చనిపోయిన కూతుర్ని వర్చువల్ రియాలిటీతో 'కలుసుకున్న' అమ్మ... ఈ ప్రయోగం మంచిదేనా, కాదా?

ఫొటో సోర్స్, MBC
ప్రతి ఒక్కరికీ దుఃఖం తప్పించుకోలేనిది. ఎప్పుడో ఒకప్పుడు ఎదురై తీరుతుంది. ఇంట్లో మనిషినో, ఆత్మీయులనో కోల్పోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. చనిపోయింది పిల్లలైతే ఆ విషాదం నుంచి కోలుకోవడం ఇంకా కష్టం.
ఇలా ఏడేళ్ల తన కూతుర్ని కోల్పోయి ఎంతో వేదనను అనుభవిస్తున్న ఓ అమ్మకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కాస్త సాంత్వన కలిగించింది. ఈ బాధ నుంచి తేరుకొనేందుకు ఆమె వర్చువల్ రియాలిటీ(వీఆర్)ని ఉపయోగించారు.
దక్షిణ కొరియాకు చెందిన జాంగ్ జీ-సుంగ్ మూడో కూతురు నా-యెవన్ నాలుగేళ్ల కిందట నయం చేయలేని రక్త సంబంధ అనారోగ్య సమస్యతో అకస్మాత్తుగా చనిపోయింది.


ఓ టీవీ ప్రొడక్షన్ బృందం ఎనిమిది నెలలు శ్రమించి జీ-సుంగ్ కోసం నా-యెవన్ త్రీడైమెన్షనల్(3డీ) ప్రతిరూపాన్ని రూపొందించింది. ఒక చిన్నారి కదలికలను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రికార్డు చేసి, వాటి సాయంతో నా-యెవన్ కదలికలను సృష్టించింది. ఈ 3డీ ప్రతిరూపానికి స్వరాన్ని కూడా సమకూర్చింది.
నిజ జీవితంలో ఈ తల్లీకూతురు సందర్శించిన ఓ పార్కును ఆధారంగా చేసుకొని ఓ వర్చువల్ పార్క్‌ను కూడా ఈ బృందం సిద్ధం చేసింది.
చనిపోయిన బిడ్డను వీఆర్ సాయంతో తల్లి తిరిగి 'కలుసుకోవడం'పై ఈ బృందం 'మీటింగ్ యు' పేరుతో డాక్యుమెంటరీ తీసింది. ప్రముఖ టీవీ నెట్‌వర్క్ ఎంబీసీలో ప్రసారమైన ఈ చిత్రాన్ని లక్షల మంది దక్షిణ కొరియన్లు వీక్షించారు.

ఫొటో సోర్స్, MBC
తల్లీకూతురు తిరిగి 'కలుసుకోవడం' ఇందులో అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశం.
బాలిక ప్రతిరూపం తల్లి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి- "అమ్మా, నువ్వు ఎక్కడికెళ్లావు? నన్ను తలచుకున్నావా" అని అడగడం, తల్లి ఏడుస్తూ కూతురి ప్రతిరూపాన్ని హత్తుకొనేందుకు ప్రయత్నించడం కదిలిస్తాయి.
ఈ దృశ్యాలను చూస్తున్న జీ-సుంగ్ కుటుంబ సభ్యులు విచారంగా కనిపించారు.
నైతికతపై చర్చ
చనిపోయిన ఆత్మీయులను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 'కలుసుకోవడం'లో ఇమిడి ఉన్న నైతిక, మానసిక అంశాలపై ఈ డాక్యుమెంటరీ చర్చను లేవనెత్తింది.
మనిషిని కోల్పోయిన బాధలో కూరుకుపోయినవారికి ఈ ప్రయోగం సాంత్వన కలిగిస్తుందని కొందరు చెబుతుండగా, ఇది వారిని బాధ నుంచి కోలుకోకుండా, జీవితంలో ముందుకు సాగకుండా చేయొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, MBC/ YouTube
బాధలో ఉన్న తల్లి భావోద్వేగాలను ఎంబీసీ ఇలా సొమ్ము చేసుకొంటోందనే ఆరోపణలూ వస్తున్నాయి.
యూట్యూబ్‌లో ఎంబీసీ పోస్ట్ చేసిన పది నిమిషాల క్లిప్‌ను కోటీ 44 లక్షల సార్లకు పైగా వీక్షకులు చూశారు. 20 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.
వీఆర్ కలిగించిన అనుభూతి మున్ముందు జీ-సుంగ్‌కు మరింత బాధను, నిస్సహాయతను కలిగించవచ్చని కొందరు యూజర్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం మంచిదేనా, కాదా అనే సందేహాన్ని మరికొందరు వెలిబుచ్చారు.
తల్లి స్పందనేమిటి?
బిడ్డను ఇలా 'కలుసుకోవడం' తనకు మేలే చేసిందని జీ-సుంగ్ చెప్పారు.
నా-యెవన్ చనిపోయాక ఆమె పేరును తల్లి తన శరీరంపై టాటూ వేయించుకున్నారు. బిడ్డ ఫొటోలను ఇంట్లో ప్రతి చోటా పెట్టారు. కూతురు అస్థికలతో కూడిన నెక్లస్‌ను ధరించారు.
నా-యెవన్ కల్లోకొచ్చేదని, బాధపడుతున్నట్లు కనిపించేదని, వీఆర్ సాయంతో చూసినప్పుడు తను నవ్వుతూ కనిపించిందని జీ-సుంగ్ తెలిపారు.
బిడ్డను కోల్పోయిన వేదన నుంచి బయటపడటానికి ఈ ప్రయోగం ఆమెకు తోడ్పడవచ్చని బీబీసీతో మాట్లాడిన సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారు.
అనుకోకుండా దగ్గరివారు చనిపోవడంతో తీవ్రంగా బాధపడుతున్న వ్యక్తులకు, తాము కోల్పోయినవారికి ఏదో విధంగా సరైన వీడ్కోలు చెప్పగలిగే అవకాశం వస్తే అదెంతో మేలు చేస్తుందని కొరియా విశ్వవిద్యాలయంలో 'మైండ్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్'కు చెందిన గో సున్-క్యు తెలిపారు.

ఫొటో సోర్స్, MBC
యాంగ్జైటీ డిజార్డర్లు, భయాలు, డిమెన్షియా, కుంగుబాటు సమస్యల చికిత్సలో వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇప్పటికే వాడుతున్నారని దక్షిణ కొరియా రాజధాని సోల్‌లోని యాన్సీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాంగ్-గ్వీ లీ చెప్పారు.
బాధలో ఉన్న వారికి సాంత్వన చేకూర్చేందుకు వీఆర్ ప్రయోగాలు చేపడితే, వాటి ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు కౌన్సెలింగ్ కూడా అందించాల్సిన అవసరముందని ఆయన వివరించారు.
చివరి వీడ్కోలు
చనిపోయిన కూతుర్ని వీఆర్‌తో తల్లి 'కలుసుకోవడం' అనే ఆలోచనను తమ బృందం చాలా జాగ్రత్తగా ఆచరణలోకి తీసుకొచ్చిందని ప్రోగ్రామ్ డైరెక్టర్ లీ హ్యున్-సియోక్ బీబీసీతో చెప్పారు. ప్రణాళిక దశ నుంచి పూర్తిచేసే దశ వరకు అన్ని జాగ్రత్తలు పాటించామన్నారు. నా-యెవన్‌తో జీ-సుంగ్‌కు ఉన్న జ్ఞాపకాలే డాక్యుమెంటరీలో ప్రతి అంశానికీ ఆధారమని తెలిపారు.
డాక్యుమెంటరీ చివర్లో 'నా-యెవన్' తన తల్లికి పువ్వు అందించి, తాను అలసిపోయానంటూ పడుకొంటుంది. "అమ్మా, నువ్వంటే నాకు ఎప్పుడూ ఎంతో ప్రేమ" అని చెబుతుంది. తల్లీకూతురు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటారు. ఇంతలో కూతురు నిద్రలోకి జారుకొంటుంది. తర్వాత ఓ తెల్ల సీతాకోక చిలుకగా మారి ఎగిరిపోతుంది.

ఇవి కూడా చదవండి:
- మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు
- "ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న భారత్
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









