సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూత

ఫొటో సోర్స్, facebook/comedian.venumadhav
తెలుగు సినీ నటుడు వేణు మాధవ్ (50) బుధవారం మరణించారు. కాలేయ సంబంధ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.21 గంటలకు కన్నుమూశారని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మంగళవారమే ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మార్చి చికిత్స అందించారు.
గతంలో పలుమార్లు వేణుమాధవ్ చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇవ్వగా.. వాటిని ఖండిస్తూ ఆయన ప్రకటనలు ఇచ్చేవారన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్గొండ జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయనకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో గుర్తింపు లభించింది.
వేణు మాధవ్ 170కి పైగా సినిమాల్లో నటించారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి.
ఆయన చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్.
హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో వేణుమాధవ్ హీరోగా కూడా నటించారు. పలు తమిళ చిత్రాల్లోనూ, తెలుగు టీవీ కార్యక్రమాల్లోనూ నటించారు.
2006లో ఉత్తమ హాస్య నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.

ఫొటో సోర్స్, facebook/comedian.venumadhav
తెలుగుదేశం పార్టీతో అనుబంధం..
మిమిక్రీ ఆర్టిస్టుగా స్థానికంగా పేరు తెచ్చుకున్న వేణు మాధవ్.. తదనంతర కాలంలో తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా మిమిక్రీ ప్రదర్శన ఇచ్చారు.
దీంతో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులతో పరిచయం పెరిగి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే అవకాశం లభించింది. నెలకు రూ.800 జీతంతో టెలిఫోన్ ఆపరేటర్‌గా ఆయన కొంతకాలం పనిచేశారు.
టీడీపీ కార్యాలయం, టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయం, ఎన్టీఆర్ నివాసంలోనూ వేణుమాధవ్ పనిచేశారు.
2018లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు. దక్కకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేయగా.. అది తిరస్కరణకు గురైంది.
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సంతాపం
‘గోకులంలో సీత’ నుంచి తనతో కలసి పలు చిత్రాల్లో నటించిన వేణు మాధవ్ హాస్యం పండించటంలో మంచి టైమింగ్ ఉన్న నటుడని, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ నవ్వించేవారని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వేణు మాధవ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు వేణు మాధవ్ మృతికి సంతాపం ప్రకటించారు.

ఫొటో సోర్స్, Dr. Rajasekhar
వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు: డాక్టర్ రాజశేఖర్
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణు మాధవ్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
''వేణుమాధవ్ మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్ చేసి విష్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. 'మనసున్న మారాజు', 'రాజ సింహం', 'ఒక్కడు చాలు', 'గోరింటాకు' చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఎన్నికల సమయంలో వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా... 'మా'కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవారు. తన అభిప్రాయం చెప్తారు. గత వారం ఆయన హాస్పటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్ అయ్యారు. మళ్లీ సీరియస్ అయిందని మంగళవారం అడ్మిట్ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు. వేణుమాధవ్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు'' అని రాజశేఖర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్వచ్ఛ భారత్: సదుపాయాల మాట మరచి అంకెల వెంట పరుగులు
- నరేంద్ర మోదీ 'ఫాదర్ ఆఫ్ ఇండియా': అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్
- ‘ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారు’.. గద్దె దించేందుకు అభిశంసన తీర్మానం పెట్టిన డెమోక్రాట్స్
- అమితాబ్ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే, ఈ అవార్డు ఎందుకిస్తారు
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- అమెరికాలో నెహ్రూ, ఇందిరా గాంధీలను చూసేందుకు అంతమంది వచ్చారా? ఈ ఫొటో వెనుకున్న వాస్తవం ఏంటి?
- మధ్యాహ్న భోజన పథకం: దక్షిణ భారత్‌లో అమలవుతోంది, ఉత్తరాదిలో ఎందుకు కావడం లేదు
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- సౌర విద్యుత్ చరిత్ర: 3000 ఏళ్ల క్రితమే చైనాలో సౌరశక్తి వినియోగం
- ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- 20 ఏళ్లుగా 200 విష సర్పాలతో కాటేయించుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- ‘అసమానతల తొలగింపులో తెలంగాణకు 100కు వంద మార్కులు.. సన్ రైజ్ విజన్‌తో ముందుకు వెళ్తున్న ఏపీ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








