బ్రెగ్జిట్: థెరెసా మే డీల్‌ను రెండోసారి తిరస్కరించిన ఎంపీలు - బ్రెగ్జిట్ వాయిదా పడుతుందా?

ఫొటో సోర్స్, Reuters
యూరోపియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించి ప్రధానమంత్రి థెరెసా మే రూపొందించిన ముసాయిదా ఒప్పందాన్ని పార్లమెంటు తిరస్కరించింది.
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి తుది గడువు అయిన మార్చి 29వ తేదీకి ఇక కేవలం 17 రోజులే మిగిలివున్న నేపథ్యంలో పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది.
ఈ పరిస్థితుల్లో ఎటువంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలా అనే అంశం మీద పార్లమెంటులో బుధవారం ఓటింగ్ జరుగుతుందని థెరెసా పేర్కొన్నారు.
అది కూడా విఫలమైతే.. బ్రెగ్జిట్‌కు సంబంధించిన ఆర్టికల్ 50 గడువును పొడిగించే అంశంపై గురువారం ఓటింగ్ జరుగుతుందని చెప్పారు.
థెరెసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటు సభ్యులు తిరస్కరించటం ఇది రెండోసారి. జనవరిలో తొలిసారి బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కూడా ఎంపీలు తిరస్కరించారు.

ఫొటో సోర్స్, PA
దీంతో.. ఐరిష్ బ్యాక్‌స్టాప్ విషయంలో (ఈయూ సభ్య దేశమైన ఐర్లండ్‌కు - బ్రిటన్‌లో ఒక భాగమైన ఉత్తర ఐర్లండ్‌ల మధ్య భౌతిక సరిహద్దులు లేకుండా నివారించే ఏర్పాటు విషయంలో) యూరోపియన్ యూనియన్‌తో చర్చలు జరిపి చట్టబద్ధంగా ఉండే హామీలు పొందిన థెరెసా మే.. తాజా ఒప్పందానికి మద్దతు తెలపాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.
అయితే.. మంగళవారం ఈ ఒప్పందంపై జరిగిన ఓటింగ్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు 75 మంది సహా మొత్తం 391 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. ఒప్పందానికి అనుకూలంగా కేవలం 242 ఓట్లే లభించాయి.
ఈ నేపథ్యంలో.. ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి వైదొలగే అంశం మీద బుధవారం ఓటింగ్ జరుగుతుంది. అందులో టోరీ ఎంపీలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుందని థెరెసా తెలిపారు.
అంటే.. తమ పార్టీ నిర్వాహకుల ఆదేశాల ప్రకారం కాకుండా ఎంపీలు తమ అభీష్టానుసారం ఓటు వేయవచ్చు. ఓ కీలక విధానం విషయంలో అధికార పార్టీ ఇటువంటి వైఖరి అవలంబించటం అసాధారణం.
దీనినిబట్టి థెరెసా మే ''తాను దేశానికి సారథ్యం వహిస్తున్నాని నటించటం కూడా మానేశారు'' అని లేబర్ పార్టీ విమర్శించింది.

ఫొటో సోర్స్, Reuters
ప్రభుత్వం పార్లమెంటులో భారీ మెజారిటీ ఓడిపోయిందని.. సభలో తనకు మద్దతు లేదని సర్కారు అంగీకరించాలని లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే.. తన ప్రభుత్వం ఇటీవలే విశ్వాసపరీక్ష గలిచినందున రాజీనామా చేసే అంశం గురించి థెరెసా చర్చించలేదని ప్రధానమంత్రి కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
''బ్రెగ్జిట్‌ను వాయిదా వేయాలా? లేదంటే బ్రెగ్జిట్ మీద మరోసారి రిఫరెండం నిర్వహించాలా? లేకపోతే ఈ ఒప్పందం కాకుండా మరొక ఒప్పందం ద్వారా ఈయూ నుంచి వైదొలగాలా? అనే దానిని ఎంపీలు నిర్ణయించాల్సి ఉంటుంది'' అని థెరెసా చెప్పారు.
ఒకవేళ ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి వైదొలగాలని ఎంపీలు నిర్ణయించినట్లయితే.. ఐర్లండ్‌తో సరిహద్దు విషయంలో ఎలాంటి చర్యలు చేపడతామనే వివరాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు.
- బ్రెగ్జిట్ ప్రభావం భారత్‌పై ఉంటుందా?
- బ్రెగ్జిట్: ‘విడాకుల’ ఒప్పందంలో ఏముందంటే..
- బ్రెగ్జిట్: పార్లమెంటులో బిల్లు పాస్ కాకపోతే ఏమవుతుంది
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








