వికాస్ దుబే: నేరస్థులు రాజకీయాల్లోకి ఎలా అడుగుపెడుతున్నారు?

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
నేరాలకు రాజకీయ రంగు పులమడం, రాజకీయాలకు నేరాల మరకలు అంటించడం.. ఈ రెండు అంశాలపై గత కొన్నేళ్లలో చాలా చర్చలు జరిగాయి. వీటిపై పుస్తకాలు రాశారు. కథనాలు ప్రచురితం అయ్యాయి. ఎన్నో పరీక్షల్లో వీటిపై ప్రశ్నలూ అడిగారు.
వీటన్నింటిలోనూ రాజకీయాలు, నేరాల మధ్య సంబంధమే ప్రధానం. దీనిపై దేశ నలుమూలల నుంచీ విమర్శలూ వెల్లువెత్తాయి. అయితే విమర్శలు ఎక్కువయ్యేకొద్దీ.. నేరాలు-రాజకీయాల మధ్య బంధం మరింత బలపడుతోంది.
కాన్పూర్‌లోని గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఇంటి దగ్గర కాల్పుల ఉదంతమే దీనికి ఉదాహరణ. వంద పోలీసు బృందాలు క్రియాశీలంగా పనిచేసినా అతడు తప్పించుకోగలిగాడు.
వికాస్ దుబేను అరెస్టుచేయడానికి వచ్చిన పోలీసులపై ఇంటి మీద నుంచి ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన తర్వాత, గ్రామం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ దుబే, అతడి అనుచరుల కోసం కొన్ని పోలీసు బృందాలతోపాటు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అతడ్ని పట్టిస్తే రూ. 50,000 నజరానా ఇస్తామనీ ఇదివరకే ప్రకటించారు.

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra/BBC
వికాస్ దుబేపై 60 కేసులు
అయితే, ఇప్పటివరకూ వికాస్ దుబే జాడ కనిపించలేదు. శుక్రవారం చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బికరూ గ్రామంలో విలాసవంతమైన అతడి ఇంటిని పోలీసులు, జిల్లా పరిపాలనా విభాగం కలిసి బుల్డోజర్లతో పడగొట్టారు. ఇంటి దగ్గర పార్క్ చేసిన వాహనాలకూ నిప్పు పెట్టారు.
ఈ ఎదురుకాల్పుల అనంతరం వికాస్ దుబే నేర చరిత్రను డీజీపీ హితేశ్ చంద్ర అవస్థీ బయటపెట్టారు. చౌబేపుర్ పోలీస్ స్టేషన్‌లో వికాస్‌పై 60 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నం కేసులూ ఉన్నాయి.
మరోవైపు వికాస్ దుబే రాజకీయ సంబంధాలపైనా అందరి దృష్టి పడింది. దీంతో, దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోనూ అతడికి సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఏ పార్టీలోనూ అతడు నేరుగా సభ్యత్వం తీసుకోలేదు.
ఇటీవల జిల్లా పంచాయతీ ఎన్నికల్లో వికాస్ దుబే సతీమణి పోటీచేశారు. ఆ సమయంలో విడుదలచేసిన పోస్టర్లపై సమాజ్‌వాదీ పార్టీ జెండా రంగులు కనిపించాయి. మరోవైపు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యదవ్‌ల ఫోటోలు పోస్టర్‌పై ఉన్నాయి.
కానీ, పోస్టర్‌పై పార్టీ ఎన్నికల గుర్తు కనిపించలేదు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకి దిగేటప్పటికీ చాలా మంది ఇలాంటి పోస్టర్లను విడుదల చేస్తారని ఎస్పీ నాయకుడు ఒకరు వివరించారు.

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra/BBC
వికాస్ దుబే ఎప్పుడూ తమ పార్టీలో చేరలేదని కాన్పూర్‌లోని ఆర్యనగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే, ఎస్‌పీ నాయకుడు అమితాబ్ వాజ్‌పేయీ వివరించారు.
"ఎస్‌పీలో ఆయన ఎప్పుడూ లేడు. 2007లో నేను అక్కడి నుంచే పోటీచేశాను. అప్పుడు ఆయన నాతో లేడు. ఓ సామాన్య పౌరుడిగా ఆయన అన్ని పార్టీలతోనూ మాట్లాడతారు. చాలా పార్టీల పోస్టర్లపై ఆయన ఫోటోలు కనిపిస్తాయి. చాలా మంది నాయకులతో ఆయన ఫోటోలు దిగుతారు. అయితే ఆయన మా పార్టీతో ఎప్పుడూ లేడు. ఇది నేను పక్కాగా చెప్పగలను."
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల జెండా రంగులతో ముద్రించిన వికాస్ దుబే పోస్టర్లు కూడా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు చాలామంది బీజేపీ నాయకులతో ఆయన కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధమూలేదని బీజేపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు.
"పార్టీలో ఆయన ఎలాంటి పదవులూ నిర్వహించలేదు. అయితే అతడి సభ్యత్వం గురించి నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే.. మిస్డ్‌కాల్ ద్వారా కూడా పార్టీ సభ్యత్వం పొందే విధానం అమలవుతోంది"అని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు వివరించారు.
వికాస్ దుబే ఏ పార్టీలోనూ చేరకపోయినా.. అతడికి అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలున్నాయని, చాలా మంది నాయకులతో ఆయన వేదికలపై కూర్చుంటారని కాన్పూర్‌లో నవ్‌భారత్ టైమ్స్ పాత్రికేయుడు ప్రవీణ్ మొహ్తా చెప్పారు.
"చాలా నేరాల్లో ఆయన పేరు వినిపించేటప్పటికీ.. ఆయన చట్టం కళ్లుగప్పి తిరిగుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రాజకీయాలతో సంబంధంలేకుండా ఇలా చేయడం అసాధ్యం. అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకు సంబంధమున్నట్లు ఆధారాలున్నాయి. అయితే కాల్పుల ఘటన అనంతరం అన్ని పార్టీలు ఆయనతో సంబంధంలేదని చెబుతున్నాయి."

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra/BBC
రాజకీయ నాయకులతో సంబంధాలు
వికాస్ దుబేకు చాలా మంది రాజకీయ నాయకులతో సంబంధముందని, కొందరు ఆయన ఇంటికి కూడా వచ్చి పోతుంటారని బికరూ గ్రామ వాసి ఒకరు చెప్పారు. "దుబే నిర్వహించే కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులూ వచ్చేవారు. అధికారంలో ఏ ప్రభుత్వమున్నా... దుబే తనకు అవసరమైన పనులను తేలిగ్గా చేయించుకునేవాడు."
నిజానికి వికాస్ దుబే ఒక్కడే కాదు.. ఇలాంటి చాలామంది మాఫియా నాయకులు, నేరస్థులకు రాజకీయ పార్టీలతో చాలా దగ్గర సంబంధాలుంటాయి. వీరు నేరాలు చేస్తూ ఆర్థికంగా ఎదిగి.. రాజకీయ పార్టీలకూ లబ్ధి చేకూరుస్తున్నారు.
"రాజకీయా పార్టీలకు వీరితో ఉపయోగముంది. ఎన్నికల్లో విజయం సాధించడానికి వీరు కీలకంగా మారుతారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. వీరిని గెలుపు గుర్రాలుగా అందరూ పిలుస్తారు. డబ్బు, బలగంతోపాటు కొన్నిసార్లు కుల సమీకరణాలు కుదరడంతో వీరు రాజకీయ నాయకులకు క్రియాశీలంగా మారుతారు. అందుకే ఎన్నికల్లో రాజకీయ నాయకులు గెలిచాక వీరు సాయానికి తగిన ప్రతిఫలాన్ని పిండేసుకుంటారు"అని లఖ్‌నవూలోని టైమ్స్ ఆఫ్ ఇండియా పొలిటికల్ ఎడిటర్ సుభాష్ మిత్ర వివరించారు.
"వికాస్ దుబే గురించి చెప్పాలంటే.. 2001లో మంత్రి హత్య కేసులో అతడికి వచ్చిన క్లీన్‌చిట్.. ప్రభుత్వ సాయం లేకుండా సాధ్యపడిందని అంటారా?"
"అప్పుడు కూడా పోలీసులు ఆయనను అరెస్టు చేయలేకపోయారు. వికాస్ దుబేనే లొంగిపోయాడు. అప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ తర్వాత బీఎస్‌పీ, ఎస్పీ ప్రభుత్వాలకూ ఆయన కోట్లాది రూపాయాల విరాళాలను ఇచ్చాడు. అతడిపై భూఆక్రమణ ఆరోపణలూ ఉన్నాయి. ఇవన్నీ నేరస్థులు, పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య సంబంధాలకు ఉదాహరణలు. వీటి గురించి అందరికీ తెలుసు."

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra/BBC
మాఫియాతో నాయకుల సంబంధాలు
"ఇలాంటి గ్యాంగ్‌స్టర్లను ఇతర ప్రాంతాల్లోనూ చూడొచ్చు. వీరిపై డజన్లకొద్దీ కేసులు ఉంటాయి. వీటిలో కొన్ని చాలా తీవ్రమైన కేసులుంటాయి. అయినా పార్టీలు వారికి సభ్యత్వంతోపాటు ఎన్నికల్లో టికెట్లు కూడా ఇస్తాయి"అని సుభాష్ మిశ్రా వ్యాఖ్యానించారు.
"2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఓ మాఫియా నాయకుడ్ని బీజేపీ పార్టీలో చేర్చుకుంది. అతడు దేవరియాలో ప్రచారం చేపట్టాడు. ఎందుకంటే అక్కడ బీజేపీ నాయకుడు ఓడిపోయేలా ఉన్నాడని అతడితో ప్రచారం చేపట్టించారు. అతడు ఇదివరకు ఆర్జేడీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. అతడు దేవరియాకి చెందినవాడే. అతడికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు."
అయితే, ఈ విషయంపై లఖ్‌నవూలోని సీనియర్ పాత్రికేయుడు యోగేశ్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. "స్థానిక స్థాయిలో మాఫియా-రాజకీయనాయకుల సంబంధాల వల్ల ఒకరితో మరొకరికి ఉపయోగం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీల్లోని అగ్రనేతలతో మాఫియాకు పెద్దగా సంబంధాలుండవు. ఇవన్నీ వారికి తెలియకుండా జరుగుతాయి. అందుకే ఇలాంటి మాఫియా నాయకులు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది నిజమే ఇలాంటివారు చాలా మంది ఎన్నికల్లో నిలబడ్డారు. గెలిచారు కూడా.. ఇలాంటివారు మొదట ఎక్కువగా స్వతంత్రంగా బరిలోకి దిగుతారు. అయితే గత కొన్నాళ్లుగా ఇది మారడం కనిపిస్తోంది. పార్టీలే వీరికి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. వీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు కూడా"అని మిశ్ర వ్యాఖ్యానించారు.
"రాజకీయాలు-నేరాల మధ్య సంబంధానికి రాజకీయ పార్టీలే బాధ్యులు. అయితే ఓటర్లు కొంచెం తెలివిగా ఆలోచించి.. ఇలాంటి అభ్యర్థులు ఎన్నికల్లో గెలవకుండా చెక్ పెట్టాలి"అని మిశ్రా వివరించారు.
"సుప్రీం కోర్టు క్రియాశీలంగా వ్యవహరించడంతో ఈ ట్రెండ్ కొంతవరకూ తగ్గింది. ఇదివరకు చాలామంది నేరస్థులు చట్టసభల్లో కనిపించేవారు. ఇప్పటికీ ఉన్నారు.. అయితే ఇంతకుముందు ఉన్నంత మంది లేరు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు రాజకీయ ప్రత్యర్థులూ తప్పుడు కేసులు బనాయిస్తుంటారు. అలాంటి సమయాల్లో నిజమైన మాఫియా నాయకులు ఎవరో గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది."
అయితే, నేరాలు-రాజకీయాల మధ్య సంబంధం స్థానిక స్థాయికే పరిమితం కాలేదు. పార్లమెంటు స్థాయిలోనూ ఇది కనిపిస్తోంది.
తీవ్రమైన నేర చరిత్ర కలిగిన కొందరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు కూడా..
2017లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన 402 మంది ఎమ్మెల్యేల్లో 143 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఎన్నికల ప్రమాణ పత్రంలో కేసుల గురించి వీరు ప్రస్తావించారు.
ఆ సమయంలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేల్లో 37 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 312 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 83 మందిపై కేసులున్నట్లు ప్రమాణ పత్రాల్లో పేర్కొన్నారు.
47 మంది ఎస్పీ ఎమ్మెల్యేల్లో 14 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 19 మంది బీఎస్‌పీ ఎమ్మెల్యేల్లో ఐదుగురిది ఇదే పరిస్థితి. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి.
ఈ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గెలిచారు. వీరి ముగ్గురిపైనా క్రిమినల్ కేసులున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- హాంకాంగ్ - జుహాయ్ మార్గం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
- హాంకాంగ్: ఇక్కడ పాఠశాల విద్య ఖర్చు ఏడాదికి రూ.94 లక్షలు
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- చైనా దాడిపై భారత్‌కు నిఘా సమాచారం అందలేదా?
- హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయా? ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








