బీరు వాళ్లిద్దరినీ మళ్ళీ కలిపింది

హేజిల్‌తో మోనికా

ఫొటో సోర్స్, MONICA MATHIS

అమెరికాకు చెందిన ఓ మహిళ సుమారు మూడేళ్ల కిందట తప్పిపోయిన తన కుక్కను మళ్లీ పట్టుకోగలిగారు.. ఒక బీరు క్యాన్ వల్ల అది సాధ్యమైంది.

మోనికా మేథిస్‌కు చెందిన కుక్క హేజిల్ 2017 మే‌లో తప్పిపోయింది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో తన కుక్క ఫొటో వంటిదే ఒకటి చూశారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ బీర్ క్యాన్‌పై ఆ కుక్క ఫొటో ఉంది.

అడ్డగీత
News image
అడ్డగీత

మోనికా ఉండే అయోవా ప్రాంతానికి 1600 కిలోమీటర్ల దూరంలో ఫ్లోరిడాలో ఉన్న ఓ బ్రూవరీ ఒకటి స్థానికంగా ఉండే యానిమల్ షెల్టర్ హోమ్‌కు సహకరించే క్రమంలో అక్కడున్న కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవాలని కోరుతూ తమ బీర్ క్యాన్లపై వాటి చిత్రాలను ముద్రించి ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వాటిలో డేడే పేరుతో ఉన్న కుక్కను చూసి అదే తన హేజిల్ అని మోనికా గుర్తించారు. ఆ షెల్టర్ హోంలో హేజిల్ పేరు డేడేగా మార్చడంతో బీర్ క్యాన్‌పై ఆ పేరుతోనే ఫొటో ముద్రించారు.

దాన్ని చూసి మోనికా తన కుక్కను తిరిగి తెచ్చుకోగలిగారు. అయితే, హేజిల్ వందల కిలోమీటర్ల దూరంలోని షెల్టర్ హోమ్‌కు ఎలా చేరిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.

బీర్ క్యాన్

ఫొటో సోర్స్, GARY SWEETMAN/COURTESY MOTORWORKS BREWING

పెరట్లో కట్టేసి ఉండగా మాయం

అయోవాలో మోనికా పెరట్లో కట్టేసి ఉన్న హేజిల్ అక్కడి నుంచే తప్పిపోయింది. ఆ తరువాత మోనికా ఎంత వెతికినా హేజిల్ ఆచూకీ దొరకలేదు. అనంతరం మోనికా మిన్నెసోటాలోని సెయింట్ పాల్‌కు మారిపోయారు.

''నాకు ఏడుగురు పిల్లలు. మా కుటుంబమంతా సెయింట్ పాల్‌కు మారాలనుకుంటున్న సమయంలోనే హేజిల్ తప్పిపోయింది'' అని మోనికా బీబీసీతో చెప్పారు.

''నేను అయోవా నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా హేజిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. తరచూ అక్కడివారికి ఫోన్ చేసి హేజిల్ కనిపించిందా అని అడిగేదాన్ని'' అన్నారామె.

అయోవా, ఫ్లోరిడా

షెల్డర్ హోం వాళ్లు ప్రయత్నించినా..

ఫ్లోరిడాలోని మనాటీ కౌంటీలోని షెల్టర్ హోమ్‌కు హేజిల్‌ను ఎవరో తీసుకొచ్చినప్పుడు దానికి ఉన్న మైక్రోచిప్ ఆధారంగా యజమానికి సమాచారం ఇవ్వాలని అక్కడి సిబ్బంది ప్రయత్నించారు. కానీ, ఆ చిప్ పనిచేయకపోవడంతో వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు.

అనంతరం స్థానికంగా ఉండే బ్రూవరీ ఒకటి తన బీర్ క్యాన్లపై ఇలాంటి అనాథ కుక్కల చిత్రాలను ముద్రించింది. దానికి సంబంధించిన కథనం ఒకటి అక్కడి టీవీ చానల్‌లో ప్రసారమైంది.

ఆ కథనం ఫేస్‌బుక్‌లో చూసిన మోనికా తన కుక్కను గుర్తించింది. అది తన కుక్కేనని నిర్ధరించుకున్న ఆమె జనవరి 24న ఆ ఫేస్‌బుక్ పోస్ట్ కింద 'ఇది నా కుక్క' అని కామెంట్ బాక్సులో పోస్ట్ చేసింది.

అప్పుడు షెల్టర్ హోం సిబ్బంది స్పందించి అది ఆమెదే అనడానికి ఆధారాలు చూపాలని కోరారు. తన వద్ద ఉండే కుక్క చిత్రాలు, వెటర్నరీ రికార్డు కావాలని అడిగారు.

అయితే, ఈలోగా ఎవరైనా దాన్ని తీసుకుపోతారేమోనని తాను ఆందోళన చెందానని మోనికా బీబీసీతో అన్నారు.

వెంటనే ఆమె ఇంట్లో ఉన్న పత్రాలను వెతికి అందులో హేజిల్‌కు సంబంధించిన వెటర్నరీ రికార్డులు, ఫొటోలు అన్నీ తీసి వారికి చూపించి తన హేజిల్‌ను తెచ్చుకున్నారామె.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)