ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: ఆ ఎన్నికల్లో ఏకంగా 68 మంది ఇండిపెండెంట్లు గెలిచారు

సంజన అన్నె

ఫొటో సోర్స్, facebook/sanjana anne

ఫొటో క్యాప్షన్, బిగ్‌బాస్-2 షోలో పాల్గొన్న సంజన నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాల్సిందేనా? పార్టీల అండ లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తే విజయం కష్టమా?

1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి గణాంకాలను పరిశీలిస్తే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి విజయం సాధించినవారి సంఖ్య కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోంది.

తెలుగు నేలన 1952 నుంచి ఎన్నికల చరిత్ర చూస్తే అత్యధికంగా 68 మంది ఇండిపెండెంట్లు ఒక ఎన్నికల్లో విజయం సాధించగా.. అత్యల్పంగా ఇద్దరు మాత్రమే ఇండిపెండెంట్లు మరో ఎన్నికల్లో విజయం సాధించారు.

ప్రస్తుత 2019 ఎన్నికల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో దిగారు.

ఆ మూడు ఎన్నికల్లో

1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలిచారు. ఏకంగా 68 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీకి 165 స్థానాలు రాగా 68 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీకి 29, కమ్యూనిస్ట్ పార్టీకి 11, సీపీఎంకి 9, జనసంఘ్‌కి 3 సీట్లు వచ్చాయి.

అయితే ఇండిపెండెంట్లలో అత్యధికులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 1971 నాటికి కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 230కి చేరింది.

ఆ తరువాత 1972 ఎన్నికల్లోనూ స్వతంత్రులు పెద్ద సంఖ్యలోనే గెలిచారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో 57 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

అలాగే, 1962 ఎన్నికల్లో కూడా 51 మంది ఇండిపెండెంట్లు గెలిచారు.

వర్మ

ఫొటో సోర్స్, facebook/svsnVarma

ఫొటో క్యాప్షన్, 2014 ఎన్నికల్లో ఎస్వీఎస్‌ఎన్ వర్మ పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు

2014లో ఇద్దరే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చిట్టచివరి అసెంబ్లీ ఎన్నికల్లో(2014) తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, ఆంధ్ర ప్రాంతంలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి.

ఆ ఎన్నికల్లో 1511 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడగా ఇద్దరికి మాత్రమే విజయం దక్కింది.

తెలంగాణలోని నర్సంపేట అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి, ఏపీలో పిఠాపురం నుంచి స్వతంత్రుడిగా బరిలో దిగిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మాత్రమే గెలిచారు.

ఏ ఎన్నికలలో ఎంతమంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)