గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ఫొటో సోర్స్, facebook/VeturiSundararamaMurthy
ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
గొల్లపూడి.. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు.
సంసారం ఒక చదరంగం, యముడికి మొగుడు, స్వాతిముత్యం, ఆలయ శిఖరం, చాలెంజ్, ఆదిత్య 369, లీడర్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు.
సినిమాల్లోకి రాకముందు నవలలు, నాటకాలు రాసేవారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కూడా పనిచేశారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా సేవలందించారు.
1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉపసంపాదకుడిగా కూడా పనిచేశారు.
ఆ తర్వాత ఆకాశవాణిలో చేరేందుకు హైదరాబాద్ వెళ్లారు. అనంతరం విజయవాడ, సంబల్‌పూర్, చెన్నై, కడప రేడియో కేంద్రాలలో కూడా పనిచేశారు. 20 సంవత్సరాల ఉద్యోగ జీవితం తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు.
ఎన్నో యూనివర్శిటీల్లో పాఠ్యాంశాలుగా గొల్లపూడి రచించిన నాటకాలు, తెలుగు సాహిత్యంపై ఆయన రచనలకు స్థానం దక్కింది.
ఎన్నో సినిమాలకు మాటలు రాశారు. ఆయన మొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకున్నారు.
విజయనగరంలో 1939 ఏప్రిల్ 14న గొల్లపూడి ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. తర్వాత కాలంలో విశాఖలో సెటిల్ అయ్యారు.
290కి పైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు.
మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుంచి వెలువడే స్థానిక పత్రిక రేనాడులో 1954, డిసెంబరు 9న ఆ కథ ప్రచురితమైంది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరుతో ఓ నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు.
అవార్డులు
- 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డు
- 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా నంది అవార్డు
- 1989లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు
- 1991లో మాస్టారి కాపురం సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డు
- 2002లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ విశిష్ట పురస్కారం
- 1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం. ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం కింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం కోర్సుకు పాఠ్యపుస్తకంగా ప్రతిపాదించారు.
- ఉత్తమ హాస్యరచనకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం
- 2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పైడి లక్ష్మయ్య ధర్మనిధి పురస్కారం
- 1985లో వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి ఉత్తమ నాటక రచనకు గాను గురజాడ అప్పారావు మెమోరియల్ బంగారు పతకం
- 1959లో ఆకాశవాణి నిర్వహించిన, దిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను బహుమతి
- ప్రశ్న అనే నాటకానికి అఖిల భారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం
- 1984లో ఉత్తమ నాటక రచనకు గాను వంశీ బర్కిలీ పురస్కారం
- 1983లో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్యనటుడి పురస్కారం
- 1985లో రామాయణంలో భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ఉత్తమ సహాయనటుడి పురస్కారం
- 1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక
- 2015లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం
- ఇవే కాక 2009లో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య, అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును, మారుతీరావుకు ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో పొలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని అందుకున్నారు.
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం
తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- హైదరాబాద్ 'ఎన్కౌంటర్'పై విచారణ కమిషన్: నిందితులు పిస్టల్ లాక్కొని దాడికి దిగినా పోలీసులు గాయపడలేదా: సీజేఐ ప్రశ్న
- సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'
- రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?
- ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేత
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








