స్, Getty Images

నిందితులు, నేరస్థుల జాతి లాంటి వివరాలను స్వీడన్ పోలీసులు బయటపెట్టరు.

అయితే, నేర ముఠాల్లో ఉండేవారి నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటోందని ఇంటెలిజెన్స్ చీఫ్ లిండా హెచ్ స్ట్రాఫ్ అన్నారు.

''వాళ్లు స్వీడన్‌లో పెరిగినవారే. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారు. రెండు మూడు తరాల కిందటే స్వీడన్‌కు వలసవచ్చిన కుటుంబాలకు చెందినవారు వాళ్లలో చాలా మంది ఉన్నారు'' అని ఆమె అన్నారు.

2015లో వలసల సంక్షోభం ఏర్పడిన సమయంలో స్వీడన్ చాలా మంది శరణార్థులను తమ దేశంలోకి స్వీకరించింది. ఈయూలో జనాభా నిష్పత్తిపరంగా చూస్తే, అత్యధికంగా శరణార్థులను అనుమతించిన దేశం స్వీడనే. అయితే, ఈ పరిణామాల గురించి వాదోపవాదాలు పెరిగాయి.

రైటి వింగ్ నాయకులు ఈ పేలుళ్ల ఘటనలను కూడా వలసలతో ముడిపెడుతున్నారు. వలసదారులు స్వీడన్ జన జీవన స్రవంతిలో ఇమడలేక నేర ముఠాలవైపు మళ్లుతున్నారని అంటున్నారు.

అయితే, కొత్త వలసదారులు నేర ముఠాల వ్యవహారాల్లో భాగమవుతున్నారన్న వాదన తప్పని లిండా అన్నారు.

ఈ పేలుళ్ల ఘటనలకు మీడియా కూడా ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.

స్టాక్‌హోమ్ యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ క్రిస్టియన్ క్రిస్టెన్సన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పేలుళ్ల వెనకున్న కుట్రదారులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్వీడన్ పోలీసులు చెబుతున్నారు. అయితే, 2018లో ఇలాంటి ప్రతి పది కేసుల్లో ఒక్క దాంట్లోనే దోషులను గుర్తించగలిగారు.

నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు స్వీడన్ ప్రభుత్వం చెబుతోంది. అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిపేందుకు పోలీసులకు అధికారాలను పెంచుతున్నట్లు హోం శాఖ మంత్రి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)