పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్: ‘మోదీ.. అదే మీ ఆఖరి తప్పు అవుతుంది’

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ఏదైనా తప్పు చేస్తే అదే ఆయనకు ఆఖరిది అవుతుందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.

పాకిస్తాన్‌ను భారత్ పది రోజుల్లోపు మట్టికరిపించగలదని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్‌పుర్‌లో 'కశ్మీర్ ఐక్యతా దినోత్సవం' సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.

Presentational grey line
News image
Presentational grey line

''మోదీ, మీరు 11 రోజుల్లోపు పాకిస్తాన్‌ను భారత్ మట్టికరిపించగలదని అంటున్నారు. మీరు చరిత్ర చదువుకోలేదనుకుంటా. మీ డిగ్రీ నకిలేదేమో. మీ బడాయి మాటలను చూశాక, చరిత్రను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. నెపోలియన్, హిట్లర్ సేనలు రష్యాపై దాడి చేశాయి. ఆయా సమయాల్లో ప్రపంచంలోనే అవి అత్యంత శక్తిమంతమైనవి. వాళ్లు కూడా కొన్ని వారాల్లో రష్యా పని ముగించి, శీతాకాలం రాకముందే విజయంతో తిరిగి వద్దామనుకున్నాయి. బడాయికి పోయిన ఆ రెండు సైన్యాలు, విఫలమయ్యాయి. వాళ్లు కూడా వారాల్లోనే పని ముగుస్తుందని అనుకున్నారు'' అని ఇమ్రాన్ అన్నారు.

''పక్కనే ఉన్న అఫ్గానిస్తాన్‌నే చూడండి. ప్రపంచంలోనే శక్తిమంతమైన సైన్యం అక్కడ 19 ఏళ్లుగా ఉంది. వాళ్లు కూడా అది వారాల్లో ముగిసే వ్యవహారమనే అనుకున్నారు. వియత్నాంలోనూ అమెరికన్లు అలాగే కొన్ని రోజుల పనే అని అనుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ ఖాన్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

''ఒక్క మనిషిని హత్య చేస్తే మొత్తం మానవత్వాన్నే హత్య చేసినట్లు భావించే మతంవారు ఉండే దేశం పాకిస్తాన్‌. ఇంకోవైపు అల్లా ఆదేశంపై స్వేచ్ఛ కోసం ఒకవేళ ప్రాణాలు అర్పిస్తే, ప్రవక్త తర్వాతి స్థాయి లభిస్తుందని కూడా మా ఖురాన్ చెబుతోంది. 20 కోట్ల పాకిస్తానీల్లో చిన్నపిల్లలు కూడా యుద్ధంలో తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు. మాది సుశిక్షత సైన్యం. చావుకు భయపడదు. మోదీ, మీరు భ్రమలేవీ పెట్టుకోవద్దు'' అని ఇమ్రాన్ అన్నారు.

నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్‌సీసీ)కు సంబంధించిన ఓ కార్యక్రమంలో జనవరి 28న మోదీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో ఎలాంటి యుద్ధం వచ్చినా, ఆ దేశాన్ని భారత్ వారం-పది రోజుల్లో మట్టికరిపించగలదని అన్నారు. ఇదివరకు పాకిస్తాన్‌పై భారత్ మూడు యుద్ధాల్లో గెలిచిందని గుర్తుచేశారు.

పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధానికి స్పందించేందుకు సైన్యానికి మునుపటి ప్రభుత్వాలు అనుమతించలేదని, ఇప్పుడు బహిరంగంగానే అనుమతి ఉందని మోదీ అన్నారు.

''సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడులు చేశాం. ప్రచ్ఛన్న యుద్ధం నడుపుతున్నవారికి గుణపాఠం నేర్పాం. ఈ రెండు దాడులతో జమ్మూకశ్మీర్‌లోనే కాదు, దేశమంతటా శాంతి నెలకొంది'' అని వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

'కశ్మీర్‌కు ఎన్నడూ లేనంత అంతర్జాతీయ ప్రాధాన్యం'

గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కశ్మీర్ అంశానికి అంతర్జాతీయ ప్రాధాన్యం లభిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తాజా ప్రసంగంలో చెప్పారు.

''గత ఆరు నెలల్లో ఐరాస భద్రత మండలికి మూడుసార్లు కశ్మీర్ అంశం వచ్చింది. బ్రిటన్, అమెరికాలోని చట్టసభల సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. యూరోపియన్ యూనియన్‌లోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. కర్ఫ్యూ ఎత్తివేయాలని డిమాండ్ వచ్చింది'' అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తాను కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. గత ఆగస్టు తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ని మూడుసార్లు కలిశానని.. రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలకు కూడా కశ్మీర్‌లో భారత్ ఏం చేస్తుందనేది వివరించానని చెప్పారు.

''కశ్మీర్ గురించి మొత్తం ప్రపంచానికి తెలుసు. కశ్మీరీలు భయపడి తమ నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఆర్ఎస్ఎస్ అనుకుంటోంది. అలా జరగదు. కశ్మీర్‌కు మంచి రోజులు వచ్చాయని నాకు అనిపిస్తోంది. కర్ఫ్యూ తొలగించిన రోజు, జన సంద్రం వస్తుంది. 'ఆజాదీ' నినాదం మార్మోగుతుంది'' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)