ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: జనసేన, వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలు ఏ వర్గాలకు ఏ హామీలిచ్చాయి?

ఫొటో సోర్స్, Tdp,ycp,janasena
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముక్కోణపు పోటీ కనిపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ప్రచార సభల్లో హామీల వర్షం కురిపించడమే కాకుండా తమ మేనిఫెస్టోల్లోనూ ఆ హామీలకు స్థానం కల్పించాయి.
అధికారంలోకి వచ్చాక ఎంతవరకు పట్టించుకున్నారన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం తమతమ ఎన్నికల ప్రణాళికల్లో ప్రతి వర్గానికీ లబ్ధి చేకూర్చే ఆలోచనలను పొందుపరిచాయి పార్టీలు.
ఉచితాలు, రాయితీలతో పాటు ఆకర్షణీయ పథకాలకూ స్థానమిచ్చాయి.
మేనిఫెస్టోల విడుదలలో జనసేన ముందుండగా.. కాస్త ఆలస్యంగా ఉగాది రోజున టీడీపీ, వైసీపీలు విడుదల చేశాయి.
మరి ఆయా పార్టీలు వివిధ వర్గాలకు, రంగాలకు సంబంధించి తమ ఎన్నికల ప్రణాళికల్లో ఏం చెప్పాయో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
రైతులకు
టీడీపీ:
* వచ్చే అయిదేళ్లూ అన్నదాత సుఖీభవ పథకం అమలు. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి కౌలు రైతులకూ వర్తింపు.
* రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం.
* రైతులకు ఉచితంగా 12 గంటల పాటు పగటిపూట విద్యుత్ సరఫరా.
* రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
* గిరిజన రైతులకు విత్తనాలు, తదితర ఇన్‌పుట్స్ ఐటీడీఏ ద్వారా ఉచితం.
* ఏపీని హార్టీ కల్చర్ హబ్‌గా మార్చడానికి ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరణ.
* మరో 50 లక్షల ఎకరాలలో సూక్ష్మసేద్య వ్యవస్థల ఏర్పాటు
* ప్రపంచ బ్యాంకు సహాయంతో గ్రామ సమృద్ధి యోజన కింద చిన్నచిన్న ఆహార పరిశ్రమల ఏర్పాటు
* మామిడి, అరటి రైతుల కోసం మ్యాంగో, బనానా బోర్డుల ఏర్పాటు
వైసీపీ:
* ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50 వేలు. పంట వేసే సమయానికి మే నెలలోనే రూ.12,500 అందజేత.
* రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం. రైతులకు పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంటు సరఫరా.
* ఆక్వా రైతులకు యూనిట్ రూపాయిన్నర ధరకే కరెంటు
* రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* సహకార డెయిరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ. 4 బోనస్.
* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డుట్యాక్స్, టోల్ ట్యాక్స్ రద్దు
* ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ. 7 లక్షలు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏటా 12,500 రూపాయలు అదనంగా అందజేత.
జనసేన:
* రైతులకు ఉపాధి కోసం 'ఆపర్చ్యూనిటీ జోన్ల' ఏర్పాటు
* గోదావరి బేసిన్‌లో రూ.5000 కోట్లతో అంతర్జాతీయ ధాన్య, పండ్ల మార్కెట్
* తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు
* మూడేళ్లపాటు రైతులకు ఎరువులు, వ్యవసాయ యంత్రాలు ఉచితంగా పంపిణీ
* ఉపాధి హామీ పథకం కిందకు వ్యవసాయ పనులు
* రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్ల పంపిణీ

మహిళలు
టీడీపీ:
* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం.
* డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు.
* వడ్డీలేని రుణాల పథకాన్ని కొనసాగిస్తూ అర్హత పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
* మహిళా ఉద్యోగినులకు స్కూటర్ కొనుగోలుకు రాయితీ
* ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు.
* రానున్న అయిదేళ్లలో మహిళలకు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక సహాయం.
వైసీపీ:
* ఎన్నికల రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందేలా చేయడం.
* మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు. ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.
* పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు
* 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదటి ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందజేత.
జనసేన:
* మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
* గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
* ఆడపిల్లల పెళ్లి కోసం లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు
* ప్రతి మండలంలోనూ మహిళా భద్రత, సాధికారత కోసం కేంద్రాలు ఏర్పాటు
* ప్రతి మండల కేంద్రంలోనూ మహిళల కోసం సమాచార, సలహా కేంద్రాలు ఏర్పాటు
* 'ఆడపడుచుకు కానుక' పేరిట ప్రతి మహిళకూ ఏటా రూ.10,001 చొప్పున పండుగల కానుక
* మహిళల అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యేక వైద్యశాలల ఏర్పాటు

ఫొటో సోర్స్, Pdpu
విద్యారంగం
టీడీపీ
* అన్ని పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్‌లు
* 2019 ఫిబ్రవరి 28 నాటికి తీసుకున్న అన్ని ఉన్నత విద్యారుణాలపై వడ్డీ మాఫీ
* అన్ని సామాజిక వర్గాల కాలేజీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీయంబర్స్ మెంట్
* ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
వైసీపీ:
* ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం.
* అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ
* పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
* పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి అందించడం.
* పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి సరఫరా చేయడం. మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచడం.
జనసేన:
* ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* విద్యార్థులందరికీ ఉచిత బస్సు, రైలు పాసులు. ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు కాలేజీల్లో 'డొక్కా సీతమ్మ క్యాంటీన్ల' ఏర్పాటు
* ఇంటర్మీడియెట్ విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు
* రాష్ట్రంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకూ ఏడాది మొత్తానికి ఒకేసారి ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించడం
* విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తక్కువ వడ్డీకే రుణాలు

ఫొటో సోర్స్, Getty Images
వైద్యం
టీడీపీ
* అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణం
* వైద్యులు, నర్సుల పోస్టులన్నీ భర్తీ
* రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్
* వైద్య విద్యలో పోస్టుగ్రాడ్యుయేట్ సీట్లను ఎంబీబీఎస్ సీట్లకు సమానంగా పెంచేందుకు కృషి
* మెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్లకు స్టైఫండ్ రూ.50 వేలకు పెంపు
వైసీపీ
* వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికీ, నెలకు 40వేల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు.
* వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి.
* ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యచికిత్స
* హైదరాబాద్, బెంగళూరు, చెన్నై..ఇలా ఎక్కడ చికిత్స చేయించుకున్నా.. మెరుగైన ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేయడం.
* అన్ని రకాల వ్యాధుల ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం.
* జబ్బుకు సంబంధించిన ఆపరేషన్ తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సాయం
* కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రత్యేకంగా నెలనెలా రూ. 10వేల పెన్షన్
జనసేన
* ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమా. చేతి వృత్తుల వారికి రూ. 2 లక్షల అదనపు బీమా
* జిల్లా ఆస్పత్రులన్నింటినీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా అభివృద్ధి
* మండలానికో సంచార వైద్యశాల, సంచార మందుల వాహనం
* వైద్య కేంద్రాలన్నింటినీ 30 పడకల ఆస్పత్రిగా మార్చి 24 గంటల సేవలు కల్పించడం
* గిరిజనులకు అత్యవసరం అందించేందుకు అయిదు గ్రామాలకో అంబులెన్సు
* ప్రతి మండలంలో ప్రభుత్వ వృద్ధాశ్రమాలు ఏర్పాటు

యువత
యువతకు
* 18 నుంచి 22 ఏళ్ల యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తూ రూ.2 వేల భృతి
* యువత రూ.10 లక్షల లోపు పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలకు పూర్తి వడ్డీ రాయితీ
* యువ ఎంటర్‌ప్రెన్యూవర్లకు రాయితీ రుణాలు
* టీడీపీ నిర్ణాయక కమిటీలలో యువతకు పదవులు
వైసీపీ
* ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తెస్తాం.
* ప్రతి గ్రామంలో గ్రామసచివాలయం ద్వారా అదే ఊరిలో పది మంది యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు
* ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీయువకులను నెలకు రూ. 5వేల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్‌గా, వార్డ్ వాలంటీర్‌గా నియామకం.
* రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల.
* ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు
* గవర్నమెంట్ కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో.. కార్లు, బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు, ఇంకా ఇటువంటి ఇతరత్రా ఆదాయాన్నిచ్చే గవర్నమెంటు కాంట్రాక్టులు అన్నీ నిరుద్యోగ యువతకే ఇచ్చేట్టుగా చట్టం.
* వారు కార్లు కాని, బస్సులు కాని ఇతరత్రా వాహనాలు, పరికరాలు కొనేందుకు సబ్సిడీ
జనసేన
* ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి కేలండర్ ఏర్పాటు
* ఆరు నెలల్లోగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
* యువతను పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు
* రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు 25,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
* ఎస్టీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు వారు ప్రారంభించే పరిశ్రమలకు, స్టార్టప్ సంస్థలకు రూ.2,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్‌సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








