బ్రెగ్జిట్: థెరెసా మే ప్రభుత్వానికి ఆరు ప్రత్యామ్నాయాలు

ఫొటో సోర్స్, Getty Images
ఇవ్వాళ బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మే, ఈయూ అధికారుల మధ్య జరిగిన బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరగనుంది.
ఈ ఓటింగ్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వెలువడుతుండగా, ప్రభుత్వం మాత్రం ఓటింగ్ తప్పకుండా జరుగుతుందని అంటోంది.
ఒకవేళ ఎంపీలు బ్రెగ్జిట్ 'డైవర్స్ బిల్'కు అంగీకరిస్తే, బ్రిటన్ కాలమానం ప్రకారం మార్చి 29, 2019న బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి మార్గం సుగమం అవుతుంది.
థెరెసా మే అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి ఉన్న అవాంతరాలు:
అనేకమంది రాజకీయ విశ్లేషకులు ఈ ఒప్పందాన్ని పార్లమెంట్ తిరస్కరించవచ్చని భావిస్తున్నారు. మొత్తం 650 మంది సభ్యులలో థెరెసా మేకు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి 315 మంది సభ్యులున్నారు. డీయూపీకి చెందిన 10 మంది సభ్యులూ తమకు అనుకూలంగా ఓటు వేస్తారని మే భావిస్తున్నారు. డీయూపీ సభ్యుల మద్దతు లేకుంటే మే ప్రభుత్వానికి మెజారిటీ లేదు.
మొత్తం ప్రతిపక్ష సభ్యులంతా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండగా, మే సొంత పార్టీ ఎంపీలు కూడా మే నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది.
అయితే మే తిరుగుబాటుదారులందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్-ఈయూ ఒప్పందంలో కీలమైన అంశాలు:
- ఈయూతో సంబంధాలు తెంచుకున్నందుకు బ్రిటన్ సుమారు 39బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.3.6లక్షల కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది.
- ఈయూలో వేరే ప్రదేశాలలో నివసిస్తున్న బ్రిటన్ పౌరులకు, బ్రిటన్‌లో నివసిస్తున్న ఈయూ పౌరులకు ఏమౌతుందన్న దానిపై స్పష్టత లేదు.
బ్రిటన్-ఈయూలు ఒక వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు, వాణిజ్యం చక్కబడేందుకు డిసెంబర్ 31, 2020 వరకు సమయం ఉంటుంది.
ఎంపీలు ఒప్పందాన్ని తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?
దీనికి ఆరు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
1. ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి వెలుపలికి
ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే, బ్రిటన్ ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బయటకు రావచ్చు. అయితే ఇది జరిగే అవకాశం దాదాపు లేదు.

ఫొటో సోర్స్, AFP
2. రెండోసారి ఓటింగ్
ప్రభుత్వం మొదటిసారి ఓడిపోతే, రెండోసారి ఓటింగ్ కోసం పట్టుబట్టవచ్చు. అయితే ఒక అంశంపై ఒకే సెషన్‌లో ఎంపీలను రెండుసార్లు ఓటింగ్ కోరరాదన్న నియమం ఉంది.
అయితే హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి ఒకరు, దీనికి మినహాయింపు ఉంటుందని అన్నారు.
3. మళ్లీ ఈయూతో చర్చలు
ప్రభుత్వం తాము మరోసారి సమగ్రంగా చర్చలు జరుపుతామని కోరవచ్చు. కానీ దానికి సమయం పడుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ఈయూను డెడ్ లైన్ పొడిగించమని కోరవచ్చు. లేదా ఈయూ నుంచి బయటకు రావడానికి కారణమైన ఆర్టికల్ 50 ను రద్దు చేయవచ్చు.
అయితే మరోసారి చర్చలకు ఈయూ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.

ఫొటో సోర్స్, Getty Images
4. సాధారణ ఎన్నికలు
తన ఒప్పందానికి ఆమోదముద్ర కోసం థెరెసా మే మరోసారి ఎన్నికలకు సిద్ధపడవచ్చు.
అయితే దీనిని మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదించాలి. డెడ్ లైన్‌ను పొడిగించేందుకు ఈయూ అంగీకరించాలి.
5. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరిస్తే ప్రతిపక్షం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు.
లేదా స్వయంగా థెరెసాయే తన అధికారాన్ని నిరూపించుకోవడానికి బలనిరూపణకు సిద్ధం కావచ్చు.
6. మరో రెఫరెండం
ప్రభుత్వం మరో రెఫరెండంకు వెళ్లవచ్చు. అయితే మళ్లీ దీనికి కూడా సమయం పడుతుంది. ఇందుకోసం మరో కొత్త చట్టం చేయాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








