బ్రిటన్: ఒప్పందంలేని 'బ్రెగ్జిట్'ను తిరస్కరించిన ఎంపీలు.. ఈయూను గడువు కోరడంపై నేడు ఓటింగ్

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఒప్పందమూ లేకుండా యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగే ప్రతిపాదనను బుధవారం సాయంత్రం పార్లమెంటులోని దిగువసభ 'హౌస్ ఆఫ్ కామన్స్'లో ఎంపీలు తిరస్కరించారు.
ప్రతిపాదనకు వ్యతిరేకంగా 312 మంది ఎంపీలు ఓటు వేశారు. అనుకూలంగా 308 మంది ఓటేశారు. ఈ ఓటింగ్‌లో వచ్చిన ఫలితానికే ప్రభుత్వం కట్టుబడి వ్యవహరించాలని లేదు. ప్రస్తుత చట్టం ప్రకారం- ఎలాంటి ఒప్పందం లేకుండానే మార్చి 29న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు వీలు ఉంది.
ఈయూ నుంచి వైదొలగేందుకు మరింత సమయం ఇవ్వాలని ఈయూను అనుమతి కోరాలా, వద్దా అనే అంశంపై ఈ రోజు (గురువారం) పార్లమెంటులో ఓటింగ్ జరుగనుంది.
ఈయూ నుంచి నిష్క్రమణకు అవసరమైన చట్టాన్ని తెచ్చేందుకు వీలుగా బ్రెగ్జిట్‌ను ఈ నెల 29 నుంచి జూన్ 30 వరకు వాయిదా వేయాలా అనే ప్రతిపాదనపై ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొననున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈయూ నుంచి బయటకు రావడానికి సంబంధించి ప్రధాని థెరెసా మే ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి ఈ నెల 20లోగా ఎంపీలు అంగీకరిస్తారా, లేదా అనే దానిని బట్టి గడువు పొడిగింపు ఎన్ని రోజులనేది ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఒప్పందానికి ఈయూ ఇంతకుముందే సమ్మతి తెలిపింది.
థెరెసా మే ఒప్పందాన్ని ఎంపీలు రెండుసార్లు తిరస్కరించారు. దీని ఆమోదం కోసం రానున్న రోజుల్లో ఆమె మూడోసారి ప్రయత్నించే అవకాశముంది.
తాజా ఓటింగ్ తర్వాత ప్రధాని స్పందిస్తూ- ''ఎప్పుడూ ఉన్న ప్రత్యామ్నాయాలే ఇప్పుడూ మన ముందు ఉన్నాయి. వైదొలగడంపై ఈయూతో ఏ ఒప్పందమూ కుదుర్చుకోకపోతే, అసలు ఒప్పందమే లేకుండా బయటకు రావాల్సి ఉంటుందని ఈయూ, బ్రిటన్‌లోని చట్టాలు చెబుతున్నాయి. ఏ ఒప్పందం చేసుకోవాలన్నది నిర్ణయించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది'' అని ఎంపీలను ఉద్దేశించి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తన ఒప్పందానికి ఈ నెల 20లోగా ఆమోదం తెలపకపోతే బ్రెగ్జిట్‌కు ఎక్కువ కాలం పట్టొచ్చని ఎంపీలను ప్రధాని హెచ్చరించారు. మేలో యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, ఒప్పందం ఇప్పుడు ఆమోదం పొందకపోతే బ్రెగ్జిట్ ప్రక్రియను ఆ ఎన్నికల సమయంలో చేపట్టాల్సి రావొచ్చని చెప్పారు.
మే 22 వరకు బ్రెగ్జిట్‌ను వాయిదా వేయాలనే ప్రతిపాదనను ఎంపీలు తిరస్కరించారు. దీనికి వ్యతిరేకంగా 374 మంది, అనుకూలంగా 164 మంది ఓటు వేశారు.
మేం రెండింటికీ సిద్ధమే: ఈయూ
బ్రిటన్ పార్లమెంటులో పరిణామాలపై యూరోపియన్ కమిషన్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ- ఈయూ నుంచి వెళ్లిపోవడానికి రెండే మార్గాలు ఉంటాయి. 1. ఒప్పందం చేసుకొని వెళ్లడం, 2. ఒప్పందం చేసుకోకుండా వెళ్లడం. బ్రిటన్ విషయంలో ఈయూ రెండింటికీ సిద్ధంగా ఉంది'' అని వ్యాఖ్యానించారు.
ప్రధాని థెరెసా మే ప్రతిపాదిత ఒప్పందంతో ఈయూ అంగీకరించిందని, దానిపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా, వద్దా అనే అంశంపై 2016 జూన్ 23న రెఫరెండం జరిగింది. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా 51.9 శాతం మంది ఓటేశారు. 48.1 శాతం మంది ఈయూలో కొనసాగాలని కోరుకున్నారు.
ఈయూ నుంచి 'బ్రిటన్' 'ఎగ్జిట్'(తప్పుకోవడం) అవ్వడాన్నే 'బ్రెగ్జిట్' అని పిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
- వీగన్ డైట్‌తో కాలుష్యానికి చెక్ పెట్టొచ్చా?
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- ప్రపంచాన్ని మార్చేయగల ఆవిష్కరణలు: మడతపెట్టగలిగే ఫోన్.. కర్టెన్లా చుట్టేయగలిగే టీవీ
- మీ కంప్యూటర్‌పై కేంద్రం కన్నేస్తోందా? ఇందులో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








